ఆస్ట్రేలియాలో భారతీయ కుంటుంబంపై దాడి.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదంటూ బాధితుల ఆవేదన..

ABN , First Publish Date - 2022-02-16T03:37:08+05:30 IST

ఆస్ట్రేలియాలో జాత్యాహంకారం మరోసారి బుసలు కొట్టింది. ‘‘మా దేశాన్ని విడిచి వెళ్లండి’’ అంటూ ఓ దుండగుడు వారిపై దాడికి తెగబడ్డాడు. ఫిబ్రవరి 12న ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియాలో భారతీయ కుంటుంబంపై దాడి.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదంటూ బాధితుల ఆవేదన..

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో జాత్యాహంకారం మరోసారి బుసలు కొట్టింది. ‘‘మా దేశాన్ని విడిచి వెళ్లండి’’ అంటూ ఓ దుండగుడు వారిపై దాడికి తెగబడ్డాడు.  ఫిబ్రవరి 12న ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుటుంబపై దాడి జరిగిన విషయాన్ని కెర్రీ ప్రకాశం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. బాధితుల కథనం ప్రకారం..  మెల్‌బోర్న్‌లోని లిన్ బ్రుక్ హోటల్‌కు సమీపంలో ఆ కుటుంబం కారు దిగుతుండగా.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి వారి వైపు వచ్చాడు. కెర్రీ తండ్రి కీత్‌ను ఉద్దేశిస్తూ దుర్భాషలాడాడు. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నోరు పారేసుకున్నాడు. అయితే.. కీత్‌  అతడిని పట్టించుకోకుండా తన దారిన తాను వెళుతుండగా దుండగుడు ఆయనను అడ్డగించి ఛాతిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ క్రమంలో కీత్ భార్య జాక్వెలిన్..తన భర్తపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె కూడా దాడికి గురైంది. 


మరోవైపు.. జాక్వెలిన్ సోదరుడు లిన్ బామ్ నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మరింత రెచ్చిపోయిన ముష్కరుడు లిన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆయన మొహంపై ముష్టిఘాతాలు కురిపించి, కిందపడేసి తన్నుతూ నానా బీభత్సం సృష్టించాడు. అదృష్టవశాత్తూ.. అక్కడే ఉన్న స్థానికుడు ఒకరు కల్పించుకోవడంతో నిందితుడు పారిపోయాడు. కాగా.. లిన్ బ్రూక్ హోటల్ సిబ్బంది తమకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని కెర్రీ ఆరోపించారు. ‘‘అతడు నన్ను కింద పడదోసి తన్నడం ప్రారంభించాడు. నా జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు ’’ అంటూ లిన్ బామ్ మీడియాతో వాపోయారు.  ఓ రోజు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు ఆ తరువాత తనంతట తానుగా వారికి లొంగిపోయినట్టు తెలుస్తోంది.  ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-02-16T03:37:08+05:30 IST