fifa ban india : తష్కెంట్‌లో చిక్కుకున్న ఇండియన్ ఫుట్‌బాల్ క్లబ్ మహిళా జట్టు.. తక్షణ సాయం చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి..

ABN , First Publish Date - 2022-08-17T23:05:46+05:30 IST

భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య ‘ ఏఐఎఫ్ఎఫ్’ (AIFF)పై ఫిఫా(FIFA) నిషేధం కారణంగా జీకేఎఫ్‌సీ(GKFC) మహిళా జట్టుకి అనూహ్య పరిస్థితి ఎదురైంది

fifa ban india : తష్కెంట్‌లో చిక్కుకున్న ఇండియన్ ఫుట్‌బాల్ క్లబ్ మహిళా జట్టు.. తక్షణ సాయం చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి..

తష్కెంట్ : భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య ‘ ఏఐఎఫ్ఎఫ్’ (AIFF)పై ఫిఫా(FIFA) నిషేధం కారణంగా జీకేఎఫ్‌సీ(GKFC) మహిళా జట్టుకి అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఉజ్జెకిస్తాన్‌లో మొదలవనున్న ఏఎఫ్‌సీ ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో ఆడడానికి వీలులేకుండా పోయింది. దీంతో బుధవారం ఉదయమే   తష్కెంట్‌(Tashkent) చేరుకున్న జట్టు అక్కడ చిక్కుకుందని ట్విటర్ వేదికగా జీకేఎఫ్‌సీ(గోకులం కేరళ ఫుట్‌బాల్ క్లబ్) తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), క్రీడాశాఖ మంత్రి అనురాగ్ థాకూర్(Anurag Thakur) తక్షణమే జోక్యం చేసుకుని ఏఎఫ్‌సీలో ఆడేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఎలాంటి పొరపాటు చేయకపోయినా 23 మంది మహిళా క్రీడాకారిణీలు తష్కెంట్‌లో నిస్సహాయ స్థితిలో ఉన్నారని వాపోయింది. ‘‘ మా జట్టు ఆగస్టు 16, 2022(బుధవారం) ఉదయం కోజికోడ్ నుంచి ఉబ్జెకిస్తాన్‌లోని తష్కెంట్ చేరింది. ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం విధించిందనే వార్తలు విమానం దిగిన తర్వాత మాకు తెలిశాయి. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు భారత క్లబ్‌ జట్లు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనడానికి వీలు లేదు. కాబట్టి ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారులు జోక్యం చేసుకుని ఫిఫా నిషేధం ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలి. ఏఎఫ్‌సీలో ఆడేలా చొరవ తీసుకోవాలి ’’ అని జీకేఎఫ్‌సీ పేర్కొంది.


నిషేధానికి కారణం ఇదే..

కొంతకాలంగా ఎన్నికలు జరగక, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ లేకుండా ఉన్న సమాఖ్యలో బయటి వ్యక్తుల (థర్డ్‌పార్టీ) ప్రమేయం ఎక్కువయ్యిందనే ఆరోపణలతో ఏఐఎఫ్ఎఫ్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘం (ఫిఫా) నిషేధం విధించింది. ఈ నిషేధం నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. 85 ఏళ్ల ఏఐఎఫ్‌ఎఫ్‌ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. ‘భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం విధించాలని ఫిఫా కౌన్సిల్‌ బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించింది. ‘‘ ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది. సమాఖ్య కార్యకలాపాల్లో బయటి వ్యక్తుల మితిమీరిన జోక్యం ఎక్కువయ్యింది. ఇది ఫిఫా నిబంధనలకు పూర్తి వ్యతిరేకం. అందుకే ఇలాంటి తీవ్ర చర్య తీసుకోవాల్సి వచ్చింది’’ అని ఫిఫా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుత   కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)ని రద్దు చేయడంతో పాటు, రోజువారీ కార్యకలాపాలపై ఏఐఎ్‌ఫఎఫ్‌ తిరిగి పూర్తి నియంత్రణ పొందితేనే సస్పెన్షన్‌ నుంచి వెనక్కి తగ్గే అవకాశముందని ఫిఫా పేర్కొంది. ప్రస్తుత పరిణామాలపై అత్యవసర విచారణ కోసం కేంద్రం.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై కోర్టు బుధవారం విచారించనుంది. వాస్తవానికి ఫిఫాకు చెందిన నలుగురు సభ్యుల బృందం, క్రీడాశాఖ సీనియర్‌ అధికారుల మధ్య గత శుక్రవారం, సోమవారం చర్చలు కూడా జరిగాయి. సానుకూల ఒప్పందం దిశగానే భేటీ సాగినట్టనిపించినా హఠాత్తుగా ఫిఫా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది.


భారత జట్టుపై తీవ్ర ప్రభావంఫిఫా చర్య ప్రకారం తదుపరి నోటీసు వచ్చేవరకు ఏఐఎ్‌ఫఎఫ్‌ అన్ని సభ్యత్వ హక్కులను కోల్పోతుంది. ముందుగా ఈ సంచలన నిర్ణయం అండర్‌-17 మహిళల వరల్డ్‌క్‌పపై పడింది. భారత్‌లోనే ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి 30 వరకు జరగాల్సిన ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని ఫిఫా తేల్చింది. టోర్నీ ఎప్పుడు, ఎక్కడ జరపాలనే నిర్ణయం త్వరలోనే తీసుకుంటామంది.  అంతేకాకుండా సస్పెన్షన్‌ ఎత్తేసే వరకు భారత ఫుట్‌బాల్‌ క్లబ్బులు, ప్రతినిధులు, ఆటగాళ్లు, రెఫరీలు, అధికారులు ఇకపై అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి వీల్లేదు. దీంతో వచ్చే నెలలో జరిగే వియత్నాం, సింగపూర్‌తో భారత జట్టు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు, ఏఎ్‌ఫసీ కప్‌ ఇంటర్‌ జోనల్‌ సెమీఫైనల్స్‌లో  మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌ కూడా రద్దు కాక తప్పదు.

Updated Date - 2022-08-17T23:05:46+05:30 IST