భారత్‌ అద్భుతం

ABN , First Publish Date - 2022-05-27T09:40:00+05:30 IST

కుర్రాళ్లతో కూడిన భారత హాకీ జట్టు ఆసియాకప్‌లో అసామాన్య ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఒకటా..

భారత్‌ అద్భుతం

ఇండోనేసియాపై 160తో ఘనవిజయం

సూపర్‌ 4లో ప్రవేశం.. ఆసియాకప్‌ హాకీ టోర్నీ

జకార్తా: కుర్రాళ్లతో కూడిన భారత హాకీ జట్టు ఆసియాకప్‌లో అసామాన్య ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఒకటా.. రెండా.. నాకౌట్‌కు చేరాలంటే 15 గోల్స్‌ తేడాతో గెలవాల్సిన వేళ, ఈ ద్వితీయ శ్రేణి జట్టు మహాద్భుతమే చేసింది. గురువారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో కసిదీరా ఆడి ఏకంగా 16-0 తేడాతో ఘనవిజయం సాధించడం విశేషం. డిఫెండర్‌ దిప్సన్‌ టిర్కే ఐదు గోల్స్‌తో, అభరన్‌ సుదేవ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో కీలక పాత్ర పోషించారు.


అయితే అంతకుముందు జపాన్‌ జట్టు పాక్‌ను 3-2తో ఓడించడంతో.. పూల్‌ ‘ఎ’లో పాక్‌ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలవాలంటే భారత్‌ కచ్చితంగా 15 గోల్స్‌ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరోవైపు పూల్‌ ‘ఎ’ నుంచి జపాన్‌, భారత్‌.. పూల్‌ ‘బి’ నుంచి మలేసియా, దక్షిణ కొరియా సూపర్‌ 4కు చేరగా, అటు పాక్‌ ఆసియాకప్‌ నుంచే కాకుండా వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌ నుంచి కూడా నిష్క్రమించినట్టయింది. 


మెరుపుదాడి

తొలి మ్యాచ్‌లో డ్రా, రెండో మ్యాచ్‌లో ఓటమితో కేవలం ఒక్క పాయింట్‌తో  బీరేంద్ర లక్రా నేతృత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌ బరిలోకి దిగింది. అన్ని విభాగాల్లోనూ విఫలమై విమర్శలు ఎదుర్కొన్న వేళ.. అసలైన మ్యాచ్‌లో మాత్రం సత్తా చూపింది. తొలి 15 నిమిషాల్లోనే పవన్‌ రాజ్‌బర్‌ చేసిన రెండు గోల్స్‌తో భారత్‌ వేట ఆరంభమైంది.


ఆ తర్వాత మరో గోల్‌తో తొలి క్వార్టర్‌ ముగియగా.. రెండో క్వార్టర్‌లో మరో మూడు గోల్స్‌తో 6-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో క్వార్టర్‌ నుంచి దిప్సన్‌ టిర్కే హవా సాగింది. చివరి నిమిషం వరకు జట్టు విజయం కోసం ప్రయత్నించిన అతడు ఐదు గోల్స్‌తో చెలరేగాడు. ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా భారత్‌ 14-0తో ఉంది. కానీ నాకౌట్‌ బెర్త్‌కు మరో గోల్‌ అవసరపడగా ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి నిమిషాల్లో దిప్సన్‌ టిర్కే మరో రెండు గోల్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

Updated Date - 2022-05-27T09:40:00+05:30 IST