సంబురాల వేళ కొన్ని సందేహాలు!

ABN , First Publish Date - 2022-08-12T09:19:51+05:30 IST

భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంలో మనం ఒక్కసారి వెనుదిరిగి చరిత్రను పరామర్శించుకుని, వర్తమానాన్ని విమర్శించుకోవాలి.

సంబురాల వేళ కొన్ని సందేహాలు!

భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంలో మనం ఒక్కసారి వెనుదిరిగి చరిత్రను పరామర్శించుకుని, వర్తమానాన్ని విమర్శించుకోవాలి. లేనిపక్షంలో ఈ అమృత ఉత్సవాల రాజకీయ ప్రాధాన్యం మరుగున పడిపోతుంది. స్వాతంత్ర్యం గురించిన నిర్వచనాలు, అర్థాలు, వీటిలో గత 165 సంవత్సరాలుగా వచ్చిన మార్పులను గమనించటం అవసరమైన కాలం ఇది. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం నుంచీ స్వాతంత్ర్య కాంక్ష ప్రజలలో పెరిగిన తీరు, దేశభక్తులు చేసిన త్యాగాలు, జాతి ఒకటైన రీతి, దేశంగా నిర్దిష్ట రూపాన్ని పొందిన విధం– వీటన్నిటినీ తలచుకోవాల్సిన సందర్భమిది స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ నిర్మాణం, దేశాభివృద్ధికి వేసిన ప్రణాళికలు, వాటి బాగోగులు, పౌరసమాజ స్పందన గురించి సమీక్షించుకోవలసిన సందర్భమిది. అనేక వ్యవస్థలలో, ముఖ్యంగా పాలన, న్యాయ వ్యవస్థలలో, శిక్షాస్మృతులలో బ్రిటిష్‌ వలస పాలకులు వేసిన ముద్రలను తుడిచివేసుకోలేకపోవటం గురించి ఆలోచించాల్సిన సమయమిది. వర్తమాన సామాజిక పరిస్థితులకూ, స్వాతంత్ర్య నిర్వచనాలకూ గల సామ్యాలను, వైరుధ్యాలనూ అంచనా వేసుకుని కర్తవ్యాన్ని నిర్దేశించుకోవలసిన రాజకీయ సందర్భమిది.


ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం నాటికి స్వతంత్రమంటే ఉన్న అర్థం దేశంలోని అనేక చిన్న చిన్న రాజ్యాలను, మొఘల్‌ సామ్రాజ్యాన్ని బ్రిటిష్‌ ఆక్రమణ నుంచి విముక్తం చేసుకోవటం, సంరక్షించుకోవటం. ఆయా రాజుల, చక్రవర్తుల సార్వభౌమాధికారాన్ని నిలబెట్టటం. దీనితో సైన్యానికి ఉన్నంత దగ్గరి సంబంధం సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా లేదు. పరోక్షంగా ఉంది. తర్వాత బెంగాల్‌ విభజన సమయానికి ప్రజలకు ప్రత్యక్ష, చురుకైన సంబంధం ఏర్పడింది. ప్రజలను విడదీయటం, సరిహద్దులను ఏర్పరచటం ద్వారా తమ పాలనకు మరింత స్థిరత్వాన్ని, సమ్మతిని ఏర్పరుచుకోవాలనుకున్న వలస పాలకుల విధానాలు ప్రజలను నేరుగా తాకాయి. వారి న్యాయ వ్యవస్థ, నేరము– శిక్ష వంటి విషయాలలో వారి పద్ధతులు ప్రజలలో అసమ్మతిని పెంచాయి.


గాంధీ అప్పుడు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత రాజకీయ వ్యూహాలు, సామాన్య ప్రజలకు దగ్గర కావటం మీద ఆయన ఎక్కువ దృష్టిపెట్టారు. సంస్కరణ ఉద్యమాలను (మద్యపాన వ్యతిరేక, హరిజన) స్వాతంత్ర్య పోరాటాలను కలగలపటానికి చేసిన ప్రయత్నాలు, భారతదేశమంటే లక్షలాది గ్రామాల సమాహారమంటూ గ్రామీణ ప్రజలకు దగ్గరవటం... వీటన్నిటితో ప్రజలకు స్వతంత్రమంటే కొత్త అర్థాలు స్ఫురించటం మొదలైంది. ‘ఇంగ్లీషువాడు పోతే మా ఊరి హెడ్‌కానిస్టేబుల్‌కి బదిలీ అవుతుందా’ అన్న ప్రశ్న నుంచి, మనం బ్రిటిష్‌ పాలకులకు పన్ను కట్టకుండా, పాలనలో సహకరించకుండా సత్యాగ్రహం చేస్తే వారి ఏలుబడి నుంచి విముక్తం కావచ్చుననే స్పృహ పెరిగింది. చంపారన్‌ నుంచి చీరాల– పేరాల వరకూ అనేక చోట్ల సామాన్య రైతులు స్వాతంత్ర్యమంటే ఏమిటి? అని ఆలోచించారు. పాలకులను ధిక్కరించటం, వారిపై మన ఆగ్రహాన్ని ప్రకటించటం మన హక్కనీ, స్వాతంత్ర్యం జన్మహక్కనీ అర్థమవటం, అవగాహనలోకి రావటం జరిగింది. దీనితోపాటు వలసపాలకుల అణచివేత చర్యలు, హింస, నిర్బంధాలు, జలియన్‌వాలా బాగ్‌ వంటి దురంతాలు కూడా పెరిగాయి. ఆ క్రమంలోనే ప్రజలలో స్వరాజ్యకాంక్ష ప్రబలింది. తమను తాము పాలించుకోవటమనే కర్తవ్య స్ఫూర్తి కలిగింది.


స్వాతంత్ర్యం వచ్చాక, దేశ విభజన జరిగాక భారతదేశం నిర్దిష్ట సరిహద్దులతో ఏర్పడింది. అప్పుడు ఆలోచనలు దేశాభివృద్ధిపై కేంద్రీకృతమైనాయి. రాజ్యాంగం భారత ప్రజలు రాసుకుని సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకుని ఆర్టికల్‌ 15లో అన్ని వివక్షల నుంచీ సమానత్వం ప్రకటించాక స్వాతంత్ర్యానికి కొత్త అర్థం వచ్చింది. స్వాతంత్ర్యానంతరం స్వతంత్రానికి, స్వరాజ్యానికి కొత్త అర్థాన్ని, విలువను, నైతికతను ఇచ్చినది అంబేడ్కర్‌. అంబేడ్కర్‌ ప్రాధాన్యత కొత్త దేశానికి ప్రాణవాయువు వంటి రాజ్యాంగాన్ని అందించటంలో దాని లోతుపాతులు విప్పి చెప్పటంలో అంబేడ్కర్ ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాధాన్యం ఈ 75 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తోంది. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగంలోని లోతును, విస్తృతినీ అర్థం చేసుకున్నకొద్దీ, దానిని వ్యాఖ్యానించుకున్నకొద్దీ ఆయన స్వతంత్ర భారత రూపశిల్పిగా గుర్తింపబడుతున్నారు. ఆయన రచనల అధ్యయనం ఎంతో ముఖ్యమని యువతరానికి గుర్తు చేసి ప్రోత్సహించవలసిన సందర్భమిది.


దేశాభివృద్ధి విషయానికి వస్తే తొలి ప్రధాని నెహ్రూ ముందున్న రెండు అభివృద్ధి నమూనాలను (పెట్టుబడిదారీ, సోషలిస్టు) కలిపి మిశ్రమ ఆర్థిక విధానాన్ని రూపొందించాడు. సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి చేయాలనుకున్నాడు. 


భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు ప్రభుత్వరంగం నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటివరకూ వ్యక్తిగత బాధ్యతలనుకున్న విద్య, వైద్య, ఉపాధి రంగాలు ప్రభుత్వ బాధ్యతలయ్యాయి. ఒకవైపు భారీ ప్రాజెక్టులు కల్పించిన ఆశలు, నెరవేర్చిన ప్రయోజనాలు, ఇంకొకవైపు నాశనమైన జాతులు, పర్యావరణం ఏది నైతికమనే ప్రశ్న బయలుదేరింది. ప్రత్యామ్నాయం కోసం చిన్న చిన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యానికి అర్థం ఏమిటన్న ప్రశ్న మళ్లీ కొత్తగా మొదలై స్వతంత్రం దక్కింది ఎవరికి అన్న కొత్త ప్రశ్న జన్మించింది. స్వాతంత్ర్యోద్యమంలోనే పదునెక్కిన ప్రజా సమూహాలు గనుక రాజకీయంగా చురుకుదనంతోనే ఉన్నారు. 60, 70వ దశాబ్దాలలో విద్యార్థి ఉద్యమాలు, నక్సల్బరీ ఉద్యమం, మేధావులు, రచయితల కార్యాచరణ, సంపూర్ణ విప్లవపు పిలుపు, ప్రభుత్వరంగ సంస్థలలో సమ్మెలు, అక్కడి యూనియన్ల రాజకీయ చైతన్యం– వీటన్నిటినీ ఒక్కసారిగా అణచివేయాలనుకుని విధించిన అత్యవసర పరిస్థితి– స్వాతంత్ర్యానికి సంకెళ్లు పడ్డాయని తలచే రోజులు వచ్చాయి. తర్వాత భారతదేశ స్వాతంత్ర్యం ఒక ప్రమాదం తర్వాత మరొక ప్రమాదంలో పడుతూ గాయాల పాలవుతూ వచ్చింది. ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోత, బాబ్రీ మసీదు కూల్చివేత, దళితులపై పెరిగిన హింసా వివక్షలు, మతతత్వ రాజకీయాల విజృంభణ, గుజరాత్‌ జెనోసైడ్‌, కశ్మీరు కల్లోలం– వీటన్నిటిలోనూ, వీటన్నిటివల్లా స్త్రీలపై పెరిగిన అణచివేత, హింస, సంస్కృతి పేరుతో స్త్రీలను వెనక్కు నెట్టే ప్రయత్నాలు, ఇవన్నీ ‘స్వతంత్రం’, ‘స్వరాజ్యం’ అంటే అర్థమేమిటని ప్రశ్నించమంటున్నాయి. ప్రశ్నించే సమూహాలు అణచివేతకు గురవుతున్నాయి.


విద్వేష రాజకీయాలు రాజ్యాధికారంలోకి వచ్చాక సహనం అన్నది పూర్తిగా నశించిపోతున్నది. సోషల్‌ మీడియా దీనికి ఉపయోగపడుతోంది. ప్రభుత్వ సార్వభౌమత్వం సరిహద్దుల భద్రతకే గాక ప్రజా ఉద్యమాలను అణచటానికి ఉపయోగించటం సర్వసామాన్యమైంది బ్రిటిష్‌ చట్టాలను మించిన అణచివేత చట్టాలు తయారయ్యాయి. విద్యావంతులైన, ఆలోచనాపరులైన, ఆచరణశీలురైన యువ నాయకత్వాన్ని సంహరించటానికి, నిర్బంధించటానికి అనేక చట్టాలు– భావ ప్రకటనా స్వాతంత్ర్యమనే అతి ముఖ్యమైన రాజ్యాంగ వాగ్దానం ఉల్లంఘించబడుతోంది. చరిత్ర దారుణంగా వక్రీకరించబడుతోంది. కొన్ని అసమ్మతులలో, అనంగీకారాలతోనైనా అన్ని రాజకీయ వర్గాల గౌరవాన్ని పొంది జాతిపిత అనిపించుకున్న గాంధీ కూడా స్వాతంత్ర్య సమరయోధుడిగా మిగులుతాడా అనే అనుమానం కలుగుతోంది.


అన్నిటికంటే ఈ అమృత ఉత్సవాల సందర్భంగా మనం ఆలోచించవలసింది ప్రజల మౌనాన్ని, నిరాసక్తతను, హింసను సమ్మతించటాన్ని. వలసపాలకులు చేసిన దారుణాలన్నిటికంటే, దోపిడీలన్నిటికంటే, అన్నిరకాల హింసలకంటే భయంకరమైనది మనం అనాగరికులమనీ, మూర్ఖులమనీ, అసమర్థులమనీ, అవినీతిపరులమనీ మనచేతనే నమ్మించటం. వారి పాలనకు తగినవారమనే సమ్మతిని మననుండి పొందటం. అలా జరిగినపుడు మనంతట మనమే వారి ఆధిపత్యానికి లొంగిపోయాం. ఇపుడు ఆ సమ్మతి మరో దిశగా నడుస్తోంది. ఇపుడు ‘మనం’ మాత్రమే నాగరీకులం. మన సంస్కృతే ప్రపంచానికి దారి చూపింది. మన జాతి ప్రపంచంలోనే గొప్పది. మనకంటే భిన్నమైనది మన దేశంలో ఉండకూడదు. అట్లాంటి భిన్నత్వాన్ని ద్వేషించటమే మన కర్తవ్యం అని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. మొదటిది ఎంత ప్రమాదమో ఇదీ అంత ప్రమాదం. అప్పుడు వలస పాలకుల బానిసలం. ఇప్పుడు మనకు మనమే బానిసలం. స్వరాజ్యం, స్వతంత్రం... వీటికున్న లౌకిక, రాజకీయ, ఆధ్యాత్మిక అర్థాలన్నీ విస్మరణకు గురవుతున్నాయి. 


కొన్నేళ్ల క్రితం ప్రభుత్వరంగ సంస్థలను దివాలా తీయించి మూసివేసి ప్రైవేటు రంగాన్ని పెంచే కార్యక్రమం అమలు జరిగింది. ఇపుడు ఎంతో లాభాలనార్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు అమ్మివేయబడుతున్నాయి. ఎల్‌ఐసి లాంటి ఎన్నో సంస్థలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కార్పొరేట్‌ రాజకీయాలలోకి దేశం నెట్టివేయబడుతోంది. అతి కొద్ది మంది చేతుల్లోని కార్పొరేట్‌ రంగం శాసించే రాజకీయ విధానాలవల్ల దేశం అన్ని రకాలుగా బలహీనపడుతోంది. దేశీయ కార్పొరేట్లు విదేశీ కార్పొరేట్ల ముందు ఎంతకాలం నిలబడతాయి? అప్పుడు స్వాతంత్ర్యానికి, స్వరాజ్యానికి అర్థం ఏమిటి? ఈ ప్రశ్నల గురించి ఆలోచించే రాజకీయ చైతన్యం యువతరానికి ఎలా అందుతుంది? శ్రీశ్రీ రాసిన పాట గుర్తు రావటం లేదూ? ‘స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి/ సంబరపడగానే సరిపోదోయ్....’. అవును, చేయాల్సింది చాలా ఉంది.



ఓల్గా

ప్రసిద్ధ స్త్రీవాద రచయిత

Updated Date - 2022-08-12T09:19:51+05:30 IST