ఎఫ్‌బీఐ 'టాప్ 10 మోస్ట్ వాంటెడ్' లిస్ట్‌లో భారత సంతతి వ్యక్తి !

ABN , First Publish Date - 2020-11-28T22:42:17+05:30 IST

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) 'టాప్ 10 మోస్ట్ వాంటెడ్' లిస్ట్‌లో భారత సంతతి వ్యక్తి భద్రేష్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్ ఉన్నాడు.

ఎఫ్‌బీఐ 'టాప్ 10 మోస్ట్ వాంటెడ్' లిస్ట్‌లో భారత సంతతి వ్యక్తి !

న్యూయార్క్: అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) 'టాప్ 10 మోస్ట్ వాంటెడ్' లిస్ట్‌లో భారత సంతతి వ్యక్తి భద్రేష్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్ ఉన్నాడు. 2015లో అమెరికాలోని ఓ కాఫీ కేఫ్‌లో భార్యను అతికిరాతకంగా కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో 2017లో ఎఫ్‌బీఐ భద్రేష్‌కుమార్‌ను టాప్ 10 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. ఇతని గురించి సమాచారం ఇచ్చినవారికి ఎఫ్‌బీఐ ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ.73.94 లక్షలు) రివార్డు కూడా ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే... 2015లో మేరీల్యాండ్‌లోని హనోవర్‌లోని డంకిన్ డొనట్స్ కాఫీ షాపులో భద్రేష్‌కుమార్‌ తన భార్య పలక్‌ను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతనిపై హత్య కేసు నమోదైంది. భద్రేష్‌కుమార్‌ కోసం పోలీసులు గాలించారు. కానీ, అతను దొరకలేదు. దాంతో ఈ మర్డర్ కేసు ఎఫ్‌బీఐ చేతికి వెళ్లింది. 


ఈ క్రమంలో 2017లో భద్రేష్‌కుమార్‌ పేరును ఎఫ్‌బీఐ 'టాప్ 10 మోస్ట్ వాంటెడ్' లిస్ట్‌లో చేర్చడంతో పాటు.. అతని ఆచూకీ చెప్పిన వారికి లక్ష డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. ఈ మేరకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరోసారి భద్రేష్‌కుమార్‌‌కు సంబంధించిన వివరాలు, అతను చేసిన నేరం, అతనిపై ఉన్న రివార్డు గురించి తెలుపుతూ శుక్రవారం ట్వీట్ చేసింది. కాగా, అతను ఈ నేరానికి పాల్పడిన తర్వాత ట్యాక్సీలో న్యూజెర్సీ హోటల్ నుంచి నెవార్క్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్టు సమాచారం. ఇదే అతని గురించి పోలీసుల వద్ద ఉన్న చివరి సమాచారం కూడా. ఆ తర్వాత నుంచి భద్రేష్‌కుమార్‌‌ ఆచూకీ ఎక్కడ దొరకలేదు. ఎఫ్‌బీఐ నివేదిక ప్రకారం అతను గుజరాత్‌లోని కాంత్రోడి టా విరాంగంకు చెందిన వాడని తెలుస్తోంది.      



Updated Date - 2020-11-28T22:42:17+05:30 IST