దుబాయిలో అదృశ్యమైన భారతీయుడి ఆచూకీ లభ్యం !

ABN , First Publish Date - 2020-11-29T13:56:16+05:30 IST

టూరిస్ట్ వీసాపై దుబాయి వెళ్లి అదృశ్యమైన భారత వ్యక్తి అమృతలింగం సమయముత్తు(46) ఆచూకీ లభ్యమైంది.

దుబాయిలో అదృశ్యమైన భారతీయుడి ఆచూకీ లభ్యం !

దుబాయి: టూరిస్ట్ వీసాపై దుబాయి వెళ్లి అదృశ్యమైన భారత వ్యక్తి అమృతలింగం సమయముత్తు(46) ఆచూకీ లభ్యమైంది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు దుబాయి పోలీసులు అమృతలింగం బంధువుకు ఫోన్ చేసి చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన అమృతలింగం సమయముత్తు(46) ఉద్యోగం కోసం మరో ముగ్గురితో కలిసి నవంబర్ 8న దుబాయి వెళ్లాడు. హోర్ అల్ ఆంజ్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో వారు బస చేశారు. మరుసటి రోజు ఉదయం అమృతలింగం ఉద్యోగానికి వెళ్లి తిరిగి రాగా.. మిగతా ముగ్గురు నైట్ షిఫ్ట్‌కు వెళ్లారు. అయితే, వారు ముగ్గురు రూంకు తిరిగి వచ్చేసరికి అమృతలింగం కనిపించలేదు. దీంతో దుబాయిలో ఉన్న అతని బంధువు కన్నన్ నాగుర్‌కని వారు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో అల్ మురక్కబత్ పోలీస్ స్టేషన్‌లో కన్నన్ నవంబర్ 16న మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం దుబాయి పోలీసుల నుంచి కన్నన్‌కు అమృతలింగం ఆచూకీ దొరికినట్లు ఫోన్ వచ్చింది. 


ఓ ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. దాంతో ఫోన్‌లో అతనితో కన్నన్ మాట్లాడారు. ఆదివారం పోలీస్ స్టేషన్ వెళ్లిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమృతలింగంను కలుస్తానని జెబెల్ అలీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కన్నన్ అన్నారు. కాగా, దుబాయి వచ్చిన తర్వాత అమృతలింగం మానసికంగా ఒత్తిడికి గురై బయటకు వెళ్లిపోయినట్లు కన్నన్ పేర్కొన్నారు. కానీ, అతను ఆస్పత్రిలో ఎలా చేరాడో తెలియదన్నారు. ఆస్పత్రిలో చేరిన ఐదారు రోజుల వరకు బాగాలేడని, కానీ ఇప్పుడు అతను బాగానే ఉన్నాడని కన్నన్ తెలిపారు. అమృతలింగం ఆచూకీ దొరకడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుబాయి పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమృతలింగంకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించినందుకు గల్ఫ్ న్యూస్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-11-29T13:56:16+05:30 IST