సింగపూర్‌లో స్నేహితురాలిపై భారతీయుడి లైంగిక వేధింపులు.. కోర్టు విధించిన శిక్ష ఏంటంటే..!

ABN , First Publish Date - 2021-09-02T02:07:46+05:30 IST

సింగపూర్‌లో తన స్నేహితుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు భారత సంతతికి చెందిన వ్యక్తికి 6 నెలల సంస్కరణ శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం.

సింగపూర్‌లో స్నేహితురాలిపై భారతీయుడి లైంగిక వేధింపులు.. కోర్టు విధించిన శిక్ష ఏంటంటే..!

సింగపూర్ సిటీ: సింగపూర్‌లో తన స్నేహితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు భారత సంతతికి చెందిన వ్యక్తికి 6 నెలల సంస్కరణ శిక్షణ విధించింది అక్కడి న్యాయస్థానం. ఇది తీవ్రమైన నేరాలకు పాల్పడే 21 ఏళ్లలోపు వారికి విధించే ఓ ప్రత్యేకమైన శిక్ష. దీని ద్వారా పునరావాసానికి వారు ఎలా ప్రతిస్పందిస్తారనే విషయాన్ని గమనించడం జరుగుతుందని డిస్ట్రిక్ట్ జడ్జి మే మెసెనాస్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది నవంబర్ 7న హరి కిషన్ బాలక్రిష్ణన్(20) అనే భారత యువకుడు తన స్నేహితురాలైన 23 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 


బాధితురాలిని పూటుగా మద్యం తాగించిన తర్వాత ఆమెపై హరి కిషన్ ఇలా లైంగిక దాడి చేశాడు. అనంతరం దాన్ని వీడియో కూడా తీశాడు. అయితే, తర్వాతి రోజు బాధితురాలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అదే రోజు హరి కిషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌లో కొన్ని వీడియోలను హరికిషన్ డిలీట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. వాటిని రికవర్ చేసి ఏడు అశ్లీల వీడియోలను సేకరించారు. బుధవారం ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. బాధితురాలిపై హరి కిషన్ తన అపార్ట్‌మెంట్‌లో 17 నిమిషాల పాటు లైంగిక దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని డిస్ట్రిక్ట్ జడ్జి మే మెసెనాస్ తెలిపారు.


ఆ సమయంలో బాధితురాలు పూటుగా మద్యం సేవించి ఉండడంతో హరి కిషన్ చర్యకు ప్రతిఘటించలేకపోయిందని జడ్జి పేర్కొన్నారు. నిందితుడు తన చర్యను వీడియో కూడా తీశాడని, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక సింగపూర్‌లో వయోజనులు అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, లాఠీ దెబ్బల శిక్ష కూడా ఉంటుంది. అలాగే అశ్లీల వీడియోల చిత్రీకరణకు 20వేల నుంచి 40వేల సింగపూర్ డాలర్ల(రూ.10.85లక్షల నుంచి రూ.21.71లక్షలు) జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండు విధించవచ్చు. కానీ, హరి కిషన్‌కు 20 ఏళ్లు కనుక 6 నెలల సంస్కరణ శిక్షణ విధించింది.         

 

Updated Date - 2021-09-02T02:07:46+05:30 IST