పొట్టకూటికోసం దుబాయికి వెళ్లిన 28 ఏళ్ల భారతీయ కుర్రాడికి రాత్రికి రాత్రే రూ.21 లక్షలు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-09-02T15:47:49+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అబుదాబిలో ఓ భారతీయ వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది.

పొట్టకూటికోసం దుబాయికి వెళ్లిన 28 ఏళ్ల భారతీయ కుర్రాడికి రాత్రికి రాత్రే రూ.21 లక్షలు.. అసలేం జరిగిందంటే..

అబుదాబి: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అబుదాబిలో ఓ భారతీయ వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. పొట్టకూటికోసం దుబాయికి (Dubai) వెళ్లిన భారత్‌కు చెందిన 28 ఏళ్ల కదేర్‌కు మహజూజ్ వీక్లీ డ్రాలో జాక్‌పాట్ తగలడంతో 1లక్ష దిర్హమ్స్(రూ.21లక్షలు) గెలుచుకున్నాడు. దాంతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అబుదాబిలో ఉండే కదేర్ గత కొంతకాలంగా మహజూజ్ డ్రా (Mahzooz Draw)లో పాల్గొంటున్నాడు. దీనికోసం తనకు టిప్‌గా వచ్చే డబ్బును కూడబెట్టి మరీ ఈ లాటరీ పాల్గొన్నట్లు తెలిపాడు. 


ఈ క్రమంలో ఇటీవల తాను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ (Lottery Ticket) శనివారం తీసిన డ్రాలో తనను విజేతగా నిలబెట్టిందని చెప్పాడు. తాను లాటరీ విజేతననే విషయాన్ని తన మిత్రుడు ఫోన్ చేసి చెప్పేవరకు తెలియదని, మొదట అతని మాటలు నమ్మలేదని చెప్పుకొచ్చాడు. ఏదో ఆటపట్టిస్తున్నాడనుకుని, లాటరీ నిర్వాహకులకు ఫోన్ చేసి మరీ నిర్ధారించుకున్నానని కదేర్ తెలిపాడు. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ భారీ నగదు తన కలలను సాకారం చేసుకునేందుకు హెల్ప్ అవుతుందని మురిసిపోతున్నాడు. యూఏఈలోనే సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్ మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు.


కదేర్‌తో పాటు మరో భారత వ్యక్తి అషిత్ కూడా 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నాడు. ఇంజనీర్‌గా పనిచేస్తున్న అషిత్ తొమ్మిదేళ్లుగా యూఏఈ ఉంటున్నాడు. 2021 ఏప్రిల్ నుంచి అతడు ఈ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే యూఏఈ తనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు తాను గెలిచిన ఈ రూ.21లక్షలు బోనస్ అని అషిత్ ఆనందం వ్యక్తం చేశాడు.       

  

Updated Date - 2022-09-02T15:47:49+05:30 IST