Dubai Duty Free Raffle: భారత వ్యక్తిని వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.7.94కోట్లు!

ABN , First Publish Date - 2022-09-15T17:45:50+05:30 IST

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో (Dubai Duty Free Raffle) భారత వ్యక్తికి అదృష్టం వరించడంతో జాక్‌పాట్ కొట్టాడు.

Dubai Duty Free Raffle: భారత వ్యక్తిని వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.7.94కోట్లు!

అబుదాబి: దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో (Dubai Duty Free Raffle) భారత వ్యక్తికి అదృష్టం వరించడంతో జాక్‌పాట్ కొట్టాడు. కేరళలో ఉండే మహమ్మద్ నజీరుద్దీన్ అనే వ్యక్తి బుధవారం దుబాయ్ ఎయిర్ పోర్టులో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా (Dubai Duty Free Millennium Millionaire draw)లో ఏకంగా 1 మిలియన్ డాలర్లు (రూ.7.94కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో నజీరుద్దీన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మిలీనియం మిలియనీర్ సిరీస్ నం. 400లో భాగంగా అతడు ఆగస్టు 31న ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.3768కు ఈ జాక్‌పాట్ తగిలింది. కాగా, నజీరుద్దీన్ 2014 నుంచి క్రమం తప్పకుండా రాఫెల్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. కేరళ రాష్ట్రానికి చెందిన అతడు ఇంతకుముందు ఖతార్‌లో ఉండేవాడు. ప్రస్తుతం కేరళలోనే చిన్న ఐటీ బిజినెస్ నడిపిస్తున్నాడు. 


దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఒక మిలియన్ డాలర్లు గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. కలలో కూడా ఇంత భారీ మొత్తం గెలుస్తానని అనుకోలేదని నజీరుద్దీన్ పేర్కొన్నాడు. ఇది తన జీవితాన్నే మార్చేస్తుందని చెప్పాడు. నజీరుద్దీన్‌కు ఇద్దరు పిల్లలు.  దాంతో ఈ నగదులో కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మరికొంత భాగాన్ని తన భవిష్యత్ ప్రణాళికకు ఉపయోగిస్తానన్నాడు. అలాగే కొంత మొత్తాన్ని చారిటీకి వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. 


కాగా, 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ (Dubai Duty Free Raffle)లో ఇప్పటివరకు మొత్తం 195 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. ఇందులో నజీరుద్దీన్ 196వ భారతీయ వ్యక్తి. ఇదిలాఉంటే.. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌ లాటరీ టికెట్లు కొనుగోలు చేసే వారిలో భారతీయులే టాప్‌లో ఉన్నట్లు రాఫెల్ నిర్వాహకులు తెలియజేశారు.     

Updated Date - 2022-09-15T17:45:50+05:30 IST