UK: లీసెస్టర్‌లో ఉద్రిక్తత.. హిందూ ఆలయాల ప్రాంగణాలు ధ్వంసం.. ఖండించిన భారత హైకమిషన్

ABN , First Publish Date - 2022-09-20T17:01:35+05:30 IST

బ్రిటన్‌లోని లీసెస్టర్ సిటీ (Leicester city)లో మత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హిందూ దేవాలయాల పరిసరాలను దుండగులు ధ్వంసం చేశారు.

UK: లీసెస్టర్‌లో ఉద్రిక్తత.. హిందూ ఆలయాల ప్రాంగణాలు ధ్వంసం.. ఖండించిన భారత హైకమిషన్

లీసెస్టర్: బ్రిటన్‌లోని లీసెస్టర్ సిటీ (Leicester city)లో మత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హిందూ దేవాలయాల పరిసరాలను దుండగులు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న కొందరిపై దాడులకు కూడా పాల్పడ్డారు. ఈ ఘటనలను లండన్‌లోని భారత హైకమిషన్ (High Commission of India) సోమవారం తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని కోరింది. "లీసెస్టర్‌లో భారతీయ సమాజంపై జరిగిన హింసతో పాటు హిందూ ఆలయాల ప్రాంగణం, చిహ్నాల ధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ విషయాన్ని యూకే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని కోరాం. బాధితులకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నాం" అని హైకమిషన్ పేర్కొంది. 


కాగా, గత నెల 28న జరిగిన ఆసియా కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా అక్కడ హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇవి హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. ఈ ఘటనలపై లీసెస్టర్‌షైర్ పోలీసులు స్పందించారు. తూర్పు లీసెస్టర్ ప్రాంతంలో తమ ఆపరేషన్ కొనసాగుతుందని, ఇప్పటి వరకు దాడులకు పాల్పడిన సుమారు 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని, తమ దేశంలో ఉన్న విదేశీయుల రక్షణ తమ బాధ్యత అని పోలీసులు తెలిపారు. 


లీసెస్టర్‌‌ (Leicester)లో శాంతియుత వాతావరణం నెలకొనే వరకు తమ ఆపరేషన్ ఆగదని చెప్పుకొచ్చారు. ఇక లీసెస్టర్‌‌ నగరంలోని నార్త్ ఎవింగ్టన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కొంతమంది యువకులు గుమికూడిన్నట్లు అధికారులకు తెలిసింది. దాంతో అధికారులు వారితో మాట్లాడారు. కమ్యూనిటీలకు హాని కలిగించకుండా తాత్కాలికంగా పోలీసు కార్డన్‌ను ఏర్పాటు చేయడంతో సహా ఇతర చర్యలు తీసుకోవడం జరిగింది. 

Updated Date - 2022-09-20T17:01:35+05:30 IST