రెండేళ్ల భారతీయ బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స కోసం సింగపూర్ వాసుల ఉదారత

ABN , First Publish Date - 2022-01-20T18:54:51+05:30 IST

సింగపూర్‌లోని భారతీయ సంతతికి చెందిన రెండేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత అరుదైన నాడీ కండరాల వ్యాధి నుండి కోలుకున్నాడు.

రెండేళ్ల భారతీయ బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స కోసం సింగపూర్ వాసుల ఉదారత

సింగపూర్ సిటీ: సింగపూర్‌లోని భారతీయ సంతతికి చెందిన రెండేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత అరుదైన నాడీ కండరాల వ్యాధి నుండి కోలుకున్నాడు. పుట్టినప్పటి నుంచే వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న బాలుడు తనంతట తానుగా నడవలేని పరిస్థితి. అయితే, దీనికి చికిత్స ఉన్నప్పటికీ అది చాలా ఖరీదైనది కావడంతో బాలుడి తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. వారి అభ్యర్థనకు స్పందించిన సింగపూర్ వాసులు బాలుడి ఖరీదైన చికిత్స కోసం దాదాపు 30 లక్షల సింగపూర్ డాలర్లు (రూ. 16.68 కోట్లు) విరాళంగా అందించారు. తాజాగా బాలుడికి చికిత్స పూర్తిగా కావడంతో తిరిగి నడవగలిగే సామర్థ్యాన్ని పొందాడు. దీంతో బాలుడి పేరెంట్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా తమకు ఆర్థికంగా సహకరించి విరాళాలు అందించిన దాతలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. 


వివరాల్లోకి వెళ్తే.. భారతీయ సంతతికి చెందిన దేవ్ దేవరాజ్, అతని చైనీస్ మూలాలు ఉన్న భార్య షు వెన్ దేవరాజ్‌ల ఏకైక సంతానం దేవదాన్ దేవరాజ్. దేవదాన్ పుట్టిన నెల రోజులకు వైద్యుల వద్దకు సాధారణ చెకప్ కోసం తీసుకెళ్లిన దేవరాజ్ దంపతులకు షాకింగ్ విషయం తెలిసింది. బాలుడు స్పైనల్ ముస్క్యూలర్ ఆట్రోఫీ(వెన్నెముక కండరాల క్షీణత)తో బాధపడుతున్నట్లు తేలిసింది. అంతేగాక దేవదాన్ తిరిగి మామూలుగా నడవాలంటే ఖరీదైన చికిత్స అవసరం అవుతుందని వైద్యులు తేల్చేశారు. జొల్జెనస్మా అనే జన్యు చికిత్స చేయాలని, దానికి వాడే మెడిసిన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందులలో ఒకటని వైద్యులు చెప్పారు. అది సుమారు 29 లక్షల సింగపూర్ డాలర్లు (రూ. 16 కోట్లు) ఖరీదు ఉంటుందని చెప్పడంతో దేవరాజ్ దంపతులకు గుండె ఆగినంత పనైంది. 


ఆ సమయంలో వారికి ఏమీ తోచలేదు. ఆ తర్వాత తెలిసిన వారి సలహా మేరకు దేవదాన్ పరిస్థితిని వివరించి సోషల్ మీడియా ద్వారా దాతల సాయం కోరారు. దీనికి వారికి క్రౌడ్ ఫండింగ్ స్వచ్ఛంద సంస్థ 'రే ఆఫ్ హోప్' సహకరించింది. దీంతో గతేడాది ఆగస్టులో కేవలం 10 రోజుల వ్యవధిలోనే 30వేల మంది దాతలు ఏకంగా 28.7 లక్షల సింగపూర్ డాలర్లు (రూ. 15.84కోట్లు) విరాళంగా అందించారు. ఇక సెప్టెంబర్‌లో నేషనల్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో దేవదాన్ దేవరాజ్‌కు చికిత్స జరిగింది. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు మెల్లగా తనంతట తానుగా లేచి నిలబడడంతో పాటు మెల్లగా నడుస్తున్నట్లు దేవరాజ్ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా దేవదాన్ ఖరీదైన చికిత్సకు అవసరమైన భారీ నగదును విరాళాల రూపంలో అందించి ఆదుకున్న దాతలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.  

Updated Date - 2022-01-20T18:54:51+05:30 IST