America లో విమాన ప్రమాదం.. భారత సంతతి వైద్యుడి దుర్మరణం!

ABN , First Publish Date - 2021-10-13T02:06:33+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో సంభవించిన విమాన ప్రమాదంలో భారత సంతతి వైద్యుడు దుర్మరణం చెందారు.

America లో విమాన ప్రమాదం.. భారత సంతతి వైద్యుడి దుర్మరణం!

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో సంభవించిన విమాన ప్రమాదంలో భారత సంతతి వైద్యుడు దుర్మరణం చెందారు. కాలిఫోర్నియాలో విమానం కుప్పకూలిన ఘటనలో కార్డియాలజిస్ట్ సుగతా దాస్ చనిపోయారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. సాంటీ ప్రాంతంలోని సాటానా ఉన్నతపాఠశాల సమీపంలో విమానం పడిపోయింది. సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) ఈ దుర్ఘటన జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ప్రమాదానికి గురైన విమానాన్ని 'సెస్నా సీ-340' రకానికి చెందినదిగా అధికారులు గుర్తించారు.


నివాసాల మధ్యలో విమానం కుప్పకూలడంతో చెలరేగిన మంటల కారణంగా సమీపంలోని కొన్ని ఇళ్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. కాగా, ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియలేదు. 'సెస్నా సీ-340' విమానాలను సాధారణంగా వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఆరుగురు ప్రయాణించే వీలుంటుంది.


కాగా, బెంగాలీ కుటుంబంలో జన్మించిన దాస్ పుణెలో పెరిగారు. అమెరికా వెళ్లి అరిజోనాలో స్థిరపడ్డారు. అరిజోనాలోని యూమా రీజనల్ మెడికల్ సెంటర్​లో కార్డియాలజిస్ట్​గా పనిచేస్తున్నారు. ఎయిడ్స్ బాధిత మహిళలు, చిన్నారులకు సహాయం చేసే 'పవర్ ఆఫ్ లవ్ ఫౌండేషన్​' అనే స్వచ్ఛంద సంస్థకు ఆయన డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. దాస్​కు ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Updated Date - 2021-10-13T02:06:33+05:30 IST