UK PM: అభ్యర్థిత్వాన్ని ధృవీకరించిన Rishi Sunak.. బరిలో మరో భారతీయ మహిళ

ABN , First Publish Date - 2022-07-10T17:43:32+05:30 IST

వరుస వివాదాలతో ఎట్టకేలకు బ్రిటన్​ ప్రధాని పీఠాన్ని బోరిస్​ జాన్సన్ (Boris Johnson)​ వీడారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాని ఎవరనే దానిపై అంచనాలు ఊపందుకున్నాయి.

UK PM: అభ్యర్థిత్వాన్ని ధృవీకరించిన Rishi Sunak.. బరిలో మరో భారతీయ మహిళ

లండన్: వరుస వివాదాలతో ఎట్టకేలకు బ్రిటన్​ ప్రధాని పీఠాన్ని బోరిస్​ జాన్సన్ (Boris Johnson)​ వీడారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాని ఎవరనే దానిపై అంచనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి అల్లుడు, భారత మూలాలున్న బ్రిటన్​ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్​ (Rishi Sunak) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాన్ని ధృవీకరిస్తూ తాజాగా రిషి ట్విటర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారానే ఆయన తన ప్రధాని అభ్యర్థిత్వాన్ని కన్ఫార్మ్ చేశారు. 'బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా, కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా పోటీ చేస్తున్నాను. దేశ అర్థిక వ్యవస్థను, ప్రధాని పదవి విశ్వసనీయతను పునరుద్ధరిద్దాం. దేశాన్ని ఏకతాటిపై నిలుపుదాం' అంటూ రిషి ట్వీట్‌ చేశారు. 


అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టేశారు. ‘రెడీ ఫర్‌ రిషి’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం ప్రారంభించారు. ‘దేశం భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అవసరమ’ని రిషి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ నేపథ్యాన్ని, భారతీయ మూలాలను, యూకేలో అందిపుచ్చుకున్న అవకాశాలను తెలియజేస్తూ వీడియో పోస్ట్ చేశారు. దేశంలోని ప్రతిఒక్కరూ అభివృద్ధి పథంలో నడవాలనేదే తన లక్ష్యమంటూ ఈ ప్రచార వీడియోల ద్వారా వివరిస్తున్నారు.


ఇక రిషితో పాటు తాజాగా మరో భారత సంతతి మహిళ పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే సుయేల్లా బ్రేవర్మాన్ (Suella Braverman). ప్రస్తుతం ఆమె యూకే కేబినెట్‌లో అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్నారు. 42 ఏళ్ల ఈ న్యాయవాది ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత సీనియర్ చట్టపరమైన అధికారి కూడా. ఇక వీరితో పాటు కన్జర్వేటివ్‌ పార్టీలోని మరో ఎనిమిది మంది పేర్లు ప్రధాని రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రి బెన్‌వాలెస్, లిజ్‌ ట్రస్‌, పెన్నీ మార్డాంట్‌, జెరిమీ హంట్‌, నదీమ్‌ జహావీ తదితరుల పేర్ల పైనా బెట్టింగులు నడుస్తున్నాయి. అయితే, వీరందరిలోనూ రిషి సునక్‌ (Rishi Sunak) ముందంజలో ఉన్నారు.



Updated Date - 2022-07-10T17:43:32+05:30 IST