London: భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు.. ఇంతకు అతడు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2022-05-08T17:10:30+05:30 IST

బ్రిటన్ రాజధాని లండన్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి అక్కడి స్థానిక న్యాయస్థానం శుక్రవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

London: భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు.. ఇంతకు అతడు చేసిన నేరమేంటంటే..

లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి అక్కడి స్థానిక న్యాయస్థానం శుక్రవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అతనితో పాటు మరో ఇద్దరికి కూడా ఇదే శిక్ష విధించింది. ఈ ముగ్గురు 2020లో ఓ దొంగతనం కేసులో దోషులుగా నిర్ధారించబడ్డారు. ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధుడితో పాటు అతని మనవడిని తీవ్రంగా గాయపరిచి దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా ఈ కేసు స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టులో విచారణకు రావడంతో న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. అజయ్‌పాల్ సింగ్(28) అనే భారతీయ వ్యక్తి మరో ఇద్దరితో కలిసి 2020 మే1న తూర్పు లండన్‌లోని అప్‌మిన్‌స్టర్‌లో స్థానికంగా ఉండే ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఓ పెద్దాయనతో పాటు 11 ఏళ్ల అతని మనవడు ఉన్నాడు. బలవంతంగా ఇంట్లోకి చోరబడిన విజయ్‌పాల్ ముఠా వృద్ధుడిని బెదిరించి ఇంట్లో నగదు, విలువైన ఆభరణాలు ఇవ్వాల్సిందిగా కోరారు. దానికి పెద్దాయన నిరాకరించడంతో తమతో పాటు తెచ్చుకున్న తుపాకీతో పిల్లోడిపై కాల్పులు జరిపారు. దాంతో బాలుడి భుజం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. 


అనంతరం వృద్ధుడిని కూడా కత్తితో గాయపరిచి ఇంట్లోంచి నగలు, నగదు కలిపి సుమారు రూ.18,99,172 దోచుకెళ్లారు. వారు వెళ్లిపోయిన కొద్దిసేపటికి పక్కింటి వారు వృద్ధుడి ఇంటికి వెళ్లగా తాతామనవడు ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండడం చూపి పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న మెట్రోపాలిటన్ పోలీసులు వృద్ధుడితో పాటు బాలుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వృద్ధుడి సమాచారం మేరకు నిందితుల వివరాలు తెలుసుకుని గాలింపు చర్య చేపట్టారు. ఆ సమయంలో ఇంటి డోర్‌బెల్ కెమెరాలో రికార్డైన దృశ్యాలు పోలీసులకు కీలక ఆధారంగా మారాయి. వాటి ద్వారానే విజయ్‌పాల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నవంబర్‌లో ఈ ముగ్గురిని లండన్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ తమ నేరాన్ని అంగీకరించారు. శుక్రవారం మరోసారి స్థానిక స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం దోషులుగా తేలిన ముగ్గురికి చెరో 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది.  

Read more