స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ చీఫ్ రేసులో భారత సంతతి వ్యక్తి

ABN , First Publish Date - 2022-02-12T16:42:08+05:30 IST

ప్రతిష్టాత్మక స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ చీఫ్ పదవి రేసులో భారత సంతతి బ్రిటీష్ పోలీస్ అధికారి నీల్ బసు నిలిచారు.

స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ చీఫ్ రేసులో భారత సంతతి వ్యక్తి

లండన్: ప్రతిష్టాత్మక స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ చీఫ్ పదవి రేసులో భారత సంతతి బ్రిటీష్ పోలీస్ అధికారి నీల్ బసు నిలిచారు. లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ కమీషనర్, స్కాట్‌లాంట్ యార్డ్ చీఫ్ పదవుల నియామకానికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన వారిలో నీల్ బసు పేరు ముందు వరుసలో ఉన్నట్లు అక్కడి మీడియా సర్కిల్స్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ గతంలో ఆయన సాదాసీదాగా మాట్లాడటం నిర్ణయాధికారులు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌లను మెప్పించకపోవచ్చని బ్రిటీష్ మీడియా చెబుతున్న మరో మాట. ఇక లండన్ మేయర్ సాదిక్ ఖాన్ విశ్వాసం కోల్పోవడంతో ప్రస్తుత ఆ నగర పోలీస్ కమీషనర్‌గా ఉన్న క్రెసిడా డిక్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో లండన్ పోలీస్ కమీషనర్ పదవి గురువారం ఖాళీ అయింది. ఈ పదవి భర్తీ అనివార్యం కావడంతో ప్రస్తుతం అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


కాగా, నీల్ బసు భారత్‌లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాకు చెందిన వైద్యుడికి, వేల్స్ తల్లికి జన్మించారు. ప్రస్తుతం స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ కమీషనర్ హోదాలో ఉన్నారు. ఆయన నాటింగ్‌హామ యూనివర్శటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం 1992లో మెట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ డైరెక్టర్‌ కావడానికి ముందు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు చీఫ్‌గా పని చేశారు. ఒకవేళ లండన్ పోలీస్ కమీషనర్‌గా ఆయన నియామకమైతే ఈ పదవి చేపట్టబోయే తొలి శ్వేతజాతీయేతర, మైనారిటీ వ్యక్తిగా నీల్ బసు రికార్డుకెక్కుతారు. ఇక ఆ దేశ చట్టప్రకారం యూకే హోం సెక్రటరీ, లండన్ మేయర్ ఏకాభిప్రాయంతో నగర పోలీస్ కమీషనర్ నియామకం ఉంటుంది.

Updated Date - 2022-02-12T16:42:08+05:30 IST