భారత సంతతి టెకీకి అమెరికాలో యావజ్జీవం!

ABN , First Publish Date - 2021-11-12T12:44:10+05:30 IST

అమెరికాలో భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలు ముగ్గురిని అమానుషంగా హత్య చేశాడు. ఉద్యోగం పోవడంతో కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చలేకపోతున్నాననే నిరాశానిస్పృహలతో శంకర్‌ నాగప్ప...

భారత సంతతి టెకీకి అమెరికాలో యావజ్జీవం!

    • మూడేళ్ల క్రితం భార్య, ముగ్గురు పిల్లల హత్య 

లాస్‌ఏంజెలిస్‌, నవంబరు 11: అమెరికాలో భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌..  కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలు ముగ్గురిని అమానుషంగా హత్య చేశాడు. ఉద్యోగం పోవడంతో కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చలేకపోతున్నాననే నిరాశానిస్పృహలతో శంకర్‌ నాగప్ప హంగుడ్‌ అనే 55 ఏళ్ల వ్యక్తి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘోరానికి శిక్షగా ఇక అతడు చచ్చేదాకా కటకటాల వెనకే గడపనున్నాడు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో శంకర్‌ నాగప్ప తన నేరాన్ని అంగీకరించడంతో తాజాగా అక్కడి న్యాయస్థానం అతడికి పెరోల్‌కు వీలులేని యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై అతడు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.


రోజ్‌విల్లేలో శంకర్‌ నాగప్ప, తన భార్య జ్యోతి (46), పిల్లలు వరుణ్‌ (20), గౌరి (16), నిశ్చల్‌ (13)తో కలిసి ఉండేవాడు. 2019లో తన ఫ్లాట్‌లో వారం రోజుల వ్యవధిలో ఈ నలుగురినీ హత్య చేశాడు. ఆ ఏడాది అక్టోబరు 7న జ్యోతి, గౌరి, నిశ్చల్‌ను తన ఫ్లాట్‌లోనే హత్య చేశాడు. ఐదురోజుల తర్వాత వరుణ్‌ మృతదేహంతో కారులో వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను నాలుగు హత్యలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని స్థానికులు చెప్పారు. 

Updated Date - 2021-11-12T12:44:10+05:30 IST