ఖాళీ ఏసీ బోగీల్లో వాటిని రవాణా చేస్తున్న రైల్వేలు

ABN , First Publish Date - 2021-10-10T16:21:52+05:30 IST

పని లేకుండా పడి ఉన్న ఏసీ బోగీలను భారతీయ రైల్వేలు

ఖాళీ ఏసీ బోగీల్లో వాటిని రవాణా చేస్తున్న రైల్వేలు

న్యూఢిల్లీ : పని లేకుండా పడి ఉన్న ఏసీ బోగీలను భారతీయ రైల్వేలు వినూత్నంగా ఉపయోగిస్తున్నాయి. ఇటువంటి బోగీల్లో చాకొలెట్లు, ఇతర ఆహార పదార్థాలను రవాణా చేస్తున్నాయి. 18 బోగీలుగల పార్శిల్ ఎక్స్‌ప్రెస్ 163 టన్నుల చాకొలెట్లు, ఆహార ఉత్పత్తులతో వాస్కోడి గామా (గోవా) నుంచి ఓఖ్లా (ఢిల్లీ)కి శుక్రవారం బయల్దేరింది.  ‘రైలును మధురంగా మార్చిన నవ కల్పన’గా ఈ ప్రయత్నాన్ని సౌత్ వెస్టర్న్ రైల్వే అభివర్ణించింది. 


హుబ్బళి డివిజన్‌లోని బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్ కృషి వల్ల ఈ వినూత్న ప్రయత్నం విజయవంతమైంది. చాకొలెట్లు, ఆహార పదార్థాలను సాధారణంగా రోడ్డు మార్గంలో రవాణా చేస్తారు. వీటిని రవాణా చేయడం వల్ల రైల్వేలకు రూ.12.83 లక్షలు ఆదాయం లభించినట్లు సమాచారం. 


చాకొలెట్ రీఫర్ ఎక్స్‌ప్రెస్ కోసం ఐడిల్ ఐసీఎఫ్ ఏసీ 2 టైర్, 3 టైర్ బోగీలను సౌత్ వెస్టర్న్ రైల్వేలో మొట్టమొదటిసారి ఉపయోగించినట్లు డీఆర్ఎం అరవింద్ ట్విటర్ వేదికగా  ప్రకటించారు. కస్టమర్లు రైల్వే సేవలను వినియోగించుకునేవిధంగా కృషి చేస్తున్న బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్‌ను అభినందించారు. రైల్వే సేవలు వేగంగా, సజావుగా, తక్కువ ధరకు లభిస్తాయని చెప్పారు. 


Updated Date - 2021-10-10T16:21:52+05:30 IST