గల్ఫ్ దేశాల కరెన్సీలతో పోలిస్తే Indian Rupee విలువ చాలా తక్కువ.. అందుకే మనోళ్లు Gulf కు క్యూకట్టేది!

Oct 6 2021 @ 10:43AM

ఎన్నారై డెస్క్: ఉపాధి నిమిత్తం మనోళ్లు భారీ సంఖ్యలో బయటి దేశాలకు వెళ్తుంటారనేది తెలిసిందే. ఉన్నత చదువులు, మంచి నైపుణ్యం ఉన్నవాళ్లు అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు వెళ్తుంటే.. అంతగా చదువులేని వారు, ఉన్న ఊరిలో ఉపాధి లేక చాలా మంది గల్ఫ్ దేశాల బాట పడుతుంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఉపాధిని వెతుక్కుంటూ వెళ్తుంటారు. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైత్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ‌లో మనోళ్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ దేశాల్లో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే వీలు ఉంటుంది. దీనికి కారణం అక్కడ మన రూపాయితో పోల్చుకుంటే వాళ్ల కరెన్సీ విలువ చాలా ఎక్కువ. అలాగే ఈ దేశాలు ఎక్కువగా విదేశీ కార్మికులపై ఆధారపడుతుండడంతో ప్రవాసులకు చాలా సులువుగా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు మనం గల్ఫ్ కోఆరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాల్లో మన రూపాయి విలువ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. 

కువైత్

నాలుగు మిలియన్ల జనాభా ఉన్న కువైత్‌లో సుమారు మూడు మిలియన్లకు పైగానే వలసదారులు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ దేశంలోని ప్రవాసుల్లో అత్యధికులు భారతీయులే. కువైత్ కరెన్సీ వచ్చేసి కువైటీ దినార్. మన రూపాయితో పోల్చితే కువైటీ దినార్ విలువ చాలా ఎక్కువ. ఒక కువైత్ దినార్ విలువ 247.41 రూపాయలకు సమానం. అందుకే ఇక్కడ వలసదారులు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించే వీలు ఉంది. కానీ, గడిచిన నాలుగైదు ఏళ్లుగా భారీ సంఖ్యలో ప్రవాసులు కువైత్‌ను వదిలి స్వదేశాలకు వచ్చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం కువైటైజేషన్ పాలసీ. స్వదేశీయులకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రవాసులను తగ్గిస్తోంది కువైత్. అలాగే కరోనా సంక్షోభం కూడా భారీ సంఖ్యలో వలసదారులు కువైత్‌ను విడిచిపెట్టేలా చేసింది. 

బహ్రెయిన్

బహ్రెయిన్ కరెన్సీ బహ్రెయిన్ దీనార్. ఇక్కడి ఒక బహ్రెయిన్ దీనార్ విలువ 197.87 రూపాయలకు సమానం. అంటే ఈ దేశంలో మనోళ్లు ఒక్క బహ్రెయిన్ దినార్ సంపాదిస్తే అది మనదగ్గర రూ.197కు సమానమన్నమాట. అందుకే బహ్రెయిన్‌లో భారత ప్రవాసులు భారీ సంఖ్యలోనే ఉపాధి పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 

ఒమన్

ఒమన్ సుల్తానేట్ జనాభా కువైత్ కంటే కొంచెం అధికం. ఇక్కడ మనోళ్లు భారీగానే ఉపాధి పొందుతున్నారు. ఒమన్ కరెన్సీ ఒమనీ రియాల్. మన రూపాయితో పోలిస్తే ఒమన్ కరెన్సీ విలువ కూడా ఎక్కువే. ఒక ఒమనీ రియాల్ విలువ 193.87 రూపాయలు. ఇక ఒమన్ మొత్తం జనాభాలో సుమారు 20 శాతం వరకు భారతీయులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.  

ఖతర్

మరో గల్ఫ్ దేశం ఖతర్‌లో భారత ప్రవాసులు సుమారు 6.91లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశ కరెన్సీ వచ్చేసి ఖతారీ రియాల్. అయితే, ఇతర జీసీసీ దేశాల కరెన్సీతో పోలిస్తే ఇక్కడ మన రూపాయి విలువ కాస్తా ఎక్కువ అనే చెప్పాలి. ఒక ఖతారీ రియాల్ విలువ కేవలం 20.50 రూపాయలు మాత్రమే. 

సౌదీ అరేబియా

మిగతా గల్ఫ్ దేశాల కంటే ఎన్నారైలు అధికంగా ఉండేది సౌదీలోనే. ఇక్కడ సుమారు 3.2కోట్ల మంది భారతీయ ప్రవాసులు ఉన్నట్లు సమాచారం. అంతేగాక ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే ఎక్కవ మంది భారతీయ ప్రవాసులకు కలిగి ఉన్న దేశం కూడా సౌదీనే అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ దేశ కరెన్సీ సౌదీ రియాల్. ఇక్కడి ఒక సౌదీ రియాల్ 19.90 రూపాయలకు సమానం. 

యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)

యూఏఈలో కూడా మనోళ్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఈ దేశంలో ప్రవాస భారతీయులు సుమారు 26లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశ కరెన్సీ యూఏఈ దిర్హమ్స్. మన రూ.20.31 రూపాయలు ఒక యూఏఈ దిర్హమ్స్‌కు సమానం. ఇలా ఈ ఆరు జీసీసీ దేశాల కరెన్సీలు మన రూపాయితో పోలిస్తే చాలా ఎక్కువ. అందుకే ఉన్నత చదవులు లేనివారు, సాధారణ జీవనోపాధి కోసం మనోళ్లు భారీ సంఖ్యలో ఈ దేశాలకు క్యూకడుతుంటారు. 

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.