
బచ్చలికూరని ఇండియన్ స్పినాచ్ అంటారు. ఇందులో తీగబచ్చలి, ఎర్రబచ్చలి, మట్టుబచ్చలి అని మూడు రకాలున్నాయి. వీటన్నింటి గుణాలు ఇంచుమించు సమానంగానే ఉంటాయి. బచ్చలికూర వగరుగా కొద్దిగా తీపిగా ఉంటుంది. పురుషత్వాన్ని పెంచుతుందని, చలువ చేస్తుందని, శరీరంలో విషదోషాల్ని పోగొడ్తుందని చరక సంహిత పేర్కొంది. పురుషుల్లో జీవకణాలను పెంచి సంతాన యోగ్యతని కలిగిస్తుందని సుశ్రుత సంహిత వివరించింది. అతిగా మద్యపానం చేయటం వలన కలిగే లక్షణాలకు విరుగుడుగా ఇది పనిచేస్తుందని అష్టాంగహృదయం పేర్కొంది. మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే గుణం కూడా దీనికుంది. ముఖ్యంగా ఇది నిద్ర పట్టించే ఔషధాలలో ఒకటి. బచ్చలికూర వాతం చేస్తుందనుకోవటం అపోహ, కీళ్ళవాతం ఉన్నవారు నిరభ్యంతరంగా తినవచ్చు. వాతాన్ని, వేడినీ తగ్గిస్తుంది. అతిగా తింటే కఫాన్ని పెంచుతుంది.
క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ ఎ, బి, సి బచ్చలిలో ఎక్కువగా ఉంటాయి. లేత కాడల్లో ఎ-విటమిన్ బాగా ఉంటుంది. ఎర్రని కాడలున్న బచ్చలిలో అదనంగా బీటా కెరటిన్ ఉంటుంది. అది మరింత నాణ్యమైనది. మూత్రపిండాలకు, ఊపిరితిత్తులకు బలం ఇస్తుంది. వృద్దాప్యాన్ని నివారిస్తుంది. బచ్చలాకుల్లో జిగురు పదార్థం విరేచన కారిగా పనిచేస్తుంది. కేన్సరు నివారకాల్లో ఇది కూడా ఒకటి. బచ్చలి ఆకులూ, తీగ కూడా సమానగుణాలు కలిగినవే! దీనిలో ఉండే ఆహారపీచు, ఖనిజాలు, లవణాల సాంద్రత వలన ఇది షుగరువ్యాధిని పెరగకుండా చేస్తుందని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి. వాపుని తగ్గిస్తుంది. కానీ, ఆలస్యంగా అరుగుతుంది. అందుకని జీర్ణశక్తి మందంగా ఉన్నవారు దీన్ని తేలికగా తినటం మంచిది.
తయారీ విధానం
నలమహారాజు పాకదర్పణంలో ఉపోదకీ (బచ్చలి)తో కూర చేసే విధానాన్ని ఇలా వివరించాడు. బచ్చలాకుల్ని చల్లని నీటితో బాగా కడగాలి. తగినంత ఉప్పు వగైరాలు వేసి కమ్మని కూరగా వండి రాజుగారికి వడ్డించాలి అన్నాడు. బచ్చలి ఆకుల్ని ఏ విధమైన వంటకంగానైనా తయారుచేసుకోవచ్చు. పులుసు కూర, ఆవపెట్టిన కూర, పప్పు, పచ్చడి, పెరుగుపచ్చడి ఇలా ఇతర ఆకుకూరలతో ఏవేవి వండుకుంటామో బచ్చలికూరతోనూ అన్నీ వండుకోవచ్చు!
కందతో కలిపి వండితే బచ్చలిలో దోషాలు పోతాయంటారు. కందకి తోడుగా మరో కూర సరిపోకపోవచ్చు కూడా! కంద బచ్చలిని ఆవపెట్టి వండిన కూర మూలవ్యాధులున్న వారికి మేలు చేస్తుంది. రక్త వృద్ధిని కలిగిస్తుంది. వాత వ్యాధులు, కఫవ్యాధుల్లో మేలు చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. విరేచనకారి కూడా!
కొద్దిపాటి సెగకే బచ్చలాకులు మగ్గిపోతాయి. కాబట్టి, మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు.
బచ్చలాకులు, కాడలు, తీగని కూడా మిక్సీలో వేసి రసం తీసి తాగవచ్చు. ఈ రసంలో పాలుపోసి పాయసం లాగా కాచుకోవచ్చు. రసంపొడి వేసి చారు కాచుకుంటే శక్తిదాయకమైన ఔషధంగా పనిచేస్తుంది.
గంగరాజు అరుణాదేవి