భారత రాష్ట్ర సమితి!

ABN , First Publish Date - 2022-06-11T07:43:38+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) త్వరలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా మారబోతోందా?

భారత రాష్ట్ర సమితి!

కేసీఆర్‌ జాతీయ పార్టీ పేరు ఇదే


మంత్రులు, ఎంపీల అభిప్రాయం కోరిన సీఎం కేసీఆర్‌

సంపూర్ణ మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు

ఈనెల 19న కార్యవర్గ భేటీ.. తుది నిర్ణయం తీసుకునే చాన్స్‌ 

జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఉందన్న అభిప్రాయం

ప్రశాంత్‌ కిశోర్‌ డైరెక్షన్‌.. కేసీఆర్‌ యాక్షన్‌?


కేంద్రం ఇబ్బంది పెడుతోంది

రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల పేరుతో రుణ సమీకరణలో సమస్యలు సృషిస్తున్న వైనాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే తెలంగాణను కేంద్రం ఇబ్బందులు పెడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కేసీఆర్‌ వ్యక్తం చేశారు.


హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) త్వరలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా మారబోతోందా? ఈ నెల 19లోగా జరుగనున్న టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం ప్రకటించనున్నారా? అనంతరం జాతీయ రాజకీయాలపైన కేసీఆర్‌ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టనున్నారా? ప్రగతి భవన్‌లో శుక్రవారం అందుబాటులోని మంత్రులు, ఎంపీలు, నేతలతో ఆయన నిర్వహించిన ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం వివరాలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ భేటీలో కేసీఆర్‌.. దేశ రాజకీయ పరిస్థితులు, అందులో టీఆర్‌ఎస్‌ పోషించనున్న పాత్రపై విస్తృతంగా చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘‘ప్రస్తుతం దేశంలో పాలన ఒక లక్ష్యం లేకుండా ఉంది. దీంతో అశాంతి పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం’’ అంటూ ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌ సమావేశంలో పాల్గొన్నవారి ముందుకుతెచ్చారు. టీఆర్‌ఎ్‌సను జాతీయ పార్టీగా మార్చే అంశంపైవారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తనదైన శైలిలో వివరించారు.

‘‘అపారమైన వనరులున్నా వాటిని వాడుకునే నైపుణ్యాలు, నిబద్ధత లేకుండా పోయింది. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే కానీ.. ప్రజలకు అవసరమైన ఎజెండా ఏమీ అమలు కావట్లేదు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజల అవసరాలపైన మాట్లాడదామన్నా జైశ్రీరాం నినాదాలు చేస్తూ అడ్డుకుంటున్నారు’’ అని సీఎం ఆక్షేపించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఖతమైపోయిందని సమావేశంలో కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రాల్లో అధికారం కాపాడుకోలేని దుస్థితికి చేరుకుందన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీ97 శాతం అపజయాలే మూటకట్టుకుందని గుర్తుచేశారు. ‘‘బీజేపీని చూస్తే.. వారి మత రాజకీయాలతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇలాంటప్పుడు ప్రజల అవసరాలు ప్రాతిపదికన జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్దామా?’’ అంటూ అని సమావేశంలో కేసీఆర్‌ ప్రతిపాదించారు.


మన ఎజెండాకు మద్దతు దక్కుతుంది

జాతీయ పార్టీగా ముందుకుతెచ్చే ప్రజల ఎజెండాకు దేశంలోని పలు పార్టీలు, మేధావులు, ప్రజల మద్దతు తప్పక లభిస్తుందని సమావేశంలో కేసీఆర్‌ అన్నారు. మరోవైపు జాతీయ పార్టీ ఏర్పాటుపై సీఎం ప్రతిపాదనకు సమావేశంలో పాల్గొన్న అందరూ ఏకీభవించారు. ఈ నెల 19 లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి టీఆర్‌ఎ్‌సను భారత రాష్ట్ర సమితిగా మార్చే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన వచ్చినా.. నామినేషన్లకు ఇంకా సమయం ఉన్నందున చర్చ జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. 


పీకే డైరెక్షన్‌.. కేసీఆర్‌ యాక్షన్‌? 

ప్రతికూల పరిస్థితులనూ అనుకూలంగా మార్చే నైపుణ్యాలున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మార్గదర్శనంలోనే సీఎం కేసీఆర్‌.. జాతీయ పార్టీ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపైసర్వేలు నిర్వహించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల ఫాంహౌ్‌సలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సగానికిపైగా నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉన్న అంశంపై వారు చర్చించారు. అయితే, ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపైనా వారు సమీక్షించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవలి వరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన ప్రశాంత్‌ కిశోర్‌.. ఆ పార్టీ విజయానికి రూట్‌ మ్యాప్‌నూ వివరించారు. అయితే చర్చలు విఫలం కావడంతో ఆ పార్టీలో చేరట్లేదని ప్రకటించారు. బిహార్‌లో కొత్త పార్టీ పెడుతున్నట్లూ వార్తలు వచ్చాయి. అయితే, ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహంతో ముందుకుసాగుతున్న కేసీఆర్‌.. మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని ఇటీవల ప్రకటించారు. టీఆర్‌ఎ్‌సను జాతీయ పార్టీగా మారుస్తున్నట్లుగా మంత్రులు, పలురువు ప్రజాప్రతినిధుల సమావేశంలో సంకేతం ఇవ్వడంతో.. కేసీఆర్‌ చెప్పిన సంచలన ప్రకటన ఇదేనా? అన్న చర్చ నడుస్తోంది. కాగా, సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, నేతకాని వెంకటేష్‌, జోగినిపల్లి సంతో్‌షకుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌, మండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T07:43:38+05:30 IST