చదువులో భారత సంతతి విద్యార్థి అసాధారణ ప్రతిభ.. UAEలో అరుదైన గౌరవం!

ABN , First Publish Date - 2022-03-13T17:09:50+05:30 IST

చదువులో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న భారత సంతతి విద్యార్థికి యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది.

చదువులో భారత సంతతి విద్యార్థి అసాధారణ ప్రతిభ.. UAEలో అరుదైన గౌరవం!

దుబాయ్: చదువులో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న భారత సంతతి విద్యార్థికి యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం అమన్ మక్బూల్ అనే భారత సంతతి విద్యార్థికి తాజాగా గోల్డెన్ వీసా మంజూరు చేసింది. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎంఏహెచ్ఈ) విద్యార్థి అయిన 20 ఏళ్ల అమన్ అతని హైస్కూల్ రోజుల నుండి అకాడమిక్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గ్రేడ్-10 పరీక్షల్లో 94.2 శాతం మార్కులు సాధించి తొలిసారి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత గ్రేడ్-12లో 95 శాతం మార్కులు సాధించాడు. ప్రస్తుతం మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎంఏహెచ్ఈ)కి చెందిన దుబాయ్ క్యాంపస్‌లో బీఎస్‌సీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు చేస్తున్నాడు. అమన్‌కు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ స్టడీస్ అంటే అమితాశక్తి అని అతని తండ్రి మక్బూల్ అహ్మద్ అన్నారు. అందుకే బీఎస్‌సీలో పట్టుబట్టి మరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తున్నట్లు తెలిపారు. 


కాగా, అమన్ స్కూల్ చదువంతా కూడా షార్జాలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్‌లోనే కొనసాగింది. అమన్ కుటుంబం దాదాపు రెండు దశాబ్దాల నుంచి యూఏఈలోనే నివాసం ఉంటోంది. అమన్‌కు అమ్మ అనిత, తమ్ముడు అయాన్ ఉన్నారు. 'అమన్‌కు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా మక్కువ. అతను ఇంటి కంటే కూడా క్యాంపస్‌కి వెళ్లడాన్ని ఇష్టపడతాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం' అని తల్లి అనిత చెప్పుకొచ్చారు. అమన్‌కు గోల్డెన్ వీసా లభించడం పట్ల తండ్రి అహ్మద్ ఆనందం వ్యక్తం చేశారు. 'అతనికి గోల్డెన్ వీసా వస్తుందని మేం అనుకోలేదు. నేను అమన్ తరపున ఈ వీసా కోసం దరఖాస్తు చేశాను. ఇది అతను చదువులో పడిన శ్రమకు దక్కిన ప్రతిఫలం' అని అన్నారు. 


ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ, సంజయ్ కపూర్, ఊర్వశి రౌతేలా, ఫరా ఖాన్ కుందన్, సోను నిగమ్, వరుణ్ ధావన్‌ ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు నటి త్రిషా, సీనియర్ గాయని కేఎస్ చిత్ర, క్రీడాకారిణి సానియా మీర్జా కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. అలాగే కొణిదేల వారి కోడలు, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన సైతం ఇటీవల గోల్డెన్ వీసా అందుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-03-13T17:09:50+05:30 IST