ఉక్రెయిన్ కోసం గన్ను పట్టిన భారతీయుడు.. ఇంటికొచ్చేస్తానంటూ తండ్రికి కబురు..!

ABN , First Publish Date - 2022-03-13T22:14:10+05:30 IST

రెండు సార్లు ప్రయత్నించినా అతడు భారత సైన్యంలో చేరలేకపోయాడు. ఎత్తు సరిపోని కారణంగా సైన్యం అతడిని చైర్చుకునేందుకు నిరాకరించింది. ఆ తరువాత పైచదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. ఇంతలో రష్యా దాడి మొదలవడంతో ఉక్రెయిన్‌లో ఓ పారామిలిటరీ బృందంలో చేరాడు. ఇప్పుడేమో..

ఉక్రెయిన్ కోసం గన్ను పట్టిన భారతీయుడు.. ఇంటికొచ్చేస్తానంటూ తండ్రికి కబురు..!

ఎన్నారై డెస్క్: రెండు సార్లు ప్రయత్నించినా అతడు  భారత సైన్యంలో చేరలేకపోయాడు. ఎత్తు సరిపోని కారణంగా సైన్యం అతడిని చైర్చుకునేందుకు నిరాకరించింది. ఆ తరువాత పైచదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. ఇంతలో రష్యా దాడి మొదలవడంతో ఉక్రెయిన్‌లో ఓ పారామిలిటరీ బృందంలో చేరాడు. ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకున్న ఆ యువకుడి పేరు సాయినిఖేశ్. అతడి స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూర్. సాయినిఖేశ్ ప్రస్తుతం భారత్ తిరిగొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ అతడి తండ్రి రవిచంద్రన్ తాజాగా స్థానిక మీడియాకు తెలిపారు.


ఉక్రెయిన్‌లోని నేషనల్ ఎయిరో స్పేస్ యూనివర్శిటీలో సాయినిఖేశ్ ఎయిర్ స్పేస్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నాడు. ఫిబ్రవరిలో అతడు జార్జియన్ నేషనల్ లీజియ్ అనే పారామిటిలరీ దళంలో స్వచ్ఛందంగా చేరాడు. ఆ బృందంలో చేరిన వారందరూ వలంటీర్లే. అయితే.. మూడు రోజుల క్రితం తన కుమారుడితో చివరిసారిగా మాట్లాడానని రవిచంద్రన్ తెలిపారు. ‘‘ కేంద్ర ప్రభుత్వ అధికారులు మాతో టచ్‌లోనే ఉన్నారు. మా కుమారుడు ఎక్కడున్నాడో వెతికిపట్టుకుని సురక్షితంగా స్వదేశానికి తెస్తామని వారు మాటిచ్చారు. సాయినిఖేశ్‌తో నేను మూడు రోజుల క్రితం మాట్లాడాను. భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలిపాడు. ఇక తమను ఏ సమయంలోనైనా సంప్రదించొచ్చని అధికారులు మాకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై మీడియాలో వచ్చే వార్తలు నా కుమారుడి రాకపై ప్రతికూల ప్రభావం చూపించకూడదని కోరుకుంటున్నా’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు.


 అయితే.. ఇండియాకు తిరిగి రావాలన్న తల్లిదండ్రుల అభ్యర్థనపై సాయినిఖేశ్ ఆశించిన తీరులో స్పందించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ‘‘యుద్ధం ప్రారంభమైన తరువాత అతడు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించలేదు. యుద్ధ ప్రాంతాల్లో అతడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కొంత కష్టంతో కూడుకున్న పని’’ అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-13T22:14:10+05:30 IST