ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి శరీరంలోకి దూసుకెళ్లిన తూటాలు..!

ABN , First Publish Date - 2022-03-05T13:12:38+05:30 IST

యుద్ధోన్మాదంతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి ఎలాగైనా బయటపడాలనే తాపత్రయం ఓ భారత పౌరుడిని గాయాలపాల్జేసింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఎదురు కాల్పులు జరుగుతుండగా నాలుగు తూటాలు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయి. ఢిల్లీకి చెందిన హర్‌జ్యోత్‌ సింగ్‌(31), గత నెల 27న మరో ఇద్దరితో కలిసి..

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి శరీరంలోకి దూసుకెళ్లిన తూటాలు..!

చికిత్సతో తప్పిన ప్రాణాపాయం

15 విమానాల్లో 3వేల మంది స్వదేశానికి

కీవ్‌, మార్చి 4: యుద్ధోన్మాదంతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి ఎలాగైనా బయటపడాలనే తాపత్రయం ఓ భారత పౌరుడిని గాయాలపాల్జేసింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఎదురు కాల్పులు జరుగుతుండగా నాలుగు తూటాలు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయి. ఢిల్లీకి చెందిన హర్‌జ్యోత్‌ సింగ్‌(31), గత నెల 27న మరో ఇద్దరితో కలిసి ట్యాక్సీలో కీవ్‌ నుంచి బయలుదేరగా ఈ ఘటన జరిగింది. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కీవ్‌ క్లినికల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పలుచోట్ల బుల్లెట్‌ గాయాలు తగిలినట్లు వైద్యులు తెలిపారు.  ఆస్పత్రికి భారత రాయబార కార్యాలయం 20నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్నా.. తన విషయంలో భారత రాయబార కార్యాలయం సరిగా స్పందించలేదని హర్‌జ్యోత్‌ ఆరోపించాడు. చావు తథ్యం అనుకున్న స్థితి నుంచి తాను ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పాడు.


వెంటనే ఉక్రెయిన్‌ నుంచి తరలించాలని విన్నవించాడు. హర్‌జ్యోత్‌ గాయపడిన విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ధ్రువీకరించారు. కాగా రష్యా-ఉక్రెయిన్‌ బలగాల ఎదురు కాల్పుల యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఖార్కివ్‌లో 300 మంది దాకా, సూమెలో 700 మంది దాకా భారతీయులు ఉన్నట్లు భారత్‌ ప్రకటించింది. ఇక గత 24 గంటల్లో 15 విమానాల్లో 3 వేలమంది భారత్‌కు చేరారని విదేశాంగ శాఖ కార్యదర్శి ఆరిందమ్‌ బాగ్చి తెలిపారు. ఇప్పటివరకు 6,400 మందిని తీసుకొచ్చామని, రెండ్రోజుల్లో 7,400 మందిపైగా రానున్నారని వివరించారు. ఇదిలా ఉండగా.. యుద్ధం తీవ్రంగా ఉన్న ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని సుమీ, ఖర్కీవ్‌ నగరాల నుంచి భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు రష్యా రాజధాని మాస్కోలో రెండు ఐఎల్‌-76 విమానాలను సిద్ధంగా ఉంచినట్లు వాయుసేన తెలిపింది. 


మా ఆతిథ్యాన్ని మీ విద్యార్థులకు చెప్పండి 

రొమేనియా నుంచి భారతీయ విద్యార్థుల తరలింపును పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు చిత్రమైన అనుభవం ఎదురైంది. బుకారె్‌స్టలో సహాయ శిబిరంలో సింధియా.. తరలింపు ప్రణాళికను వివరిస్తుండగా, స్థానిక మేయర్‌ నిక్యూసర్‌ డాన్‌ కల్పించుకుంటూ.. ‘‘మీవారికి ఆహారం ఆశ్రయం ఇచ్చింది నేను. మీరు కాదు. ఆ విషయాన్ని మీ విద్యార్థులకు చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా.. సింధియా.. ‘‘ఏం చెప్పాలో నన్ను నిర్ణయించుకోనివ్వండి’’ అంటూ కాస్త కటువుగానే బదులిచ్చారు. ఇక రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులతో ఢిల్లీలోని హిండన్‌ స్టేషన్‌కు చేరిన వాయుసేన విమానంలోకి వెళ్లిన అజయ్‌.. ‘‘మీరు ప్రధాని మోదీ దయతో క్షేమంగా స్వదేశం చేరారు. భారత్‌ మాతాకీ జై.. మోదీ జీ జిందాబాద్‌’’ అని నినదించారు. అయితే.. విద్యార్థులు మాత్రం ‘‘భారత్‌ మాతాకీ జై’’ అని సరిపెట్టారు.


మోదీ జీ... మేం చచ్చిపోతామేమో! 

రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న సూమెలో చిక్కుకున్న 100 మంది భారతీయ విద్యార్థులు తమను కాపాడాలంటూ ప్రధాని మోదీకి ఒక వీడియోలో విజ్ఞప్తి చేశారు. తిండి, నీళ్లు లేక  అవస్థలు పడుతున్నామని.. వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని.. లేదంటే అలాగే చచ్చిపోతామేమోనంటూ కన్నీరు పెట్టారు.

Updated Date - 2022-03-05T13:12:38+05:30 IST