సినిమాను తలపించే మున్నీ కథ.. ఎన్నో ట్విస్టులు.. అంతకుమించి భావోద్వేగాలు..

ABN , First Publish Date - 2021-12-26T17:48:27+05:30 IST

సినిమాను తలపించే కథ ఈ మున్నీది. 1981లో దగ్గరి బంధువు ఒకరు మున్నీని మోసపూరితంగా సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ ఓ వ్యక్తికి అమ్మేశాడు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. అక్కడి నుంచి ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి హర్యానాకు తీసుకెళ్లాడు. అనంతరం హర్యానాలో మనుషులను అక్రమ రవాణా చేసే ఓ ముఠాకు విక్రయించడంతో చివరకు మున్నీ పాకిస్థాన్ చేరుకుంది.

సినిమాను తలపించే మున్నీ కథ.. ఎన్నో ట్విస్టులు.. అంతకుమించి భావోద్వేగాలు..

ఇంటర్నెట్ డెస్క్: సినిమాను తలపించే కథ ఈ మున్నీది. 1981లో దగ్గరి బంధువు ఒకరు మున్నీని మోసపూరితంగా సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ ఓ వ్యక్తికి అమ్మేశాడు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. అక్కడి నుంచి ఆమెను కొనుగోలు చేసిన మరో వ్యక్తి హర్యానాకు తీసుకెళ్లాడు. అనంతరం హర్యానాలో మనుషులను అక్రమ రవాణా చేసే ఓ ముఠాకు విక్రయించడంతో చివరకు మున్నీ పాకిస్థాన్ చేరుకుంది. అయితే, కరాచీకి చెందిన సజ్జాద్ అనే వ్యక్తి ఆమెను ఆ ముఠా నుంచి కాపాడాడు. ఆ తర్వాత మున్నీని సజ్జాద్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత మున్నీ పేరు కాస్తా బష్రాగా మారింది. ఈ దంపతులకు ఇప్పుడు నలుగురు పిల్లలు. అలా 40 ఏళ్లు గడిచిపోయాయి. అయినా బష్రా తన కుటుంబ సభ్యులను మరిచిపోలేకపోయింది. ఆమెకు ఎప్పుడు వారి గురించే ఆలోచన. 


తనది యూపీలోని సంభాల్ పరిధిలో ఉండే సరైతరీన్ గ్రామం తన సొంతూరని, తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో పాటు తన ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా గుర్తు ఉన్నారని చెబుతుండేది. అలా ఒకరోజు ఆమె మాట్లాడుతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. అనంతరం ఆ వీడియోను బష్రా వరుసకు సోదరుడైన అక్రమ్ డిసెంబర్ 20న సోషల్ మీడియాలో చూశాడు. అయితే, వీడియో చూసిన మొదటిసారి బష్రాను అక్రమ్ గుర్తు పట్టలేదు. కానీ, తన సొంతూరి గురించి ఆమె వీడియోలో చెబుతున్న వివరాలను బట్టి కచ్చితంగా ఆమె తన పెద్దక్క మున్నీ అని గుర్తు పట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ తర్వాత ఆ వీడియోను తమ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అలాగే ఓ లోకల్ జర్నలిస్ట్‌కు కూడా ఆ వీడియోను పంపించాడు. 


ఇక ఆ వీడియో చూసిన మున్నీ కుటుంబ సభ్యులు కచ్చితంగా ఆమె తమ కూతురేనని నిర్ధారించుకున్నారు. అనంతరం ఆ వీడియోలోని వివరాల ఆధారంగా ఆమెను సంప్రదించారు. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఫోన్‌లో మాట్లాడుతుంటే.. బష్రా ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు ప్రతిరోజు ఆమెతో గంటల తరబడి ఫోన్ మాట్లాడుతున్నారు. బష్రాను ఎప్పుడు కలుస్తామా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా అక్రమ్ ప్రధాని మోదీకి ఓ వినతి చేశారు. తన సోదరి బష్రాకు త్వరగా వీసా వచ్చేలా చూడాలని కోరారు. అటు బష్రా కూడా ఎంత త్వరగా తన కుటుంబ సభ్యులను కలుస్తానా అని ఆశగా ఎదురుచూస్తోంది. ఏదైతేనేం.. బష్రా కథ సుఖాంతం కావడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

Updated Date - 2021-12-26T17:48:27+05:30 IST