మనోళ్ల ఆట మారేనా..?

ABN , First Publish Date - 2022-03-12T09:35:58+05:30 IST

బలహీన పాకిస్థాన్‌పై చేలరేగిన భారత బ్యాటర్లు..గట్టి జట్టు న్యూజిలాండ్‌పై పూర్తిగా విఫలమయ్యారు.

మనోళ్ల ఆట మారేనా..?

వెస్టిండీస్‌తో భారత మహిళల మ్యాచ్‌ నేడు

ఉదయం 6.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో 

వన్డే ప్రపంచ కప్‌


హామిల్టన్‌: బలహీన పాకిస్థాన్‌పై చేలరేగిన భారత బ్యాటర్లు..గట్టి జట్టు న్యూజిలాండ్‌పై పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా ప్రపంచ కప్‌ రెండో మ్యాచ్‌లో పరాజయం చవిచూసిన భారత మహిళలు శనివారం ప్రమాదకర ప్రత్యర్థి వెస్టిండీ్‌సతో పోరుకు సిద్ధమయ్యారు. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న మిథాలీసేన.. విండీ్‌సను ఓడించి గెలుపుబాట పట్టాల్సిందే. కివీ్‌సపై 261 పరుగుల ఛేదనలో మంధాన, మిథాలీ, యువ యాస్తికా భాటియా, ఆల్‌రౌండర్‌ దీప్తీశర్మ గెలుపు కసిలేకుండా బ్యాటింగ్‌ చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. హర్మన్‌ప్రీత్‌ (63 బంతుల్లో 71 పరుగులు) మాత్రమే ధాటిగా ఆడింది.


విండీస్‌తో పోరుకు యాస్తికా స్థానంలో  షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చే చాన్సుంది. చివరి వరల్డ్‌ కప్‌ ఆడుతున్న కెప్టెన్‌ మిథాలీ బ్యాట్‌ ఝళిపించాల్సిన అవసరం ఉంది. మంధాన కూడా అంతంతమాత్రంగానే రాణిస్తుండడంతో పూజా వస్త్రాకర్‌, స్నేహ్‌ రాణాలపై తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. దాంతో సీనియర్‌ బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలని కోచ్‌ రమేశ్‌ పొవార్‌ గట్టిగానే చెప్పాడు. 


కరీబియన్ల దూకుడు:

కిందటి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో 225 పరుగులను కూడా కాపాడుకోగలగడం కరీబియన్‌ మహిళల ఆట తీరుకు అద్దంపడుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఏ జట్టుకూ లేని బౌలింగ్‌ వనరులు విండీ్‌సకు ఉన్నాయి. అందుకే ఇంగ్లండ్‌తో పోరులో వెస్టిండీస్‌ సారథి స్టెఫానీ టేలర్‌ ఏకంగా 8మందితో బౌలింగ్‌ వేయించగలిగింది. బలీయమైన జట్లు న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌పై స్కోర్లను కాపాడుకొని గెలుపొందిన వెస్టిండీ్‌సతో పోరు భారత్‌కు సులువేమీ కాబోదు.

Updated Date - 2022-03-12T09:35:58+05:30 IST