ఉమ్రా యాత్ర చేసుకుని స్వదేశానికి తిరిగొద్దామనుకున్న మలయాళీ ఫ్యామిలీ.. ఇంతలోనే తీవ్ర విషాదం..!

ABN , First Publish Date - 2021-11-10T16:09:09+05:30 IST

సౌదీ అరేబియాలోని జెడ్డాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

ఉమ్రా యాత్ర చేసుకుని స్వదేశానికి తిరిగొద్దామనుకున్న మలయాళీ ఫ్యామిలీ.. ఇంతలోనే తీవ్ర విషాదం..!
మృతుడు రిషద్ అలీ..

జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉమ్రా యాత్ర కోసం మదీనా వెళ్లి అక్కడి నుంచి జెడ్డాకు తిరుగు పయనమైన మలయాళీ కుటుంబం కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏడుగురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఓ ఒంటెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన ఆరుగురిని జెడ్డాలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడిని కేరళ రాష్ట్రం తువ్వుర్‌కు చెందిన రిషద్ అలీ(28)గా గుర్తించారు. 


వివరాల్లోకి వెళ్తే... కేరళకు చెందిన రెండు కుటుంబాలు ఉమ్రా యాత్ర కోసం జెడ్డా నుంచి మదీనాకు కారులో వెళ్లాయి. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన ఏడుగురు ఒకే కారులో ఉమ్రా వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రబాక్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు ముందుకు ఒక్కసారిగా ఓ ఒంటె వచ్చింది. దీంతో కారు ఆ ఒంటెను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రిషద్ అలీ అక్కడికక్కడే చనిపోయాడు. అమీ రోహా(03), రింషిల్లా(24), ముహమ్మద్ బిన్స్(16)కు స్వల్ప గాయాలు కాగా, రాంలాత్(52), రిషద్ అలీ భార్య ఫర్సీనా తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


గాయపడిన వారిని వెంటనే జెడ్డాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రిషద్ అలీ మృతదేహం రబాక్ ఆస్పత్రి మార్చురీలో ఉంది. ఉమ్రా యాత్ర చేసుకుని బుధవారం స్వదేశానికి రావడానికి ఈ రెండు ఫ్యామిలీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.   

 


Updated Date - 2021-11-10T16:09:09+05:30 IST