10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆమెకు అబార్షన్ చేసిన డాక్టర్‌కు భారీ షాక్..!

ABN , First Publish Date - 2022-07-17T02:42:29+05:30 IST

అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన 10 ఏళ్ల బాలికకు అబార్షన్ చేసిన అమెరికా డాక్టర్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది.

10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆమెకు అబార్షన్ చేసిన డాక్టర్‌కు భారీ షాక్..!

ఎన్నారై డెస్క్: అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన 10 ఏళ్ల బాలికకు అబార్షన్ చేసిన అమెరికా డాక్టర్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. అబార్షన్ చేసిన వైద్యురాలు డా. కేటలిన్ బెర్నాడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిస్తే ఆమె లైసెన్స్ కోల్పోవాల్సి వస్తుందని ఇండియానా రాష్ట్ర అటార్నీ జనరల్ టాడ్ రోకిటా తాజాగా హెచ్చరించారు. ఆమెపై క్రిమినల్ చట్టాల కింద దర్యాప్తు కూడా జరుపుతామని తెలిపారు. ‘‘ఈ విషయంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. అబార్షన్లకు సంబంధించిన నియమనిబంధనలన్నీ ఆమె పాటించారో లేదో విచారిస్తున్నాం. చట్టాన్ని అతిక్రమించినట్లు తేలితే.. ఆమె తన లైసెన్స్‌ను కూడా కోల్పోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. ఇక పేషెంట్ల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన చట్టాలు ఏమైనా ఉల్లంఘించారా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.


బాలిక విషయాన్ని ఇండియానా పోలిస్ పత్రిక తొలిసారిగా బయటపెట్టింది. బాధితురాలు ఓహాయో రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని పేర్కొంది. అయితే.. ఓహాయో చట్టాలు అబార్షన్‌ను అనుమతించకపోవడంతో ఆమె పొరుగు రాష్ట్రమైన ఇండియానాకు వచ్చినట్టు తెలిపింది. అయితే.. అబార్షన్ చట్టానికి సంబంధించి అన్ని నిబంధనలను డా. కేటలిన్ పాటించినట్టు పత్రిక మరో కథనాన్ని ప్రచురించింది. నిబంధనల ప్రకారం.. ఎప్పటికప్పుడు అవసరమైన డాక్యుమెంట్లను ప్రభుత్వానికి సమర్పించినట్టు పేర్కొంది. దీంతో.. ప్రభుత్వ అటార్నీ జనరల్ హెచ్చరికల్లో డొల్లతనం బయటపడిపోయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. తాము చట్టాన్ని అతిక్రమించలేదని కేటలిన్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. చట్టపరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న కేటలిన్.. వైద్యురాలిగా తనకున్న నైతిక బాధ్యతను అనుసరించి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. తమ పరువు తీసే ప్రయత్నం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే.. ఇండియానా అటార్నీ జనరల్, రాష్ట్ర గవర్నర్‌పై కూడా కోర్టుకు వెళతామని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-17T02:42:29+05:30 IST