ఆకస్మిక వరదలు.. అమెరికాలో భారతీయ యువతి గల్లంతు!

ABN , First Publish Date - 2022-08-24T01:32:17+05:30 IST

అమెరికాలోని ఓ భారతీయ యువతి ఆకస్మిక వరదల్లో పడి కొట్టుకుపోయారు.

ఆకస్మిక వరదలు..  అమెరికాలో భారతీయ యువతి గల్లంతు!

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఓ భారతీయ యువతి ఆకస్మిక వరదల్లో పడి కొట్టుకుపోయారు. ఈ నెల 19న జీతల్ అగ్నిహోత్రీ(29) అనే యువతి యూటా(Utah) రాష్ట్రంలోని జయాన్ నేషనల్ పార్క్‌కు వెళ్లిన సమయంలో.. వర్షాల కారణంగా ఆకస్మిక వరద పోటెత్తడంతో ఆమె గల్లంతయ్యారు(Missing). జీతల్ ఆచూకీ తెలుసుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని నేషనల్ పార్క్ ప్రతినిధి ఒకరు సోమవారం తెలిపారు. జయాన్ జాతీయవనంలో ఆమె తన స్నేహితులతో కలిసి హైకింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని ఆపదలో ఉన్న వారిని కాపాడినట్టు తెలిపారు. అయితే.. అగ్నిహోత్రి ఆచూకీ మాత్రం తెలియరాలేదన్నారు. సమీపంలోని వర్జీనియా నదిలో, ఇతర సరస్సుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. అరిజోనా యూనివర్విటీకి చెందిన హైడ్రాలజీ, వాతావరణ శాస్త్ర విభాగంలో జీతల్ పీహెచ్‌డీ చేస్తున్నారు.  


ఇటీవలకాలంలో అమెరికా దక్షిణాది ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం డాలస్‌లో 23.3 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక భారీ వర్షాలకు అరిజోనా రాష్ట్రంలోని గిలా నది ఉప్పొంగడంతో సమీప ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే.. అధికారులు అంతకుమునుపే ప్రజలకు సమీప ప్రాంతాలకు తరలించారు. ఇటీవల లాస్‌వేగాస్‌లోనూ ఆకస్మిక వరదల కారణంగా రెండు కెసీనోలు నీట మునిగాయి. ఈ వరదల్లో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

Updated Date - 2022-08-24T01:32:17+05:30 IST