‘భారతీయకరణ’ అంటే ‘కాషాయీకరణ’ కాదు!

ABN , First Publish Date - 2022-06-17T06:22:01+05:30 IST

మనవిద్యా విధానాన్ని ‘భారతీయకరణం’ చేయాలన్నది భారతీయ జనతాపార్టీ నుంచో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి నుంచో వచ్చిన ఆలోచన కాదు. గత రెండు దశాబ్దాలుగా అనేకమంది విద్యావేత్తలు భారతీయ విద్యా విధానంలోని...

‘భారతీయకరణ’ అంటే ‘కాషాయీకరణ’ కాదు!

మనవిద్యా విధానాన్ని ‘భారతీయకరణం’ చేయాలన్నది భారతీయ జనతాపార్టీ నుంచో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి నుంచో వచ్చిన ఆలోచన కాదు. గత రెండు దశాబ్దాలుగా అనేకమంది విద్యావేత్తలు భారతీయ విద్యా విధానంలోని ఈ లోపాన్ని గమనిస్తూనే ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉన్నారు. దురదృష్టవశాత్తు చాలామందికి మన విద్యను ‘భారతీయకరణం’ చేయటం అంటే ‘కాషాయీకరణం’గా ఎందుకు స్ఫురిస్తుందో అర్థం కాదు. నిజానికి ఏ రాజకీయ పార్టీ పిలుపుతోనూ నినాదాలతోనూ సంబంధం లేకుండా భారతీయ విద్యను ‘అపాశ్చాత్యీకరణ’ (డీ–వెస్ట్రనైజ్‌) చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సైన్సు, టెక్నాలజీ రంగాల్లో కన్నా సాంఘిక, సామాజిక, సాహిత్య, వ్యాపార, ఆర్థిక రంగాల్లో ఈ ‘అపాశ్చాత్యీకరణం’ తక్షణమే చేపట్టాలి.


ప్రపంచంలోని అత్యధిక జనాభాగల దేశాల్లో భారతదేశం రెండవది. అనేక వైవిధ్యాలకు, భాషలకు, సంస్కృతులకు నిలయమైన దేశం. అపార ప్రకృతి సంపద కలిగిన ఉపఖండం. భారతదేశం కంటే తక్కువ ప్రదేశాన్ని, జనాభాను కలిగిన యూరప్‌ దేశాలు గత శతాబ్దంలో అనేక సామాజిక, సాంఘిక, సాహిత్య సిద్ధాంతాలను వెలువరించాయి. ప్రస్తుతం ఆ పాశ్చాత్య సిద్ధాంతాలనే నేటికీ భారతీయ కాలేజీల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ పిల్లలకు బోధిస్తున్నారు. నిజానికి ఈ సామాజిక సిద్ధాంతాలు ఏవీ భారతీయ సంస్కృతిలోని వైరుధ్యాలకు, వైవిధ్యాలకు, సంస్కృతులకు వర్తించేవి కావు. అయినప్పటికీ పాశ్చాత్య సిద్ధాంతాలపైన, పాశ్చాత్య సామాజికవేత్తలపైన వల్లమాలిన అభిమానం ఒలకబోసే మన ప్రొఫెసర్లు తమ విద్యార్థులకు వాటినే బోధించి వాళ్ళను స్వతంత్రంగా ఆలోచించలేని నిస్సహయస్థితికి నెట్టి వేస్తున్నారు. నిజంగానే ఇంత వైవిధ్యం ఉన్న మన సంస్కృతి నుంచి ఎటువంటి సాంఘిక, సామాజిక సిద్ధాంతాలు రాలేదా, రావా?


అమెరికాకు చెందిన ఎడ్వర్డ్‌ సయీద్‌ అక్కడి కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఒక అద్భుత పరిశోధనా గ్రంథాన్ని 1978లో వెలికితెచ్చారు. దాని పేరు ‘ఓరియంటలిజమ్‌’. యూరప్‌, పశ్చిమ దేశాలు తమను తాము నాగరికులమని భావిస్తూ, పారిశ్రామికంగా శాస్త్రీయంగా ఎంతో పురోగమించామని అహంకరిస్తూ, తమను తాము ‘సబ్జెక్టులు’గా, తాము పాలించిన తూర్పు దేశాలను ‘ఆబ్జెక్టులు’గా అభివర్ణించుకొంటూ, తూర్పు దేశాల సాహిత్యం, సంస్కృతి, భాషలు, నాగరికతపై అధ్యయానికి ప్రత్యేక డిపార్టుమెంటులను తమ యూనివర్సిటీల్లో నెలకొల్పడం గురించిన పూర్వాపరాలు వివరించిన గ్రంథమే– ఈ ‘ఓరియంటలిజం’. అందులో భారతదేశమూ ఉంది. భారతీయ భాషలు, సంస్కృతులు, నాగరికత, ఆహారపు అలవాట్లు, కళలు ఇలా పలు రంగాలపై వారు ఈ ‘ఓరియంటల్‌ స్టడీస్‌’ డిపార్టుమెంటులో అధ్యయనం చేసేవారు. మన దేశం బానిసత్వంలో ఉన్నప్పుడూ, ఆ తర్వాత కూడా ఆ దేశాలకు ఇక్కడి నుంచి వెళ్ళినవారు ఈ యూనివర్సిటీల్లోని ఈ శాఖల్లోనే శిక్షణ పొంది భారతదేశానికి తిరిగి వచ్చేవారు. అనేక భారతీయ, ప్రాచ్య దేశాల సంస్కృతులను పాశ్చాత్య నాగరికతలో ఆవిష్కారమైన సామాజిక సిద్ధాంతాలతో పరిశీలించి ఆ పరిశీలనల ఆధారంగా మన దేశ వైవిధ్యాలను, సంస్కృతులను, సాహిత్యాన్ని, కళలను విమర్శించేవారు. ఒక్కోసారి ఈ విమర్శలు ఎంతో వక్రీకరణకు దారితీసేవి. అయినా మన భారతీయ విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు, అధ్యాపకులు పిల్లలకు అవే బోధించేవారు.


ఎడ్వర్డ్‌ సయీద్‌‌ ‘ఓరియంటలిజమ్‌’ గ్రంథం అనేకమంది పాశ్చాత్య ప్రొఫెసర్‌లను ఆలోచింపచేసింది. ‘‘ఎంత మాత్రం సంబంధంలేని నాగరికతల నుంచి ఉద్భవించిన సామాజిక సిద్ధాంతాలు మరో దేశానికి ఎలా వర్తిస్తాయి?’’ అని ఆలోచించసాగారు. అంతేగాదు, తమ ‘యూరో సెంట్రిక్‌’ పద్ధతిలోనూ, పరిశోధనల్లోనూ తీవ్ర లోపాలున్నట్లు గుర్తించటం మొదలుపెట్టారు. అదే సమయంలో ధామస్‌ ఖున్‌ అనే మరో అమెరికన్‌ శాస్త్రవేత్త ‘వెస్ట్రన్‌ సైంటిసిజమ్‌’ అనే పాశ్చాత్య అహంభావాలను దెబ్బతీస్తూ ‘స్ట్రక్చర్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రివల్యూషన్స్‌’ అనే అద్భుత పరిశోధనా గ్రంథాన్ని 1962లో ఆవిష్కరించారు. దీనివలన ‘సైంటిసిజమ్‌’ అనే దాని పరిమితులు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు బాగా అవగాహన అయ్యాయి. అంటే పాశ్చాత్య శాస్త్రీయ ఆవిష్కరణలు అన్నీ విశ్వజనీయం కావు. విజ్ఞాన శాస్త్రపరిశోధనలు అన్నీ సరళరేఖలో వెళ్ళవు, సర్వ కాలీనం అంతకంటే కావు. ఈ గ్రంథాల వల్ల అనేక మంది శాస్త్రవేత్తలు పాశ్చాత్య శాస్త్ర పరిశోధనల్లోని ‘శాస్త్రీయత’ పరిమితులను గుర్తించారు. సైన్సు రంగం కంటే ముఖ్యంగా సామాజిక, సాంఘిక, రాజకీయ, సాహిత్య, ఆర్థిక రంగాల్లో ఈ పరిమితులు ఎక్కువ.


ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన జేమ్స్‌ కుర్రాన్‌, పార్క్‌ మ్యూలింగ్‌లు 2000 సంవత్సరంలో అపాశ్చాత్యీకరణపై తొలి పుస్తకాన్ని ప్రచురించారు. ఈ ‘డి–వెస్ట్రనైజేషన్‌’ ద్వారానే విద్య ‘అంతర్జాతీయం’గా పరిణమిస్తుంది అన్న భావన చాలామంది పాశ్చాత్య ఆచార్యులలో, విశ్వవిద్యాలయాల్లో వ్యక్తమయింది. సరిగ్గా ఇదే సమయంలో చైనా, హాంగ్‌కాంగ్‌, జపాన్‌, గల్ఫ్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు ‘అపాశ్చాత్యీకరణ’పై పరిశోధనలను ముమ్మరం చేశాయి. 2012లో శాంతావేణుగోపాలనాయర్‌ ‘ది గేజ్‌ ఆఫ్‌ ది వెస్ట్‌ అండ్‌ ఫ్రేమింగ్స్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అనే పుస్తకాన్ని వెలువరించింది. ఇందులో ‘ఓరియంటలిజమ్‌’ అసలు ఎలా ఉండాలో, దాన్ని పాశ్చాత్య దేశాలు ఎలా మార్చాయో ఎడ్వర్డ్‌ సయీద్‌‌ను ఉటంకిస్తూ ప్రముఖుల వ్యాసాలు పొందుపరచటమేగాక, భారతీయమైన ఎన్ని విశేషాలు భారతీయ సంస్కృతినుంచే ఎలా వివరించాలో పొందుపరచింది. నిజానికి నూటికి 70–80 శాతం యూరప్‌, అమెరికా దేశాల సంస్కృతి ఒకే రీతిగా ఉంటుంది. వాటిని ‘హోమోజినియస్‌’ సొసైటీస్ అని అంటారు. కాని భారతదేశంలో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య సంస్కృతి చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి భిన్న సంస్కృతి కలిగిన సమాజాలను ‘హెటిరోజినస్‌’ సొసైటీలు అంటారు. అలాంటప్పుడు యూరప్‌ దేశాలు సామాజిక, సాంఘిక సిద్ధాంతాలను భారతదేశానికి వర్తిస్తూ పరిశోధనలు, విద్యా బోధనలు చేయటం ఏమిటి? 


అసలు ఒక దేశ సంస్కృతి, నాగరికత నుంచి సాంఘిక, సామాజిక సిద్ధాంతాలు రావటం ఏమిటి? అది సాధ్యమా? అని ఎవరైనా అడగవచ్చు. అలా వస్తాయి, వచ్చాయి కాబట్టే మన విద్యలకు, బోధనలకు ‘భారతీయకరణ’ అవసరం అని చెప్పవలసి వస్తుంది. నిజానికి భారతీయ సంస్కృతి, సాహిత్యం, నాగరికతల నుంచి మనం పరిశోధనకు తీసుకోదగ్గ అంశాలు ఎన్నో ఉన్నాయి. ‘పంచతంత్రం’ కథల్లోనే మన ఆధునిక సమాజానికి అన్వయించగల అనేక అంశాలు ఉన్నాయి. సామాజిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య రంగాలలో పరిశోధనలకు ఆయా దేశాల జానపద, సాహిత్య, ఇతిహాసిక కథలు, ఆ దేశాల్లో జరిగిన విప్లవాలు, తిరుగుబాట్లు, ఇలా ఏవైనా మూలపదార్థాలు కావచ్చును. మన దేశంలో గూడ అపారమైన సంస్కృతులు, కళలు, నాగరికతలు, విప్లవాలు, విప్లవ సిద్ధాంతాలు, సాహిత్యాలు, రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా శాస్త్రీయంగా శోధిస్తే అనేక ఆణిముత్యాల వంటి పరిశోధనలను వెలుగులోకి తేవచ్చు. అదే నిజమైన ‘భారతీయకరణ’–ఆలస్యంగానైనా ఇది ఎంత త్వరగా ప్రారంభమైతే అంత మంచిది.

డా. కొప్పరపు నారాయణమూర్తి

Updated Date - 2022-06-17T06:22:01+05:30 IST