పౌరసత్వమే జాతి నిర్మాణ సూత్రం

ABN , First Publish Date - 2022-04-30T06:39:08+05:30 IST

కొద్దిరోజుల క్రితం పలు వార్తాపత్రికలలో ఒక వార్త శీర్షిక చదివి ఉలిక్కిపడ్డాను.

పౌరసత్వమే జాతి నిర్మాణ సూత్రం

కొద్దిరోజుల క్రితం పలు వార్తాపత్రికలలో ఒక వార్త శీర్షిక చదివి ఉలిక్కిపడ్డాను. ఇదీ ఆ వార్తా శీర్షిక : Indianness the Only Caste. ‘శివగిరి యాత్ర’ 90వ వార్షి కోత్సవ వేడుకలను వర్చ్యువల్‌గా ప్రారంభిస్తూ ప్రధానమంత్రి వెలువరించిన ప్రసంగానికి సంబంధించిన వార్త అది. కేరళలో నడయాడిన ఋషి, తాత్త్వికుడు నారాయణ గురు (1856–1928) గౌరవార్థం ఏటా ‘శివగిరి యాత్ర’ నిర్వహిస్తారు. నారాయణ గురు బోధనల పట్ల నాకు అవగాహన ఉంది. శివగిరిని కూడా సందర్శించాను. ఒక అస్తిత్వంగా కులాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని నా అవగాహనా అనుభవాలతో నేను విశ్వసిస్తున్నాను. కుల వివక్షపై నారాయణ గురు తన జీవితపర్యంతం పోరాడారు. శివగిరిలోని ఆయన ఆశ్రమ ధర్మ సూత్రం : ‘ఓమ్ సహోదర్యం సర్వత్ర’ (భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానులు).


నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి. భారత్ ఒక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం. మన గణతంత్ర రాజ్య వ్యవహారాలు ఒక రాజ్యాంగం నిర్దేశించిన విధంగా నడుస్తాయి. ‘భారతదేశ ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకుని, మాకు మేమే సమర్పించుకున్నాము’ అని మన సంవిధాన మున్నుడి ఉద్ఘోషించింది. రాష్ట్రాలు, మతాలు, మత శాఖలు, భాషలు, కులాలను మన రాజ్యాంగం అంగీకరించింది. అమానుష దురాచారం అంటరానితనం సమాజంలో ఇంకా బలీయంగా ఉందని కూడా గుర్తించింది. ఆ అసహ్యకర ఆచరణను అంతమొందించేందుకు భారత సంవిధానం హామీ ఇచ్చింది. పలు విధాల– జన్మతః, వారసత్వంగా, సహజీకరణం, కొత్త భూభాగాలు దేశంలో అంతర్భాగమవ్వడం, వలసల ద్వారా– సంక్రమించిన పౌరసత్వాన్ని భారత రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగంలోని అనేక అధికరణలలో ‘ఇండియా’ అనే పదం కనబడుతుంది. ‘భారతీయ’ అనే పదం ఆంగ్లో–ఇండియన్, ఇండియన్ స్టేట్, ఇండియన్ ఇండిపెండెన్స్ ఆక్ట్–1947 అంశాల ప్రస్తావనలలో చోటు చేసుకుంది. అయితే ‘Indianness’ (భారతీయత) అనే పదాన్ని ఏ అధికరణలోనూ నేను చూడలేదు.


కులం అనే మాటకు ఆంగ్ల భాషలో గానీ, భారతీయ భాషలలో గానీ ఒకే ఒక్క అర్థం ఉంది. కులం అంటే జాతి. కులం అనే మాట వినగానే కుల వ్యవస్థతో ముడివడి ఉన్న అనేకానేక దౌష్ట్యాలూ దుష్కృత్యాలూ (ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నవే కదా!) మన మనస్సులో మెదులుతాయి. Caste అనే మాటను ప్రధానమంత్రి ఏ స్ఫూర్తితో ఉపయోగించారో నేను అర్థం చేసుకున్నాను. అయితే ఆయన ఆ పదాన్ని ఎంపిక చేసుకోవడం దురదృష్టకరం. ప్రధానమంత్రి తన భావాన్ని వ్యక్తం చేసేందుకు ఒక తప్పుడు పదాన్ని ఉపయోగించారు.


భారతీయతను కులంతో సమం చేయడం ప్రమాదకరం. ‘కులం’ అనే సామాజిక వ్యవస్థకు కఠిన, తిరోగామి నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం వివాహాలు సజాతీయంగా ఉండి తీరాలి. అంటే ఏ కులం పురుషుడు/మహిళ అయినా సరే తన సొంత కులంలోని మహిళ/పురుషుడినే పెళ్లి చేసుకోవాలి. ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకు మన కాలంలోనూ చాలామంది యువతీ యువకులు తమ నిండు జీవితాలను కోల్పోవలసి వచ్చింది. కులం ఒక సమూహాన్ని మరో సమూహం నుంచి వేరు చేస్తుంది తరచు రెండు సమూహాల మధ్య చీలికలు సృష్టిస్తుంది. శతృత్వాలను పెంపొందిస్తుంది. కుల విధేయతలు, కుల పక్షపాతాలు మత విధేయతల కంటే బలమైనవి; కుల పక్షపాతాలు మత పక్షపాతాల కంటే భయంకరమైనవి. ఇటీవలి కాలం వరకు మతం కంటే కులానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం పరిపాటిగా ఉండేది. కుల భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేసేందుకు వెనుకాడేవారు కాదు. మోదీ ప్రభుత్వం వచ్చాక కులం కంటే మతానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పుడు చాలామంది మతపరమైన భావావేశాలను బహిరంగంగా వ్యక్తం చేసేందుకు వెనుకాడడం లేదు.


కులం ప్రాధాన్యం పొందుతోంది. ఆ ప్రాధాన్యం దాని నీచ లక్షణాలనే బయటకు తెస్తోంది. కులం సంకీర్ణమైనది, ప్రత్యేకమైనది. వివాహం, ఆహారం, వస్త్రధారణ, ఆరాధన మొదలైన జీవన వ్యవహారాలకు సంబంధించిన దాని నియమాలు, నిబంధనలు కఠినమైనవి. సాధారణంగా మార్పును ప్రతిఘటించేవి. కులం ఒక వ్యక్తికి ఒకే ఒక అస్తిత్వం లేదా గుర్తింపును సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. ‘భారతీయత’ లక్ష్యం కూడా భారతీయులకు ఒకే ఒక్క గుర్తింపును సృష్టించడమే అయితే, మన సమాజం, సంస్కృతి లక్షణాలైన వైవిధ్యం, బహుళత్వంలకు అది పూర్తిగా విరుద్ధమైనది. భారతీయ జనతా పార్టీ భారతీయులకు ఒకే ఒక్క గుర్తింపును సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అది ఉద్దేశించిన ఆ ఏకైక గుర్తింపును, కోట్లాది నా సహ పౌరులవలే నేనూ తిరస్కరిస్తున్నాను.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన నన్ను ‘కుల నిర్మూలన’పై డాక్టర్ అంబేడ్కర్ చరిత్రాత్మక ప్రసంగాన్ని మళ్లీ చదివేందుకు ప్రేరేపించింది. బాబాసాహెబ్ స్ఫూర్తిదాయక మాటలు కొన్నిటిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుని తీరాలి: ‘హిందువుల నైతిక సంప్రదాయాలపై కుల ప్రభావం గర్హనీయమైనది. ప్రజాహిత స్ఫూర్తిని అది హతమార్చింది. దాతృత్వ గుణాలను నిర్మూలించింది. ప్రజాభిప్రాయాన్ని అసాధ్యం చేసింది’. ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘కుల వ్యవస్థను మించిన భ్రష్ట సామాజిక వ్యవస్థ మరొకటి లేదు. మీరు మీ సామాజిక వ్యవస్థను మార్చుకోకపోతే మీరు కించిత్ పురోగతి కూడా సాధించలేరు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు పరాయి వారి నుంచి రక్షించుకోవడానికి గానీ, శత్రువులపై దాడి చేయడానికి గానీ ప్రజలను సమీకరించలేరు. కులం పునాదిగా మీరు ఒక నీతిని గానీ, ఒక జాతిని గానీ నిర్మించలేరు...’ కుల వ్యవస్థ మన సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలను శాశ్వతం చేసింది. ముఖ్యంగా గ్రామాలలో కులం ప్రభావం బలీయమైనది. ఒకరి కులం, ఆ కులం సంఖ్యాధిక్యతలే అన్నిటినీ నిర్ణయిస్తుంది. సంఘంలో మీ సామాజిక హోదాను, రాజకీయ సంస్థల స్వరూపాలను, కార్యకలాపాల తీరుతెన్నులను, వాటి ప్రభావాలను నిర్ణయిస్తుంది. రాజకీయ అధికారం ఏ కులం వారి చేతుల్లో ఉంటే ఆ కులం వారికే ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. సాగు భూమి లేదా నివేశన స్థలానికి పట్టా పొందడం లేదా బ్యాంకు రుణం లేదా ప్రభుత్వోద్యోగం లభించడం అన్నది ఒక వ్యక్తి కులం లేదా కులపరమైన సంఖ్యాధిక్యత పైన ఆధారపడి ఉంది. ప్రైవేట్ రంగంలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. అనియత/ అసంఘటిత రంగంలో లేదా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో ఉద్యోగాలు దాదాపుగా యజమాని కులానికి చెందిన వారికే దక్కడం కద్దు.


కులాన్ని భారతీయతతో సమం చేయడం చాలా ప్రమాదకరం. అది ఎవరికీ మేలు చేయదు. కుల స్పృహ, కులాధారిత వివక్ష రాత్రికి రాత్రే మటుమాయమై పోతాయనే భ్రమ నాకేమీ లేదు. అయితే కుల వ్యవస్థ అంతానికి దోహదంచేసే ప్రోత్సాహకరమైన, ప్రగతిశీల ధోరణులు మన సమాజంలో విస్తృతమవుతున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, టెలివిజన్, సినిమా, స్వేచ్ఛా విపణి, కమ్యూనికేషన్స్, వలసలు, ప్రయాణాలు కుల పక్షపాతాలను విరిచేస్తున్నాయి. మరి భారతీయతను కులంతో సమం చేయడమంటే ఇన్ని దశాబ్దాలుగా మనం సాధించిన పురోగతిని వెనక్కు మరల్చడమే అవుతుంది. కాలాన్ని వెనక్కి తిప్పగలమా?


ప్రతి భారతీయునిలో భారతీయతగా అభివర్ణించదగ్గ లక్షణం ఒకటి ఉందనేది స్పష్టం. అదేమిటో నేను నిర్వచించబోను; వర్ణించడానికి ప్రయత్నించను కూడా. అయితే భారతీయుడుగా ఉండడమనేది, భారతదేశానికి చెందినవాడుగా ఉండడమనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. భారతీయతను పౌరసత్వంతో సమంగా చేసి తీరాలని నేను దృఢంగా అభిప్రాయపడుతున్నాను. ఒక రాజ్యాంగం నిర్దేశాల ప్రకారం నడిచే రిపబ్లిక్ (గణతంత్ర రాజ్యం) భావనకు అది అనుగుణంగా ఉంటుంది. భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో పరిపూర్ణ విశ్వాసమున్న, ఆ సంవిధాన మౌలిక సూత్రాలకు విధేయత చూపే ప్రతి పౌరుడూ భారతీయుడే.


కుల విధేయతల నుంచి భారతీయులను మనం దూరం చేసి తీరాలి. విశ్వజనీన విలువలు అయిన స్వేచ్ఛ, ఉదారవాదం, సమానత్వం, సహనం, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని ఔదలదాల్చే విధంగా వారికి శిక్షణ ఇవ్వాలి. ఒక జాతిని నిర్మించడానికి, ఉమ్మడి విలువలను పెంపొందించేందుకు, హక్కులు కాపాడుకునేందుకు, బాధ్యతలు నిర్వర్తించేందుకు, శాంతి సౌభాగ్యాలనుసాధించేందుకు ‘పౌరసత్వమే’ నిజమైన పునాది. అదే రిపబ్లిక్ భావన సార్థకత కూడా.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-04-30T06:39:08+05:30 IST