కెనడా వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఆపసోపాలు

ABN , First Publish Date - 2021-08-21T21:48:01+05:30 IST

భారత విమానాలపై కెనడా ఆంక్షలు విధించడంతో ఆ దేశానికి ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారతీయ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నేరుగా భారత విమానాలకు కెనడాలో ప్రవేశం లేకపోవడంతో కనెక్టింగ్ విమానాల ద్వారా మూడు-నాలుగు దేశాల గుండా ప్రయాణించి కెనడా చేరుకుంటున్నారు. దీంతో ఖర్చులు భారీగా పెరగడంతో పాటు జర్నీ సమయం..

కెనడా వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఆపసోపాలు

న్యూఢిల్లీ: భారత విమానాలపై కెనడా ఆంక్షలు విధించడంతో ఆ దేశానికి ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారతీయ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నేరుగా భారత విమానాలకు కెనడాలో ప్రవేశం లేకపోవడంతో కనెక్టింగ్ విమానాల ద్వారా మూడు-నాలుగు దేశాల గుండా ప్రయాణించి కెనడా చేరుకుంటున్నారు. దీంతో ఖర్చులు భారీగా పెరగడంతో పాటు జర్నీ సమయం కూడా గంటల నుంచి రోజులకు పెరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు కెనడా వెళ్లే భారత ప్రయాణికులకు మరో సవాల్‌గా మారుతోంది. కెనడా ఆంక్షలు విధించని దేశంలో ఈ కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పరీక్ష చేయించుకున్న తర్వాత ఫలితం రావడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతోంది. ఇది విద్యార్థులకు మరింత భారంగా మారుతోంది. ఇక సెకండ్ వేవ్ సమయంలో ఇండియాపై కెనడా విధించిన నిషేధాన్ని సెప్టెంబర్ 21 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. దాంతో కెనడాకు వెళ్లాలనుకునేవారికి మరో నెల రోజుల వరకు ఈ సుదీర్ఘ ప్రయాణం చేయక తప్పదనే చెప్పాలి. 


ఇదే కోవలో ఇటీవల భారత్‌కు చెందిన లెరీనా కుమార్ అనే విద్యార్థిని కెనడా వెళ్లేందుకు చేసిన సుదీర్ఘ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కెనడాలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న ఆమె అక్కడకు వెళ్లడానికి విమానం ఎక్కింది. ఆమె నేరుగా కెనడాకు వెళ్లి ఉంటే కేవలం 22 గంటల్లో అక్కడికి చేరుకునేది. అందుకు కేవలం లక్షన్నర లోపే ఖర్చు అయ్యేది. కానీ నేరుగా వెళ్లే విమానం లేకపోవడంతో మొదట ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లింది. అక్కడ బార్సిలోనా విమానం కోసం 9 గంటలు వేచి చూసింది. ఆ తర్వాత మెక్సికో విమానం కోసం మరో 2 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. అనంతరం మెక్సికోలో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు చేయించుకుని ఫలితం కోసం రెండు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత వాంకోవర్‌కు, అక్కడి నుంచి కెనడాకు చేరుకుంది. దీనికి ఆమెకు అయిన వ్యయం రూ.5 లక్షలకు పైమాటే. కెనడా కరోనా ఆంక్షల కారణంగా ఇలా లెరీనా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అటు 22 గంటల్లో ముగియాల్సిన ప్రయాణానికి దాదాపు వారం రోజులు పట్టింది. అటు ప్రయాణ వ్యయం పెరగడంతో పాటు సమయం కూడా భారీగా పెరిగింది. 


ఈ సందర్భంగా లెరీనా తల్లి లవ్లీ మాట్లాడుతూ.. ఇది ఒక్క లెరీనా సమస్యే కాదని, కెనడాలో చదువుతున్న లక్షల మంది భారతీయ విద్యార్థులదని అన్నారు. కరోనా నిబంధనల కారణంగా వారికి ప్రయాణంలో ఆపసోపాలు ఎదురవుతున్నాయని ఆమె వాపోయారు. ఇక ఈ సమస్య పరిష్కారం దిశగా భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కెనడా వెళ్లే భారత విద్యార్థులు కోరుతున్నారు. ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడి.. ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టును కెనడా ఆమోదించిన దేశాల్లోని విమానాశ్రయాల్లో నిర్వహించేలా ఏర్పాటు చేస్తే బావుంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రోజువారీ కేసుల్లో లక్ష దాటుతున్న అగ్రరాజ్యం అమెరికాకు కెనడా నేరుగా ప్రవేశానికి అనుమతి ఇస్తోందని, అదే భారత్ విషయంలో ఎందుకు ఇలా వ్యవహారిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. 


Updated Date - 2021-08-21T21:48:01+05:30 IST