భారత టీకాలు ప్రపంచాన్ని కాపాడాయి: ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త కామెంట్

ABN , First Publish Date - 2021-03-08T01:16:55+05:30 IST

భారత్ చేపట్టిన కరోనా టీకా ఎగుమతులు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడాయని అమెరికాలోని ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు.

భారత టీకాలు ప్రపంచాన్ని కాపాడాయి: ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త కామెంట్

హ్యూస్టన్: భారత్ చేపట్టిన కరోనా టీకా ఎగుమతులు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడాయని అమెరికాలోని ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ చేసిన సహాయాన్ని అసలేమాత్రం తక్కువగా అంచనా వేయద్దని ఆయన పేర్కొన్నారు. హ్యూస్టన్‌లోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లోని నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డీన్ డా. పీటర్ హొటెజ్ ఓ వెబినార్‌ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ అంతర్జాతీయ సంస్థల సహాయంతో భారత్ కరోనా టీకాను అభివృద్ధి చేసి వివిధ దేశాలకు ఎగుమతులు చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతులే కరోనా టీకాలు అని కూడా ఆయన భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.  మోడర్నా, ఫైజర్ రూపొందించిన ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ టీకాల వల్ల అల్ప, మధ్యాదాయ దేశాలకు పెద్దగా ఉపయోగం లేదని తెలిపారు. కానీ..భారత  చేపడుతున్న టీకా ఎగుమతులు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడాయని ఆయన పేర్కొన్నారు. కరోనాతో జరుగుతున్న పోరాటంలో భారత్ చేస్తున్న కృషికి తగిన గుర్తింపు రాని కారణంతోనే ఈ విషయాన్ని తాను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ భాగస్వామ్యంతో రూపొందించిన  భారత్ కోవీషీల్డ్ టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అల్పాదాయ దేశాలకు టీకాలు అందజేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన కొవ్యాక్స్ వ్యవస్థలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. టీకా పంపిణీ-సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందీ అనే అంశంపై ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హ్యూస్టన్ ఇటీవల ఏర్పాటు చేసిన వెబినార్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్ ఇప్పటివరకూ విదేశీ గ్రాంట్స్ కింద పొరుగు దేశాలకు 56 లక్షల కరోనా టీకా డోసులను సరఫరా చేసింది. 

Updated Date - 2021-03-08T01:16:55+05:30 IST