భారత్‌ విజయం..లాంఛనం!

Dec 6 2021 @ 02:10AM

  • న్యూజిలాండ్‌ లక్ష్యం 540: ప్రస్తుతం 140/5 
  • అశ్విన్‌కు 3 వికెట్లు 
  • కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌ 276/7 డిక్లేర్డ్‌ 
  • మయాంక్‌ అర్ధ శతకం 
  • అక్షర్‌ మెరుపు బ్యాటింగ్‌

తొలి టెస్ట్‌లో చేజారిన విజయాన్ని భారత్‌ రెండో టెస్ట్‌లో అందుకోనుంది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌కు నిర్దేశించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆజట్టు ఐదు వికెట్లు పడగొట్టింది. స్పిన్‌కు అద్భుతంగా సహకరిస్తున్న వాంఖడే వికెట్‌పై అశ్విన్‌ ఇప్పటికే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థికి ప్రమాదకరంగా మారాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను కాపాడు కోవడం పర్యాటక జట్టుకు దాదాపు అసాధ్యమే. అంతకుముందు టాపార్డర్‌ బ్యాటర్లతోపాటు చివర్లో అక్షర్‌ పటేల్‌ మెరుపులతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 270కిపైగా పరుగులు చేసింది.


ముంబై: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో కోహ్లీసేన విజయం లాంఛనమే. మరో ఐదు ప్రత్యర్థి వికెట్లను పడగొడితే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీ్‌సను భారత్‌ చేజిక్కించుకుంటుంది. భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆదివారం ఆట ఆఖరికి 140 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకొని ఓటమి దిశగా పయనిస్తోంది. డారిల్‌ మిచెల్‌ (60) అర్ధ శతకం చేయగా..పలుమార్లు అవుటయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్న హెన్రీ నికోల్స్‌ (36 బ్యాటింగ్‌)తోపాటు రచిన్‌ రవీంద్ర (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అశ్విన్‌ (3/27) మూడు వికెట్లు, అక్షర్‌ పటేల్‌ (1/42) ఒక వికెట్‌ తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ 69/0తో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 276/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మయాంక్‌ అగర్వాల్‌ (62)ఆ ఊపును కొనసాగించి అర్ధ శతకం సాధించాడు. పుజార (47) గాడిలో పడగా, గిల్‌ (47), కోహ్లీ (36) చెరో చేయి వేశారు. చివర్లో అక్షర్‌ (26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎజాజ్‌ పటేల్‌ (4/106) నాలుగు, రచిన్‌ రవీంద్ర (3/56) మూడు వికెట్లు పడగొట్టారు.


మిచెల్‌, నికోల్స్‌ ప్రతిఘటన: మొదటి టెస్ట్‌ మాదిరి ఈ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌ ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకొనే అవకాశాలు లేశమాత్రంగానైనా కన్పించడంలేదు. అసలే భారీ లక్ష్యం..పైగా గింగరాలు తిరుగుతూ స్పిన్‌ అవుతున్న బంతులు..మూడు వికెట్లు తీసి గుబులుపుట్టిస్తున్న అశ్విన్‌..ఇంకా 400 పరుగుల వెనుకంజ..ఈ పరిస్థితుల్లో కివీస్‌ పరాజయం ఖాయం. కాకపోతే ఓటమి అంతరాన్ని ఆ జట్టు ఎంతవరకు తగ్గించగలదనేదే ప్రశ్న. ఛేదనలో నాలుగో ఓవర్లోనే కెప్టెన్‌ లాథమ్‌ (6)ను అశ్విన్‌ ఎల్బీగా అవుట్‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. దీనిపై లాథమ్‌ సమీక్షకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆపై యంగ్‌ (20).. అశ్విన్‌ బౌలింగ్‌లో షార్ట్‌లెగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చినా.. అంపైర్‌ అవుటివ్వలేదు. దాంతో కెప్టెన్‌ కోహ్లీ రివ్యూకు వెళ్లగా.. యంగ్‌ క్యాచ్‌ అవుటైనట్టు తేలింది. అశ్విన్‌ ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా వేసిన బంతిని స్వీప్‌ చేయబోయిన రాస్‌ టేలర్‌ (6).. పుజార పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకున్న క్యాచ్‌తో నిష్క్రమించాడు. మరోవైపు అశ్విన్‌, అక్షర్‌, జయంత్‌ బౌలింగ్‌లో క్రీజు బైటకు వచ్చి షాట్లు కొడుతూ మిచెల్‌ ఒత్తిడి పెంచాడు. ఈక్రమంలో ఉమేశ్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో అర్ధ శతకం పూర్తి చేసిన మిచెల్‌.. నికోల్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. అయితే అక్షర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టే యత్నంలో బౌండరీ వద్ద జయంత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ పెవిలియన్‌ చేరాడు. లేని రన్‌కోసం ప్రయత్నించి బ్లండెల్‌ (0) రనౌటయ్యాడు. దాంతో ఐదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌ తీవ్ర ఇక్కట్లలో పడింది. 


అంతా ఆడారు: భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వచ్చిన బ్యాటర్లంతా చక్కగా ఆడారు. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బ్యాటర్లు ఎక్కువ సమయం క్రీజులో గడపాలనే ఉద్దేశంతో కెప్టెన్‌ కోహ్లీ ప్రత్యర్థికి ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ చేపట్టాడు. దాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాటర్లంతా పరుగులు రాబట్టారు. మొదటి ఇన్నింగ్స్‌ ఫామ్‌ను కొనసాగించిన మయాంక్‌ అర్ధ శతకం చేయగా.. మూడు చెత్త ఇన్నింగ్స్‌ల తర్వాత పుజార గాడిలో పడ్డాడు. భారీ షాట్లతో అతడు అలరించాడు. అగర్వాల్‌, పుజార తొలి వికెట్‌కు 107 రన్స్‌ జోడించారు. కోహ్లీ బాగానే బ్యాటింగ్‌ చేసినా అతడిలో ఆత్మవిశ్వాసం కన్పించలేదు. అయ్యర్‌ (14), గిల్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడు ప్రదర్శించారు. 


అక్షర్‌ దూకుడు: తొలి ఇన్నింగ్స్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న అక్షర్‌ ఈసారి మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. వస్తూనే రచిన్‌ బౌలింగ్‌లో 4,6,6 బాదిన అక్షర్‌.. అతడి మరో ఓవర్లో 6,4తో కదం తొక్కాడు. ఎజాజ్‌ పటేల్‌ను కూడా వదలకుండా 4,6 బాదాడు. పటేల్‌  బౌలింగ్‌లో జయంత్‌ అవుటయ్యాక ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ కోహ్లీ డిక్లేర్‌ చేశాడు.


హ్యాడ్లీ సరసన అశ్విన్‌

ఈ ఏడాది టెస్ట్‌ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌ అశ్విన్‌

కివీస్‌ దిగ్గజ పేసర్‌ సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ రికార్డును స్పిన్నర్‌ అశ్విన్‌ సమం చేశాడు. భారత్‌-న్యూజిలాండ్‌ ద్వైపాక్షిక సిరీస్‌లలో హ్యాడ్లీ 65 వికెట్లు పడగొట్టగా అశ్విన్‌ ఆ రికార్డును చేరుకున్నాడు. హ్యాడ్లీ 24 ఇన్నింగ్స్‌లో ఆ రికార్డు నెలకొల్పగా.. అశ్విన్‌ 17 ఇన్నింగ్స్‌లో ఆ ఘనత సాధించాడు.  స్కోరుబోర్డు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 325

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 62


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) యంగ్‌ (బి) ఎజాజ్‌ 62, పుజార (సి) టేలర్‌ (బి) ఎజాజ్‌ 47, శుభ్‌మన్‌ గిల్‌ (సి) లాథమ్‌ (బి) రచిన్‌ 47, విరాట్‌ కోహ్లీ (బి) రచిన్‌ 36, శ్రేయాస్‌ అయ్యర్‌ (స్టంప్డ్‌) బ్లండెల్‌ (బి) ఎజాజ్‌ 14, సాహా (సి) జేమిసన్‌ (బి) రచిన్‌ 13, అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 41, జయంత్‌ యాదవ్‌ (సి అండ్‌ బి) ఎజాజ్‌ 6, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 70 ఓవర్లలో 276/7 డిక్లేర్డ్‌; వికెట్లపతనం: 1/107, 2/115, 3/197, 4/211, 5/217, 6/238, 7/276; బౌలింగ్‌: సౌథీ 13-2-31-0, ఎజాజ్‌ పటేల్‌ 26-3-106-4, జేమిసన్‌ 8-2-15-0, సోమర్‌విల్లే 10-0-59-0, రచిన్‌ 13-2-56-3.


న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 6, యంగ్‌ (సి) సబ్‌ ఎస్‌ఏ యాదవ్‌ (బి) అశ్విన్‌ 20, మిచెల్‌ (సి) జయంత్‌ (బి) అక్షర్‌ 60, రాస్‌ టేలర్‌ (సి) పుజార (బి) అశ్విన్‌ 6, నికోల్స్‌ (బ్యాటింగ్‌) 36, బ్లండెల్‌ (రనౌట్‌) 0, రచిన్‌ (బ్యాటింగ్‌) 2, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 45 ఓవర్లలో 140/5; వికెట్లపతనం: 1/13, 2/45, 3/55, 4/128, 5/129; బౌలింగ్‌: సిరాజ్‌ 5-2-13-0, అశ్విన్‌ 17-7-27-3, అక్షర్‌ పటేల్‌ 10-2-42-1, జయంత్‌ యాదవ్‌ 8-2-30-0, ఉమేశ్‌ యాదవ్‌ 5-1-19-0. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.