నౌకా నిర్మాణంలో ప్రపంచ స్థాయికి దేశీయ కంపెనీలు : రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-08-28T19:16:12+05:30 IST

నౌకా నిర్మాణ రంగానికి ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు

నౌకా నిర్మాణంలో ప్రపంచ స్థాయికి దేశీయ కంపెనీలు : రాజ్‌నాథ్

చెన్నై : నౌకా నిర్మాణ రంగానికి ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు మన దేశానికి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశీయ పారిశ్రామిక రంగం ప్రపంచ స్థాయికి చేరేందుకు దోహదపడే విధానాలను కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసిందన్నారు. దేశీయంగా తయారైన ఇండియన్ కోస్ట్‌ గార్డ్ నౌక ‘విగ్రహ’ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. 


భద్రత కోసం రానున్న రెండేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా చేసే ఖర్చు 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అధ్యయనాలు చెప్తున్నాయన్నారు. చాలా దేశాల వార్షిక బడ్జెట్ సైతం ఈ స్థాయిలో ఉండదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేడు మన సామర్థ్యాలను పరిపూర్ణంగా ఉపయోగించుకుని, ప్రభుత్వ విధానాల ప్రయోజనాన్ని పొందుతూ, దేశీయ నౌకా నిర్మాణ ప్రధాన కేంద్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దేందుకు గొప్ప అవకాశం ఉందని చెప్పారు. మన దేశంలోని పరిశ్రమలు ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు తగిన విధానాలను ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చిందని చెప్పారు. మన దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలు ఈ విధానాల వల్ల ప్రయోజనం పొందవచ్చునని చెప్పారు. 


75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ జాతీయ హీరోలు, పూర్వీకులు, మహనీయులు కన్న కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసిన ఏఎల్‌హెచ్‌ (అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్)ను కూడా ఈ నౌకపై ఉపయోగించవచ్చునని తెలిపారు. ప్రభుత్వం, కోస్ట్ గార్డ్, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసికట్టుగా మన దేశ సమగ్రత, సార్వభౌమాధికారాలను ఏ విధంగా కాపాడగలవో చెప్పడానికి ఉదాహరణ ఇది అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ, కోస్ట్ గార్డ్, ఎల్ అండ్ టీ మధ్య సత్సంబంధాల ప్రయాణం ‘విక్రమ్’తో ప్రారంభమైందని, అనంతరం ‘విజయ్’, ‘వీర్’, ‘వరాహ’, ‘వరద్’, ‘వజ్ర’ ద్వారా ‘విగ్రహ’కు చేరిందని చెప్పారు. 


‘విగ్రహ’ అనే పదానికి మన గ్రంథాల్లో సొగసైన అర్థాలు ఉన్నాయని తెలిపారు. ‘బంధాల నుంచి విముక్తి’ అని ఒక అర్థం ఉందన్నారు. ‘ఒకరి కర్తవ్యం, బాధ్యతలకు కట్టుబడి ఉండటం’ అనే అర్థం కూడా ఉందన్నారు. మన ఈ ‘విగ్రహ’ పూర్తిగా అన్ని రకాల సవాళ్ళ సంకెళ్ళ నుంచి స్వేచ్ఛగా ఉంటుందని, దేశం పట్ల సేవ, కర్తవ్యాల ప్రత్యేక బంధాలను కలిగి ఉంటుందని తన దృఢ విశ్వాసమని తెలిపారు. 


Updated Date - 2021-08-28T19:16:12+05:30 IST