దివ్యాంగ బాలుడిని అడ్డుకున్న IndiGoకు రూ. 5 లక్షల జరిమానా

ABN , First Publish Date - 2022-05-28T21:39:20+05:30 IST

రాంచీ విమానాశ్రయంలో దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కేందుకు అనుమతించకుండా అడ్డుకున్న ఇండిగో

దివ్యాంగ బాలుడిని అడ్డుకున్న IndiGoకు రూ. 5 లక్షల జరిమానా

న్యూఢిల్లీ: రాంచీ విమానాశ్రయంలో దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కేందుకు అనుమతించకుండా అడ్డుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ (IndiGo Airlines)పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు తీసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీసీఐ బాలుడి పట్ల విమానయాన సంస్థ గ్రౌండ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించినట్టు నిర్ధారించి రూ. 5 లక్షల జరిమానా విధించింది. 


బాలుడిపై మరింత దయతో ప్రవర్తించి ఉంటే బోర్డింగ్ నిరాకరణకు దారితీసే పరిస్థితి ఏర్పడేది కాదని డీజీసీఏ పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల్లో మరింత అసాధారణంగా స్పందించాల్సిన ఎయిర్‌లైన్ సిబ్బంది సందర్భానికి అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని ఎండగట్టింది. కాబట్టి విమానయాన సంస్థపై రూ. 5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు సవరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 


హైదరాబాద్ వెళ్లేందుకు కుమారుడితో కలిసి రాంచీ విమానాశ్రయానికి కుటుంబాన్ని ఇండిగో విమాన సిబ్బంది అడ్డుకున్నారు.  బాలుడు భయపడుతున్నాడని, అతడి వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి బోర్డింగ్‌కు అనుమతించబోమని తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు వారితో వాగ్వివాదానికి దిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మనీషా గుప్తా అనే ప్రయాణికురాలు ఈ ఘటనను వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఇండిగో తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 


దీంతో దిగివచ్చిన విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పడమే కాకుండా బాలుడికి ఎలక్ట్రిక్ వీల్‌చైర్ కొని ఇస్తామని ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్తా ప్రకటించారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. మరోవైపు, ఈ ఘటనపై విచారణ జరిపిన డీజీసీఏ ఇండిగోను దోషిగా తేల్చింది. తాజాగా ఆ సంస్థకు రూ. 5 లక్షల జరిమానా విధించింది.

Updated Date - 2022-05-28T21:39:20+05:30 IST