(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘ఆపరేషన్ రాయలసీమ’లో భాగంగా విజయవాడ నుంచి కడపకు ప్రాంతీయ విమాన సర్వీసు ఆదివారం ప్రారంభమైంది. దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ఈ సర్వీసును ప్రారంభించింది. వారంలో నాలుగు రోజుల పాటు విజయవాడ-కడప మధ్య రాకపోకలు సాగించనున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీడీ ఇన్చార్జి రామారావు ఆదివారం ఈ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. కేక్ కట్ చేసి ప్రయణికులకు పంచారు. కడపకు గతంలో ట్రూజెట్ సంస్థ విమాన సర్వీసును నడిపింది. తర్వాత రద్దు చేసుకుంది. కొవిడ్ రిలీఫ్ నేపథ్యంలో, ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీసును నడపటానికి ముందుకొచ్చింది. వారంలో ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటలకు విమాన సర్వీసు నడుస్తుంది. ‘ఆపరేషన్ రాయలసీమ’లో భాగంగా ఇప్పటికే తిరుపతికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసు నడుపుతుండగా, కర్నూలుకు కూడా నడపటానికి సన్నాహాలు చేస్తున్నారు.