IndiGo: ఇండిగో టికెట్ కౌంటర్‌కు ప్రయాణికుడి కాల్.. మరుక్షణంలోనే అలజడి.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ..

ABN , First Publish Date - 2022-09-10T01:00:16+05:30 IST

ఓ విమానయాన సంస్థ సిబ్బంది చేసిన పనికి ఎయిర్‌పోర్టులో కాసేపు గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయాందోళనలతో

IndiGo: ఇండిగో టికెట్ కౌంటర్‌కు ప్రయాణికుడి కాల్.. మరుక్షణంలోనే అలజడి.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ..

భోపాల్: ఓ విమానయాన సంస్థ సిబ్బంది చేసిన పనికి ఎయిర్‌పోర్టులో కాసేపు గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ షాకయ్యారు. భోపాల్‌లోని రాజా భోజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 


గురువారం ఉదయం ఇండిగో టికెటింగ్ కౌంటర్‌లో ఉన్న సిబ్బందికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆగ్రా విమానం 6E-7931లో అదనంగా ఎంత బరువు (Ballast) తీసుకెళ్లొచ్చంటూ ఆరా తీశాడు. అయితే, అతడు చెప్పిన ‘బ్యాలెస్ట్’ను ఆమె ‘బ్లాస్ట్’ (Blast)గా అర్థం చేసుకుంది. వెంటనే ఇండిగో సిబ్బంది బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BATC)కి సమాచారం అందించింది. ఆ వెంటనే విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సెక్యూరిటీ సిస్టంను యాక్టివేట్ చేశారు. దురదృష్టవశాత్తు అదే సమయంలో ఓ వాహనం వేగంగా టైర్ కిల్లర్స్‌ను దాటుతోందని, అప్పుడే టైర్ కిల్లర్స్ ఎమర్జెన్సీ స్విచ్ యాక్టివేట్ వాహనం అందులో చిక్కుకుని ఆగిపోయిందని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అమ్రిత్ మింజ్ తెలిపారు.

 

ఆ తర్వాత విచారణలో జరిగింది తెలుసుకుని ఇండిగో అధికారులు నాలుక్కరుచుకున్నారు. పదాన్ని తమ సిబ్బంది తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని విచారం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టు మేనేజ్‌మెంట్ కూడా ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. నిజానికి బ్యాలెస్ట్ అనే దానికి ‘అదనపు బరువు’ అని అర్థం. ఎయిర్‌లైన్స్‌లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. విమానంలో సరిపడా ప్రయాణికులు లేనప్పుడు గాల్లో విమానాన్ని బ్యాలెన్స్ చేసేందుకు అదనపు బరువును జోడిస్తారు. మహిళా సిబ్బంది కొత్తగా చేరిందని, ఆమెకు బ్యాలస్ట్‌కు, బ్లాస్ట్ మధ్య తేడాను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడిందని ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. గురుగావ్ నుంచి ఆ కాల్ వచ్చినట్టు పేర్కొన్నారు.   

Updated Date - 2022-09-10T01:00:16+05:30 IST