న్యాయస్థానంలో పద్మవ్యూహం

ABN , First Publish Date - 2021-12-18T04:37:41+05:30 IST

జిల్లా కోర్టు ప్రాంగణాన్ని చూస్తే వాహనాల పద్మవ్యూహంలా కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టుతో పాటు సెషన్స్‌ కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి, మేజిస్ట్రేట్‌ కోర్టులు.. ఇలా 18 ఉన్నాయి. ఆయా న్యాయస్థానాలకు న్యాయమూర్తులు, న్యాయవాదు లు, గుమస్తాలు, కోర్టు సిబ్బంది, పోలీసులు, కక్షిదారులు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. అయితే వాహనాల రాకపోకలకు నియంత్రణ పాటించకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

న్యాయస్థానంలో పద్మవ్యూహం
న్యాయస్థానం ప్రాంగణంలో అడ్డదిడ్డంగా వాహనాలు

కోర్టు ప్రాంగణంలో అడ్డదిడ్డంగా వాహనాలు

రాకపోకలకు తీవ్ర అసౌకర్యం


 నెల్లూరు (లీగల్‌), డిసెంబరు 17 : జిల్లా కోర్టు ప్రాంగణాన్ని చూస్తే వాహనాల పద్మవ్యూహంలా కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టుతో పాటు సెషన్స్‌ కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి, మేజిస్ట్రేట్‌ కోర్టులు.. ఇలా 18 ఉన్నాయి. ఆయా న్యాయస్థానాలకు న్యాయమూర్తులు, న్యాయవాదు లు, గుమస్తాలు, కోర్టు సిబ్బంది, పోలీసులు, కక్షిదారులు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. అయితే వాహనాల రాకపోకలకు నియంత్రణ పాటించకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ, అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపి వేస్తుండటంతో పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారింది. వాహనాల నియంత్రణకు సెక్యూరిటీ కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ వారు సమర్ధంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రాంగణంలో 2015లో టిఫిన్‌ బాక్స్‌ బాంబు పేలిన నేపథ్యంలో కోర్టుకు వచ్చే వారిని తనిఖీ చేసేందుకు మెయిన్‌ గేటు సమీపంలో మెటల్‌ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు ఏ రోజు కూడా దానిని వినియోగించిన దాఖలాలు లేవు. 


సెటిల్‌మెంట్లకు అడ్డా...

జిల్లా కోర్టు ప్రాంగణాన్ని కొందరు సెటిల్‌మెంట్లకు, పంచాయితీలకు అడ్డాగా మార్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చక్కబెట్టుకుని తాపీగా వెళుతున్నారు. ఇలాంటి వారి వాహనాలు కూడా కోర్టు ప్రాంగణంలోనే ఉంటున్నాయి. అంతేకాదు కోర్టుకు చుట్టుపక్కల ఉండే షాపులు, షాపింగ్‌ కాంప్లెక్సులకు వచ్చే వారు సైతం పార్కింగ్‌ కోసం కోర్టు ప్రాంగణాన్నే వాడుకుంటున్నారు. ఈ విధంగా అన్ని రకాల వ్యక్తుల వాహనాలు చేరి న్యాయస్థానం ప్రాంగణాన్ని పద్మవ్యూహంగా మార్చేస్తున్నాయి. ఉన్నతాధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవతో న్యాయస్థానాల సమూహానికి పటిష్ట భద్రత, వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు, కక్షిదారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-18T04:37:41+05:30 IST