మంచు తుపానుకు భారతీయ కుటుంబం బలి!

ABN , First Publish Date - 2022-01-22T07:45:49+05:30 IST

రక్తం గడ్డకట్టుకు పోయేంతటి చలి. మైనస్‌ 36 డిగ్రీల ఉష్ణోగ్రత, కనుచూపు మేరలో అంతా మంచు మేటలే. దీనికి తోడు తీవ్రమైన మంచు తుపాను. ఆపై చిమ్మచీకటి. ఇంతటి భయానక వాతావరణంలో....

మంచు తుపానుకు భారతీయ కుటుంబం బలి!

అమెరికా-కెనడా సరిహద్దులో విషాదం

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో..

చిన్నారి, టీనేజర్‌ సహా నలుగురి దుర్మరణం

సరిహద్దుకు 40 అడుగుల దూరంలో మృతదేహాలు

మానవ అక్రమ రవాణా అనుమానంతో ఒకరి అరెస్టు


న్యూయార్క్‌, జనవరి 21: రక్తం గడ్డకట్టుకు పోయేంతటి చలి. మైనస్‌ 36 డిగ్రీల ఉష్ణోగ్రత, కనుచూపు మేరలో అంతా మంచు మేటలే. దీనికి తోడు తీవ్రమైన మంచు తుపాను. ఆపై చిమ్మచీకటి. ఇంతటి భయానక వాతావరణంలో.. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం యత్నించింది. వారిలో ఓ చంటి బిడ్డ, టీనేజర్‌ కూడా ఉన్నారు. ఎంతగా ప్రయత్నించినా అడుగు ముందుకు పడక.. మంచు తుపానులో చిక్కుకుపోయి.. అత్యంత దయనీయమైన స్థితిలో దుర్మరణం పాలయ్యారు. అమెరికా, కెనడా బోర్డర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌ ఎమర్సన్‌ బోర్డర్‌ వద్ద అర్ధరాత్రి వేళ అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో.. తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ఆ నలుగురు మరణించారు. వీరిలో ఇద్దర్ని భార్యాభర్తలుగా.. ఓ చిన్నారి, టీనేజర్‌ను వారి పిల్లలుగా భావిస్తున్నారు. వారంతా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తూ.. తీవ్రమైన మంచు తుఫానులో చిక్కుకుని మరణించి ఉంటారని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ మృతదేహాలు బోర్డర్‌కు 40 అడుగుల దూరంలో మంచులో కూరుకుపోయి ఉన్న స్థితిలో దొరికాయి. అంతకుముందు అమెరికా వైపున బోర్డర్‌ వద్ద ఓ వ్యాన్‌లో ఇద్దరు భారతీయులతో వస్తున్న స్టీవ్‌ శాండ్‌(47) అనే వ్యక్తిని యూఎస్‌ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యాన్‌లో భారీ మొత్తంలో స్నాక్స్‌, డిస్పోజబుల్‌ పేట్లు, కప్పులను గుర్తించిన అమెరికా దళాలు.. మరింత మంది బోర్డర్‌ దాటబోతున్నారని అనుమానించి కెనడా బోర్డర్‌ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టిన కెనడా సిబ్బందికి.. మంచులో కూరుకుపోయిన మృతదేహాలు లభ్యమయ్యాయి. బోర్డర్‌ వద్ద గాలింపు చర్యల్లో 15 మంది భారతీయులను గుర్తించి ప్రశ్నించగా.. మరణించిన నలుగురూ వీళ్ల సమూహం నుంచి విడిపోయిన వాళ్లేనని తేలింది. ఎలాంటి పత్రాలూ లేకుండా అక్రమంగా అమెరికాలోకి తీసుకెళతానంటూ ఓ వ్యక్తి తమతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, బోర్డర్‌ దాటేందుకు ఈ మార్గాన్ని సూచించి.. దాటాక తమను పికప్‌ చేసుకుంటానని చెప్పాడని వాళ్లు కెనడా బోర్డర్‌ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. ఈ కేసులో స్టీవ్‌ శాండ్‌ ప్రమేయాన్ని ప్రాథమికంగా గుర్తించిన అమెరికా దళాలు మానవ అక్రమ రవాణా కింద అతడిపై కేసు నమోదు చేశాయి. 

Updated Date - 2022-01-22T07:45:49+05:30 IST