భక్తసిరి

ABN , First Publish Date - 2020-10-24T10:14:04+05:30 IST

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు.

భక్తసిరి

 మహాలక్ష్మీదేవి దర్శనానికి పోటెత్తిన భక్తులు

 శుక్రవారం కూడా కావడంతో ఇంద్రకీలాద్రి కిటకిట

 50వేల మంది వరకు వచ్చి ఉంటారని అంచనా

 అన్నవరం ఆలయం నుంచి పట్టువస్త్రాల సమర్పణ 

 దుర్గమ్మ సేవలో చినజీయర్‌స్వామి, శివస్వామి


ఢమ ఢమ ఢమరుక శబ్దాలు.. భేరీనాదాలు.. జై భవానీ నినాదాలు.. ఆనంద తాండవాలు.. భక్తజన సంద్రాలు.. ఉదయమంతా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వైభవం ఇదంతా. నందీశ్వరుడు ముందుండి నడవగా.. ప్రమదగణాలు పాంచజన్యాలు పూరించగా.. కేరళ నాద స్వరాలు మార్మోగగా.. సాయంకాలం గంగా సమేత దుర్గామల్లేశ్వరుల పల్లకీ మహోత్సవ వైభోగం ఇదంతా. ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో తెలుగునాట భక్తిభావమంతా బెజవాడ వ్యాపితమైందా అనిపిస్తోంది. అమ్మకు ప్రీతిపాత్రమైన శుక్రవారం, పైగా శ్రీమహాలక్ష్మీ అలంకారం కావడంతో వేడుకలు అంబరాన్నంటాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీరూపంలో కొలువుదీరిన అమ్మ దివ్యమంగళ రూపాన్ని తిలకించి తరించేందుకు లెక్కకుమించి భక్తులు తరలివచ్చారు. 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. జగన్మాతకు ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్‌ చేసుకున్న 10వేల మంది భక్తులతో పాటు అంతకు రెండింతల మంది టికెట్‌లు తీసుకుని అమ్మవారి దర్శనానికి వచ్చారు. సుమారు 50వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అంచనా. అయితే, క్యూలైన్లలో భౌతికదూరం కనిపించలేదు. సాయంత్రం 6.30 గంటలకు వేదపండితులు అమ్మవారికి మహానివేదన సమర్పించి, పంచహారతులు, చతుర్వేద స్వస్తి నిర్వహించారు.


అనంతరం గంగా సమేత దుర్గామల్లేశ్వరుల పల్లకీ ఉత్సవం కనులపండువగా జరిగింది.అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం తరఫున కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథ్‌, ట్రస్ట్‌బోర్డు సభ్యులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పట్టు పీతాంబరాలు, పసుపు, కుంకుమలతో సారె సమర్పించారు. అనంతరం త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి కనకదుర్గమ్మను దర్శించుకుని పట్టువస్త్రాలు అందజేశారు. అంతకుముందు శివస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితర ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు.

Updated Date - 2020-10-24T10:14:04+05:30 IST