అమ్మ సన్నిధిలో ఆందోళనం

ABN , First Publish Date - 2020-08-07T16:50:48+05:30 IST

ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. ఈవో సురేష్‌బాబుకు..

అమ్మ సన్నిధిలో ఆందోళనం

విజయవాడ, ఆంధ్రజ్యోతి: ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. ఈవో సురేష్‌బాబుకు కరోనా సోకడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత శుక్రవారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమవారం నుంచి దేవస్థానంలో విధులకు హాజరుకావట్లేదు. బుధవారం ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌కు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తేలింది. దీంతో ఆయన ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగానే వారం పాటు సెలవు కోసం దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి లిఖితపూర్వకంగా సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే, గురువారమే ఆసుపత్రిలో చేరిన ఈవో నెల వరకు విధులకు హాజరయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అప్పటివరకు దేవస్థానానికి ఇన్‌చార్జి ఈవోను నియమించే అంశాన్ని దేవదాయ శాఖ కమిషనరేట్‌ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 


కరోనాతో వేద పండితుడు మృతి 

ఆలయంలో పనిచేసే వేదపండితుడు ఒకరు కరోనా బారినపడి గురువారం మరణించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఆయన భార్య కూడా ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. గతంలో మరో ఇద్దరు వేదపండితులు వైరస్‌ బారినపడిన సంగతి తెలిసిందే. ఇక ఆలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది 15 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. 


పాలక మండలి సభ్యుల్లో గుబులు 

ఈవో అనారోగ్యానికి గురికావడానికి ముందు గతనెల 30వ తేదీన దేవస్థానం పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈవోతో పాటు పాలకమండలి చైర్మన్‌, మరో 10 మంది సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశం అనంతరం అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ మర్నాడు నుంచే ఈవో అస్వస్థతకు గురికావడం, పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో పాలకమండలి సభ్యులు, దేవస్థానం అధికారులు, సిబ్బందిని కరోనా భయం వెంటాడుతోంది. పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు రెండు రోజుల నుంచి దుర్గగుడి రాకపోవడం ఇంద్రకీలాద్రిపై చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2020-08-07T16:50:48+05:30 IST