కబళిస్తున్న కాలుష్యం!

ABN , First Publish Date - 2022-07-03T04:44:43+05:30 IST

కబళిస్తున్న కాలుష్యం!

కబళిస్తున్న కాలుష్యం!
రసాయనిక పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం

- పైడిభీమవరంలో పరిశ్రమల పైపులైన్లు లీకేజీ

- కాలువలు, పొలాల్లో చేరుతున్న రసాయనిక వ్యర్థాలు

- పదుల సంఖ్యలో గ్రామాలు విలవిల

- విజృంభిస్తున్న కిడ్నీ, మూత్రపిండాల వ్యాధులు

- పట్టించుకోని యాజమాన్యాలు, అధికారులు 


(రణస్థలం)

రణస్థలం మండలంలో పదుల సంఖ్యలో గ్రామాలు కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రధానంగా పైడిభీమవరం పారిశ్రామికవాడలో పరిశ్రమల నుంచి వెదజల్లుతున్న వాయు, జల కాలుష్యంతో ప్రజలు విల్లవిల్లాడుతున్నారు. పైడిభీమవరం, నారువ, సరగడపేట, చిల్లపేట, గొల్లపేట, బోయపాలెంలు, దోనిపేట, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలాల్లో ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుని రోగాల బారిన పడుతున్నారు. ఏటా  కిడ్నీ, మూత్రపిండాల వ్యాధులతో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులు ఎంతో సంతోషించారు. కానీ ఇప్పుడు అవే పరిశ్రమలు కబళిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా పరిశ్రలు ఉన్నాయనే మాట కానీ.. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. పరిశ్రమల ఏర్పాటు సమయంలో ప్రజాభిప్రాయ సేకరణలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని చెబుతున్నారు. కానీ పరిశ్రమలు ఏర్పాటు చేసిన తరువాత ముఖం చాటేస్తున్నారు. దిగువస్థాయిలో ఉండే కలాసీలు, రోజువారి కార్మికులుగా అవకాశమిచ్చి..పైస్థాయి ఉద్యోగాలను విషయంలో మొండి చేయి చూపుతున్నారు. 


ఇదీ పరిస్థితి

రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) జిల్లాలో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసింది. 1985లో పైడిభీమవరంలో 450 ఎకరాల్లో భారీ పారిశ్రామికవాడను ప్రారంభించింది. ఇందులో 275 ఎకరాలను రసాయనిక జోన్‌కు కేటాయించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 13 రసాయన పరిశ్రమలు కొనసాగుతున్నాయి.  సరాక, ల్యాంటెక్‌, అరబిందో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఆంధ్రా ఆర్గానిక్స్‌ వంటి భారీ పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, పైపులైన్ల లీకులతో తాగు,సాగునీటి వనరులు, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చెంతనే ఉన్న కందివలస గెడ్డ సైతం పూర్తిగా కలుషితమవడంతో పశువులు, జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. పంటలు కూడా సరిగ్గా పండడం లేదు.  పర్యావరణానికి తూట్లు పొడిచే విధంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు ప్రతీ రెండు నెలలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశ్రమలను పరిశీలించాలి. నిబంధనలు పక్కాగా అమలుచేస్తున్నారా? లేదా? అని సమీక్షించి నివేదికలు తయారుచేయాలి. కానీ ఇదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. జిల్లాలో ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో 16 ఎకరాలు, పలాసలో 31 ఎకరాలు, ఆమదాలవలసలో 19 ఎకరాలతో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసినా.. పైడిభీమవరం పారిశ్రామికవాడ మాత్రమే శరవేగంగా అభివృద్ధి చెందింది. కానీ ఎక్కువగా రసాయనిక పరిశ్రమలకు అనుమతివ్వడం ఈ ప్రాంతీయులకు శాపంగా మారింది. 


వ్యాధుల పంజా..

పైడిభీమవరం, నారువ, సరగడపేట, చిల్లపేట, గొల్లపేట, బోయపాలెం, దోనిపేట తదితర గ్రామాల్లో వ్యాధులు పంజా విసురుతున్నాయి. ప్రధానంగా కిడ్నీ, మూత్రపిండాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో తాగునీరు కలుషితం కావడం, కాలుష్య కారక రసాయన వాయువులు పిల్చడం తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వడం లేదు. ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోతోంది. బాధిత గ్రామాల్లో పంట పొలాలు సైతం బీడువారుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను కందివలస గెడ్డతో పాటు చెరువులు, కాలువలు, చివరకు పొలాల్లో సైతం విడిచిపెడుతున్నారు. పైడిభీమవరం, నారువ, సరగడపేట, చిల్లపేట, గొల్లపేట, బోయపాలెం సమీప పొలాలు, తోటల్లో వ్యర్థాలను పారబోసి నిప్పుపెడుతున్నారు. వాస్తవానికి వ్యర్థాలను విశాఖ పంపించి రీసైక్లింగ్‌ చేయాలి. కానీ కంపెనీలకు అదనపు భారం పడుతుందని భావించి ఖాళీ ప్రదేశాల్లో విడిచిపెడుతున్నాయి. గత ఏడాది జూన్‌ 2న పారిశ్రామికవాడ సమీపంలో వ్యర్థాలను తగులబెట్టే సమయంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించడంతో పరిశ్రమల్లో ప్రమాదం జరిగిందని స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగుతీశారు. చివరకు చుట్టుపక్కల మండలాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించి భారీ రెస్క్యూ ఆపరేషన్‌ చేసి మండలను అదుపు చేయాల్సి వచ్చింది. 


ఇబ్బందిపడుతున్నాం

కాలుష్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.. భూగర్భ జలాలు కలుషితమై తాగునీరు కూడా దుర్వాసన వస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఆశపడ్డాం. కానీ రసాయనిక పరిశ్రమలు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు స్థానికులకు ఉద్యోగ అవకాశాల హామీ అటకెక్కింది. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి.

- ఆర్‌.శ్రీనివాసరావు, పైడిభీమవరం


ఆరోగ్యానికి దెబ్బ

పైడిభీమవరంతో పాటు పరిసర గ్రామాల్లో రోగాలు ప్రబలుతున్నాయి. కిడ్నీ, మూత్రపిండాల వ్యాధులతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. నడి వయస్కులు రుగ్మతలతో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాయు, జల కాలుష్యంతోనే రోగాలు ప్రబలుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామాలను విడిచిపెట్టడం తప్ప వేరే గత్యంతరం లేదు.  

 - మీసాల శ్రీనివాసరావు, పైడిభీమవరం


తనిఖీ చేస్తున్నాం

ఎప్పటికప్పుడు పరిశ్రమలను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలు పక్కాగా అమలుచేయాలని యాజమాన్యాలకు  ఆదేశించాం. పరిశ్రమల వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ విడిచిపెడితే కఠినచర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు నడిపితే కేసులు నమోదుచేస్తాం. 

- శంకర్‌నాయక్‌, కాలుష్య నియంత్రణ అధికారి, శ్రీకాకుళం

Updated Date - 2022-07-03T04:44:43+05:30 IST