పారిశ్రామిక వాడలు..నిర్లక్ష్యపు నీడలు..!

Published: Sun, 27 Mar 2022 12:12:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పారిశ్రామిక వాడలు..నిర్లక్ష్యపు నీడలు..!

అగ్గి రాజుకుంటే అంతే

 ఇరుకు రోడ్లు.. పట్టని నిబంధనలు

 ఫైరింజన్లూ వెళ్లే పరిస్థితి లేదు

 ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తింపు


రోడ్ల పక్కనే ప్లాస్టిక్‌ వ్యర్థాల కుప్పలు, బహిరంగ ప్రదేశాల్లో సిలిండర్లు, కేబుల్‌ వైర్లు, ఆయిల్‌ డ్రమ్ములు, ఇరుకైన రహదారులు .. ఇదీ ఉప్పల్‌ పారిశ్రామిక వాడలో పరిస్థితి. గోదాంలు, పరిశ్రమల్లో అగ్నిమాపక ఏర్పాట్ల ఊసు      దాదాపుగా లేదు. 

నగరంలోని భారీ పారిశ్రామిక ప్రాంతాల్లో కాటేదాన్‌ ఒకటి. ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువులు, దుస్తులు, స్టీల్‌, ఇతరత్రా గోదాముల పరిశ్రమలు వందల సంఖ్యలో ఇక్కడున్నాయి. మెజార్టీ గోదాములు, పరిశ్రమల్లో ఫైర్‌ సేఫ్టీ కనిపించదు. గతంలో పలుమార్లు జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. 

రసాయన పరిశ్రమలు, గోదాములు ఎక్కువగా ఉండే మరో ప్రాంతం జీడిమెట్ల. ఇక్కడి చాలా గోదాములకు అనుమతులుండవు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే స్ర్కాప్‌, ఇతరత్రా వ్యర్థాలను నిల్వ చేస్తున్నారు. అనుకోని దుర్ఘటనలు జరిగితే.. మండే స్వభావమున్న రసాయనాలతో ముప్పు మరింత పెరిగే ప్రమాదముంది. 


హైదరాబాద్‌ సిటీ: నగరంలోని మెజార్టీ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో ఇదే దుస్థితి. ప్రమాదవశాత్తు అగ్గి రాజుకుంటే ఇక అంతే. ఆస్తులే కాదు,  మనుషుల ప్రాణాలూ అగ్నికి ఆహుతి కావాల్సిందే. ప్రారంభ దశలో మంటలార్పే పరిస్థితి (ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు) దాదాపు ఎక్కడా కనిపించడం లేదు. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పారిశ్రామిక వాడల్లో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు బహిర్గతమయ్యాయి. అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.  


యజమానులకు పట్టదు..  

నగరంలో చర్లపల్లి, నాచారం, మల్లాపూర్‌, సనత్‌నగర్‌, గాజులరామారం, బోయిగూడ తదితర ప్రాంతాల్లో గోదాములు, పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు ఉపాధిని వెతుక్కుంటూ వచ్చిన కార్మికుల భద్రతను యజమానులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం అగ్నిమాపక ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా ఖాతరు చేయడం లేదు. అధికార యంత్రాంగమూ ఆయా అంశాలను చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తోంది. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో నిర్వాహకులూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. 


కచ్చితమైన వివరాల్లేవు..

గ్రేటర్‌లో ఎన్ని గోదాములు, ఎన్ని పరిశ్రమలున్నాయి, వాటిలో అనుమతి ఉన్నవెన్ని, అనే కచ్చితమైన వివరాలు ఏ విభాగం వద్ద లేవు. బోయిగూడ ఘటన నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించిన హోంమంత్రి మహమూద్‌ అలీ గోదాములు, పరిశ్రమల వివరాలు అడిగితే అధికారులు తెల్లమొహం వేశారు. సూత్రప్రాయ అంచనా ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 18వేలకుపైగా గోదాములున్నట్టు చెబుతున్నారు. వీటిలో 50 శాతానికిపైగా అక్రమంగా ఏర్పాటు చేసినవే. 95 శాతానికిపైగా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. అయినా ఒక్క గోదాంను సీజ్‌ చేసిన దాఖలాలు కూడా ఇటీవలి కాలంలో లేవు. 


పని ప్రాంతాల్లోనే బస..

గోదాం/పరిశ్రమల్లో పని చేస్తోన్న కార్మికుల్లో చాలా మంది అక్కడే బస చేస్తున్నారు. యజమానులు కార్మికుల కోసం ప్రాంగణంలోనే వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా అవసరాల దృష్ట్యా గోదాములను పూర్తిగా మూసి వేస్తారు. లోపలే కార్మికులూ ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగితే బయటపడే అవకాశం దాదాపుగా ఉండడం లేదు. బోయిగూడలోనూ అదే జరిగింది. గదిలో నుంచి కిందకు వచ్చే అవకాశం లేకపోవడంతో 11 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు. నిబంధనల ప్రకారం కార్మికులకు పని ప్రాంగణాల్లో వసతి ఏర్పాటు చేయకూడదు. ఈ నిబంధనలు అమలు కావడం లేదు. తాజా ఘటన నేపథ్యంలో గోదాములు, పరిశ్రమల్లో కార్మికులు బస చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

హైదరాబాద్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.