ఆలయ ఆవరణలో శిశువు అపహరణ

ABN , First Publish Date - 2022-05-17T05:55:51+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం పరిసరాల నుంచి 27 రోజుల వయసు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోగా గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల ఆచూకీని పసిగట్టిన పోలీసులు శిశువును తల్లికి అప్పగించారు.

ఆలయ ఆవరణలో శిశువు అపహరణ
వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ చంద్రకాంత్‌

- గంటల వ్యవధిలో కథ సుఖాంతం

- తల్లికి అప్పగించిన పోలీసులు

వేములవాడ, మే 16 :  వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం పరిసరాల నుంచి 27 రోజుల వయసు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోగా గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల ఆచూకీని పసిగట్టిన పోలీసులు శిశువును తల్లికి అప్పగించారు. వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన లావణ్య  భర్తతో విబేధాల కారణంగా తన రెండేళ్ల కొడుకు సనత్‌కుమార్‌, 27 రోజుల వయసున్న చిన్న కొడుకుతో కలిసి నాలుగు రోజులుగా వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం మెట్ల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో తిరుపతిలోని అలిపిరికి చెందిన చాడి అభితేజ అలియాస్‌ రవితేజ-సునీత దంపతులతో పరిచయం ఏర్పడింది. సునీత-రవితేజ ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వర్షం పడడంతో మద్యం మత్తులో నిద్రపోతున్న లావణ్య లేచిచూసింది. 27 రోజుల చిన్న కుమారుడు కనిపించలేదు. రాత్రి తనకు మద్యం తాగించిన సునీత-రవితేజ దంపతులే తన కొడుకును ఎత్తుకుపోయారన్న అనుమానంతో ఆలయ పరిసరాల్లో గాలించింది. అయినా లాభం లేకపోవడంతో ఉదయం 6 గంటలకు వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పట్టణ సీఐ  వెంకటేశ్‌ తన బృందంతో రంగంలోకి దిగారు. ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌తోపాటు తిప్పాపూర్‌ బస్టాండ్‌ సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. బాబును ఎత్తుకొని వరంగల్‌ వైపు వెళ్తున్నట్లు గుర్తించి వరంగల్‌  పోలీసులకు సమాచారం అందించారు. వారి సహాయంతో వరంగల్‌ బస్టాండ్‌లో సునీత రవితేజను అదుపులోకి తీసుకున్నారు. శిశువును క్షేమంగా వేములవాడకు తీసుకొచ్చారు. తల్లి లావణ్యకు అప్పగించారు. కిడ్నాప్‌ కేసును గంటల వ్యవధిలో ఛేదించి శిశువును తల్లికి అప్పగించిన పట్టణ సీఐ వెంకటేశ్‌, పోలీసు సిబ్బందిని డీఎస్పీ చంద్రకాంత్‌ అభినందించారు.

Updated Date - 2022-05-17T05:55:51+05:30 IST