చెరువులో పసికందు మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-05-21T05:02:35+05:30 IST

చెరువులో పసికందు మృతదేహం లభ్యం

చెరువులో పసికందు మృతదేహం లభ్యం
నీటిలో శిశువు మృతదేహం

మొయినాబాద్‌, మే 20: ఆ తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది. పురుటి నొప్పులను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ ముక్కుపచ్చలారని పసికందు పుట్టిన ఏడు రోజులకే చెరువులో విగతజీవిగా మారింది. ఈహృదయ విదారక ఘటన మొయినాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఎన్కేపల్లి చెరువులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎన్కేపల్లి గ్రామం వద్ద ఉన్న చెరువులో ఏడురోజుల వయస్సు ఉన్న పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. పసికందు మృతదేహం నీటిపై తేలడాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించారు. పసికందు మగబిడ్డ అని గుర్తించారు. కాగా ఈనెల 14వ తేదీన జన్మించినట్లు ఆసుపత్రి వారు వేసిన ట్యాగ్‌ చేతికి ఉన్నట్లు గమనించారు. బాబు బరువు 1.64 కేజీలు ఉంది. ట్యాగ్‌పై తల్లి పేరు అనూష, తండ్రి శివకుమార్‌ అని ఉందని పోలీసులు తెలిపారు. పసికందును రెండు రోజుల క్రితం చెరువులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-05-21T05:02:35+05:30 IST