మీడియాతో మాట్లాడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంటు అదనపు ఎస్పీ చక్రవర్తి
ఎన్‌ఫోర్స్‌మెంటు అదనపు ఎస్పీ చక్రవర్తి
కడప(క్రైం), డిసెంబరు 2: జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా, నాటుసారా తయారీ, దేశీ మద్యం, బెల్టుషాపులతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంటు అదనపు ఎస్పీ కె.చక్రవర్తి పేర్కొన్నారు. తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటి వరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు దాడులు నిర్వహించామని, ఇకపై మట్కా, జూదం, బెట్టింగ్, గుట్కా, గంజాయి విక్రయాలపై నిఘా ఉంచామని, ఎవరైనా నేరానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇప్పటికే తమ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఉంచామని, ఇందుకోసం ఆరు మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తప్పుడు పనులకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాలకు కానీ, ఇసుక అక్రమ రవాణాలపై సమాచారం ఉంటే 9121100663కు తెలపాలని కోరారు.