కళల వారసత్వం, మేధావి సాహచర్యం

ABN , First Publish Date - 2022-03-13T06:42:10+05:30 IST

‘నేను,వరూధినిని, హమ్మయ్య, మీ ఫోను బాగయింది. ఇక మనం మాట్లాడుకోవచ్చు!’ అనే సంబరం, ఆప్యాయత దూరమై నెలరోజులైంది. సాయంత్రం 6–8 గంటల మధ్య మోగే మా లాండ్‌లైన్‌ ఇప్పుడు మూగబోయింది. ఎంతో జీవితాన్ని చూసి...

కళల వారసత్వం, మేధావి సాహచర్యం

‘నేను,వరూధినిని, హమ్మయ్య, మీ ఫోను బాగయింది. ఇక మనం మాట్లాడుకోవచ్చు!’ అనే సంబరం, ఆప్యాయత దూరమై నెలరోజులైంది. సాయంత్రం 6–8 గంటల మధ్య మోగే మా లాండ్‌లైన్‌ ఇప్పుడు మూగబోయింది. ఎంతో జీవితాన్ని చూసి, ఎన్నో ఆటుపోట్లని తట్టుకుని, బతుకు మీద తీపితో 97 ఏళ్లు నిండుగా బతికిన కొడవటిగంటి వరూధిని ఫిబ్రవరి 9న వెళ్లిపోయింది.


ప్రముఖ నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతి, పాత్రికేయులు కొమ్మూరి వెంకట్రామయ్యల ప్రథమ సంతానంగా కొడవటిగంటి వరూధిని గుంటూరులో జన్మించింది. ఆడవాళ్ళు నటించడాన్ని విడ్డూరంగా చూసే కాలంలోనే కొమ్మూరి పద్మావతి బళ్ళారి రాఘవాచార్యతో అనేక నాటకాలలో, ‘రైతు బిడ్డ’ లాంటి కొన్ని సినిమాలలో నటించారు. ఆమె కథకురాలు కూడా. ‘ఆంధ్రప్రభ’లో స్త్రీల శీర్షిక నిర్వహించారు. ప్రముఖ రచయిత చలం వరూధిని పెదనాన్న. దత్తుకు వెళ్ళి గుడిపాటి అయ్యాడు. ఆయనే వరూధినికి పేరు పెట్టాడు. వరూధిని తమ్ముడు కొమ్మూరి సాంబశివరావు తెలుగువారి అభిమాన డిటెక్టివ్ నవలా రచయిత. చెల్లెలు ఉషారాణి (భాటియా) నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగం మాజీ సంపాదకురాలు, రచయిత్రి. ఈమె రెండేళ్ళక్రితం మరణించారు. వరూధిని కూతురు శాంతసుందరి ప్రముఖ అనువాదకురాలు, సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత. ఈమె 2020 నవంబర్‌లో మరణించారు. కుమారుడు రోహిణీ ప్రసాద్ అణుశాస్త్రవేత్త, సైన్స్ రచయిత. ఈయన 2012లో మరణించారు. తురగా జానకీరాణి కూడా వీరి బంధువే. వరూధిని కూడా కొన్ని నాటకాలలో నటించారు. గాలి బాలసుందర రావు ‘అపోహ’లో ఆమెది ప్రముఖ పాత్ర. శ్రావ్యమైన స్వరం, లలిత సంగీతంలో నిష్ణాతురాలు. ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె పాడిన బసవరాజు ‘యశోధరా విలాపం’ విని తన్మయులైన నీలంరాజు లక్ష్మీప్రసాద్ (ఆధ్యాత్మిక వ్యాస రచయిత) తన పెద్ద కుమార్తెకు ‘యశోధర’ అని పేరు పెట్టారట. కొడవటిగంటి కుటుంబరావు (కొకు) రచనలను అమితంగా ఇష్టపడే వరూధిని 1945లో ఆయనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దుర్గాబాయ్ దేశముఖ్ ఈ వివాహం జరిపించారు. అప్పటినుంచి కొకు రాసిన ప్రతీ రచనను వరూధిని భద్రపరిచారు, రచనావ్యాసంగంలో తోడుగా నిలిచారు. కొకు మరణం తర్వాత విశాలాంధ్ర, విరసం ప్రచురించిన 16 సంపుటాల కొకు సమగ్ర సాహిత్యానికి వరూధిని సహకారం చెప్పుకోదగ్గది.


వరూధినితో గంటలకొద్దీ ఊసులు కలబోసుకునే స్నేహం నన్ను అబ్బురపరిచేది. ఏమిటీ అనుబంధం? ఏమిటీ స్నేహం? అనుకోని చోట నుంచి ముంచెత్తే ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. దాదాపు పదేళ్లుగా పెనవేసుకున్న ఈ బంధం కాకతాళీయంగా జరిగింది. విరసంలో నా భాగస్వామ్యం వల్ల కొడవటిగంటిని దగ్గరగా చూశాను. విరసం సభల్లో ఆయన పక్కన కూర్చొని భోంచేయడం ఒక నిండు జ్ఞాపకం. 1973లో మద్రాసు వెళ్లి చందమామ బిల్డింగులో ఆయన్ని కలుసుకుని, ప్రెస్‌ అంతా ఆయన కలయతిప్పి చూపిస్తుంటే మరొక కొకుని చూశాం. చిన్న వయసులో కొకు ‘పంచకల్యాణి’తో ప్రభావితమయ్యాం; ఆయన ‘చదువు’ మా కెంతో ప్రేరణ నిచ్చింది. కుటుంబరావు లోతుని, విస్తృతిని ఆయన సమగ్ర సాహిత్యంతో అర్థం చేసుకున్నాం. కొకు కొనసాగింపుగా మాకు వరూధిని స్నేహం దక్కిందేమో! ఆమెని మొదటిసారి మద్రాసులో ఆనాడు చూడటం గుర్తు. మళ్లీ హైదరాబాదులో ఒకసారి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో సభ ముగిసి బయటకు వస్తుంటే, శాంతసుందరితో కలిసి వరూధిని చలం మీటింగు కోసం లోపలికి వస్తూ చాలా ఏళ్ల తర్వాత కనిపించారు. అలా పరిచయం క్రమంగా పెరిగి, వైద్యపరంగా రోజువారీ సలహాలు ఇవ్వడంతో మా శ్రీనివాస్‌తో, నాతో ఆమె అనుబంధం పెరిగింది. అది క్రమంగా నాతో ఎక్కువగా మాట్లాడటంగా, అప్పుడప్పుడు ‘మీవారున్నారా?’ అని వైద్యం కోసం శ్రీనివాస్‌ని అడగటంగా మిగిలింది.


అప్పటికే ఆమె వినికిడి తగ్గుతోంది. చూపు మందగిస్తోంది. కంటి ఆపరేషన్ల తర్వాత మళ్లీ చదువే కాలక్షేపంగా, అప్పుడప్పుడు టీవీలో పాత సినిమాలు చూడటం వ్యాపకంగా గడిపేది. చూపు మరింత తగ్గాక ఆ కాలక్షేపం కూడా లేక జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, జీవితాన్ని ప్రేమిస్తూ సాగేది. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించినా, జ్ఞాపకశక్తి తగ్గలేదు. మాట ధాటి తగ్గలేదు. నమ్మకాలు సడలలేదు. అసంబద్ధ ప్రేలాపనల మీద, అశాస్త్రీయ భావాల మీద దండెత్తి, గంటలకొద్దీ వాటిని ఖండిస్తూ మాట్లాడేది. తన అభిప్రాయాలని నిక్కచ్చిగా ప్రకటించేది. సాహిత్య లోకంలో వస్తున్న అభ్యంతరకర పోకడలను నిర్ద్వంద్వంగా ఖండించేది.


ఆమె కొకు జ్ఞాపకాలని పంచుకునేది. కొకు కథల మీద ఎన్నో విషయాలు చెప్పేది. ఆయన ఒక్కసారిగా రాసి పడేస్తారని, తుడిచివేతలు, కొట్టివేతలు, మళ్లీ తిరగరాయడాలు ఉండవని, నచ్చకపోతే చించేసేవారని, ఆయన కథలని భద్రపరచి, వాటి మేలుప్రతిని తాను కాపీ చేసేదానినని ఆమె చెప్పేది. కొడవటిగంటికి వరూధిని తండ్రితో స్నేహం. వారిద్దరూ సాహిత్యాన్ని చర్చిస్తూ ఉండేవారు. కొకు కథలంటే ప్రాణం వరూధినికి. పెళ్లి చేసుకుంటే ఆయన్నే చేసుకుంటానని ఆమె పట్టుబడితే, వయసు తేడా రీత్యా కొకు అభ్యంతరపెట్టారని, పైగా అది రెండో పెళ్లని, అయినా తన పట్టుదల మీదే తమ పెళ్లి జరిగిందని ఆమె చెప్పేది. కొకుతో ఆమె సన్నిహితంగా మెలిగిన జ్ఞాపకాలని ఆయన జీవిత చరిత్రగా రాయమని లేదా ఆమె వాటిని కలబోసుకుంటే రికార్డు చేసి తామే రాస్తామని కొందరు సూచిస్తే ఆమె మండిపడేది. ‘కొకు సాహిత్యమే ఆయన జీవితం. అదే ఆయన సంతకం. అవికాక ఆయన పెళ్లిళ్లు, పిల్లలు, లోటుపాట్లు, ఎగుడు దిగుళ్లు ఈ ప్రపంచానికి ఎందుకు?’ అని సూటిగా ప్రశ్నించేది. ఆయన రచనా వ్యాసంగంలో ఉద్యోగాల్లో మునిగిపోయి ఇంటి బాధ్యతంతా తనకే వదిలేస్తే, ఎప్పుడో చిన్నపిల్లగా ఉండగా, తన తల్లి పద్మావతి నటనా వ్యాసంగంతో ఊళ్లు తిరుగుతుంటే, తను పెద్దపిల్లగా తండ్రితో కలిసి తోబుట్టువులని సంబాళించిన అనుభవంతో తన ఇంటి బాధ్యతని కూడా నెత్తికెత్తుకోగలిగింది. ఒకే ఇతివృత్తంతో అనేక పాత్రలని సృష్టించిన కొడవటిగంటి ఏ కథకి, ఏ పాత్రకి పోలిక లేకుండా, అంత జీవితాన్ని ఎలా ఆవిష్కరించగలిగారని నేను ఆశ్చర్యపోతుంటే, జీవితం మీద కుటుంబ వ్యవస్థ మీద, మనుషుల మీద ఆయనకి ఉన్న గాఢమైన అనుభూతులని, ప్రేమని, లోతుని ఆమె ఇష్టంగా వివరించేది. కూలిపోతున్న అనుబంధాలని, కుటుంబాలని చూస్తుంటే ఆమె బాధపడేది. ఆయన సాహిత్యాన్ని సజీవంగా ఉంచడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుందేమో అనిపించేది. అలా కొకు మా అనుబంధాన్ని మరింత బలోపేతం చేశారు. ఒకసారి మా అమ్మ రాస్తున్న వ్యాసాన్ని పరిపుష్టం చేయడం కోసం కొకు కథలన్నీ చాలా ఏళ్ల తరువాత ఏకబిగిన చదివి, ఆ మహత్తర అనుభూతిని పంచుకోకుండా ఉండలేక ఆమెకి ఫోను చేస్తే, వరూధిని కూడా నా ఉత్సాహంలో ఓలలాడారు.


వరూధినికి బాలమురళి సంగీతం ఇష్టం. కుటుంబ సమేతంగా ఆయన కచేరీలకు వెళ్ళేవారు. దాని కొనసాగింపుగా రోహిణీ ప్రసాద్‌ సితార్‌ నేర్చుకున్నాడేమో! మా చెల్లి పద్మిని వీణ సాధన చేస్తూనే మాతో కలిసి జననాట్యమండలి ప్రదర్శనలో పాడేదని, అలాగే టి.ఎం. కృష్ణ ‘పోరంబోకు’ పాటలో అభివృద్ధికర భావాలని వినిపించాడని చెప్తే ఆమె ఆసక్తిగా వినేది. మద్రాసుతో ఆమె అనుబంధం విడదీయరానిది. ఆమె కొకుతో, పిల్లలతో గడిపిన నిండైన కాలం అది. అక్కడ ఆమె ఇంటిని కొనుక్కున్నవారు ఆమెని చూడటానికి హైదరాబాద్‌ వస్తే ఆమె ఎంతో పొంగిపోయింది. కుటుంబం గురించి ఏమీ పట్టనట్టు ఉండే కొకు, కొడుకు రాక కోసం గంటలకొద్దీ రైల్వేస్టేషన్‌లో వేచి ఉండడం ఆమెని ఆశ్చర్యపరిచేది. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ కొడుకు అకస్మాత్తుగా చనిపోతే, బొంబాయి వెళ్లి చూడలేకపోయిన నిస్సహాయత ఆమెని చివరివరకు వెంటాడేది.


లాక్‌డౌన్‌కి వారం ముందు వరూధినిని చూడడానికి తెల్లాపూర్‌ వెళ్లాం. దారి తెలియక సతమతమవుతూ వెనక్కి వెళ్లిపోదామనుకుంటూ ఉండగా ఇల్లు దొరికింది. శాంతసుందరి, గణేశ్వర్రావు గుమ్మంలోనే ఆప్యాయంగా ఆహ్వానించారు. అప్పటికి బాత్రూంలో పడడం వల్ల వరూధిని మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఆరోగ్యం గురించి కనుక్కుని, శాంతసుందరి ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమె అనువదించిన ‘సేపియన్స్‌’ని అందుకుని ఇంటికి వచ్చిన వారానికే శాంతసుందరికి కాన్సర్‌ బయటపడింది. నిండుగా నవ్వుతూ కనిపించిన మనిషి మరి లేచి నిలబడలేదు. కూతురి చేతిమీదుగా వెళ్లిపోవాలి అనుకున్న ముసలి తల్లి కోరిక నెరవేరకుండానే, కొవిడ్‌ సమయంలో శాంత ఎంతో శారీరక బాధని అనుభవిస్తూ నిష్క్రమించింది.


వయోభారంతో క్రమంగా అవయవాలన్నీ అదుపు తప్పుతున్నా గాని, వరూధిని జ్ఞాపకశక్తి, చమత్కారం, శాస్త్రీయ దృక్పథం చెక్కుచెదరలేదు. ఆమె వ్యంగ్యోక్తుల వన్నె తగ్గలేదు. సమకాలీన సమస్యలన్నిటిపైనా ఆమె కామెంట్‌ నీరు కారలేదు. ఆమె పకపక నవ్వులు, దృఢచిత్తం, అపురూపమైన జ్ఞాపకాలు, పంచిన ప్రేమ, చూపిన తెగువ, క్లిష్టమైన స్వభావాలని అంచనా వేయగల నేర్పు, ప్రజల కోసం పనిచేసే వారి పట్ల గౌరవం, మంచి సాహిత్యంపై మక్కువ, ఆమె కళాభిమానం, ఆత్మగౌరవం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కొకు భార్యగానో, రోహిణీప్రసాద్‌, శాంతసుందరిల తల్లిగానో కాక ఒక మంచి మనిషిగా, దృఢమైన మనిషిగా, ప్రేమ నిండిన మనిషిగా చెడును చెండాడే మనిషిగా, జీవితాన్ని సమగ్రంగా జీవించే మనిషిగా, ఒక నిండైన మనిషిగా, సంప్రదాయాలని, ఆచారాలని, తంతులని వ్యతిరేకించిన మనిషిగా వరూధిని సదా గుర్తుండిపోతుంది. గొప్ప వ్యక్తిత్వం గల ఆమెకు ఇదే నా నివాళి.

డాక్టర్‌ నళిని

Updated Date - 2022-03-13T06:42:10+05:30 IST