రైతులను దగా చేసిన వైసీపీకి పుట్టగతులుండవ్‌

ABN , First Publish Date - 2021-09-18T05:52:16+05:30 IST

ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులను దగా చేశారని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు.

రైతులను దగా చేసిన వైసీపీకి పుట్టగతులుండవ్‌
పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించిన గవిరెడ్డితో పోలీసులు వాగ్వాదం

 

‘రైతు కోసం టీడీపీ‘లో గవిరెడ్డి రామానాయుడు

వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు

రోడ్డుపై బైఠాయించిన నాయకులు

పోలీసులతో నేతల వాగ్వాదం

అరెస్టు చేసిన పోలీసులు

మాడుగుల, సెప్టెంబరు 17: ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులను దగా చేశారని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు. రైతులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులుం డవన్నారు. శుక్రవారం ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మాడుగులలో నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో పథకాల కోతలు, అణచివేతలు, కూల్చివేతలు, తీసివేతలు జరుగుతున్నాయే తప్ప అభివృద్ధి ఊసే లేదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. రైతుకి తోడుగా టీడీపీ శాంతియుత పోరాటానికి దిగితే దాన్ని కూడా పోలీసులతో అడ్డుకోవడం దారుణమన్నారు. అభయ హస్తం పింఛన్‌ని ఈ ముఖ్యమంత్రి రద్దు చేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో టీడీపీ హయాంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రారంభించడానికి సిగ్గులేదా అని గవిరెడ్డి ప్రశ్నించారు. అనంతరం రైతు సమస్యలపై తహసీల్దార్‌కి వినతిపత్రాన్ని అందించేందుకు ర్యాలీగా బయలుదేరిన గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాదరావు, పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గవిరెడ్డితో సహా మిగిలిన వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గవిరెడ్డి, పోలీసుల మఽధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం గవిరెడ్డిని పోలీసులు బలవంతంగా పోలీస్‌ వాహనాన్ని ఎక్కించడంతో టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డాయి. ఈ సందర్భంగా పైలా ప్రసాదరావుతో సహా పది మందిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై చోడవరం సీఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహమ్మద్‌, మాడుగుల ఎస్‌ఐ పి. రామారావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల టీడీపీ నాయకులు పుప్పాల అప్పలరాజు, గొల్లవిల్లి శ్రీరామూర్తి, లెక్కల కాశిబాబు, రంజిత్‌వర్మ, ఉండూరు దేముడు, పీవీజీ కుమార్‌, సత్యవతి, బండారు రామారావు, సూర్యనారాయణ, పోతల చిన్నంనాయుడు, రమణమ్మ, బొబ్బాది తాతారావు, రొంగళి మహేష్‌, పూడి నారాయణమూర్తి, జూరెడ్డి రాము, మద్దాల రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T05:52:16+05:30 IST