కొర్రమీను పిల్లల ఉత్పత్తికి శ్రీకారం

ABN , First Publish Date - 2022-07-07T06:15:40+05:30 IST

కొర్రమీను పిల్లల ఉత్పత్తికి శ్రీకారం

కొర్రమీను పిల్లల ఉత్పత్తికి శ్రీకారం
కొర్రమీను చేపలను పరిశీలిస్తున్న డాక్టర్‌ రాజేష్‌కుమార్‌, ఏడీఎఫ్‌ ఆంజనేయస్వామి

వైరా విత్తనోత్పత్తి కేంద్రంలో మూడేళ్ల తర్వాత ప్రక్రియ

వైరా, జూలై 6: కొర్రమీను(మరల్స్‌) చేపపిల్లల విత్తనోత్పత్తికి వైరాలోని చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రంలో శ్రీకారం చుట్టారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కేంద్రానికి చెందిన సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌(సిపా)తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇక్కడ కొర్రమీను చేపపిల్లల ఉత్పత్తిని చేపట్టారు. తొలుత 2018 ఆగస్టులో ఇక్కడ కొర్రమీను చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించగా.. ఆతర్వాత వాతావరణం అనుకూలించక, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లాంటి అనేక ఆటంకాలతో మూడేళ్లుగా ప్రణాళిక ముందుకు సాగలేదు. ప్రస్తుతం అన్ని రకాలుగా అనుకూలిస్తుండటంతో మళ్లీ రెండోసారి కొర్రమీను పిల్లల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు తెల్లచేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియ మాత్రమే ఉండగా.. నల్లచేపలు(కొర్రమీను) పిల్లల ఉత్పత్తిని ప్రయోగాత్మకంగా చేపట్టింది. అందుకు రాష్ట్రం మొత్తంమీద వైరా విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో వైరాలో కొర్రమీను చేపపిల్లలు ఉత్పత్తి చేసి ఫలితాలు సాధించిన తర్వాత రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఆ ప్రక్రియ చేపట్టి చెరువుల్లో ఆపిల్లలు సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వైరా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బుజ్జిబాబు ఆధ్వర్యంలో నెలరోజుల కిందట మగ, ఆడ కొర్రమీను చేపలను సేకరించి వాటిని వేర్వేరు నర్సరీల్లో నిల్వ చేశారు. మంగళవారం రాత్రి కొర్రమీను ఆడ, మగ చేపలను వేరు చేసి వాటికి ఓవాటైడ్‌ హార్మోన ఇంజక్షన్‌ చేసి ఆడ, మగ చేపలను ఒక జతగా టబ్బులో వేశారు. 18గంటల తర్వాత ఈ చేపల నుంచి అండం విడుదలై గుడ్లు వస్తాయి. వీటిని సంరక్షించి వాటి ద్వారా కొర్రమీను పిల్లలను హార్చరీ ద్వారా సాధించనున్నారు. 800గ్రాముల నుంచి 1100గ్రాముల బరువున్న కొర్రమీను చేపపిల్లలను సేకరించి వాటి ద్వారా పిల్లల ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు. నెలరోజుల నుంచి కొర్రమీను చేపలకు జీవించి ఉన్న చిరుచేపలను ఆహారంగా అందిస్తున్నారు. సిఫాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ రాజే్‌షకుమార్‌ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏడీఎఫ్‌ ఆంజనేయస్వామి, ఎఫ్‌డీవో బుజ్జిబాబు, సిబ్బంది ఈ ప్రక్రియకు అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నారు.

Updated Date - 2022-07-07T06:15:40+05:30 IST