Neeraj Chopra: కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు షాక్.. గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా అవుట్!

ABN , First Publish Date - 2022-07-26T21:38:32+05:30 IST

ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, ప్రపంచ చాంపియన్‌షిప్

Neeraj Chopra: కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు షాక్.. గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా అవుట్!

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) నుంచి తప్పుకున్నాడు. అమెరికాలోని యుజీన్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో నీరజ్ గజ్జల్లో గాయమైంది. ఎమ్మారై స్కాన్ నిర్వహించిన వైద్యులు నీరజ్ నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు.


 నీరజ్ 100 శాతం ఫిట్‌గా లేడన్న విషయాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు తెలియజేసినట్టు చెప్పారు. గజ్జల్లో గాయం కారణంగా వైద్యులు నీరజ్‌ను నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారని, కాబట్టి కామన్వెల్త్ గేమ్స్‌లో అతడు పాల్గొనబోడని పేర్కొన్నారు. బర్మింగ్‌హామ్‌లో గురువారం కామన్వెల్త్ గేమ్స్‌ ప్రారంభం కానున్నాయి. 24 ఏళ్ల నీరజ్ ప్రారంభ వేడుకల్లో భారత పతకాన్ని చేబూని ముందుకు సాగాల్సి ఉంది. అయితే, ఇప్పుడతడు గేమ్స్ నుంచి తప్పుకోవడంతో మువ్వన్నెల జెండాను చేపట్టి భారత బృందాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారన్న విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.  


నీరజ్ గాయం ప్రభావం డైమండ్ లీగ్‌ పైనా పడే అవకాశం ఉంది. ఆగస్టు 26న లాసాన్ డైమండ్ లీగ్‌ (Diamond League)లో చోప్రా పాల్గొనాల్సి ఉండగా ఇప్పడది ప్రశ్నార్థకంగా మారింది. స్టాక్‌హోమ్‌లో రెండో స్థానంలో నిలిచిన చోప్రా.. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జ్యూరిచ్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో నీరజ్ మాట్లాడుతూ.. డైమండ్ లీగ్ టైటిల్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు ఆ లీగ్‌లో పాల్గొనడమే ప్రశ్నార్థకమైంది.

Updated Date - 2022-07-26T21:38:32+05:30 IST